
విజయ్ మాల్యా-లలిత్ మోదీ.. ఒకప్పుడు వీవీఐపీలుగా చెలామణి అయిన పెద్ద మనుషులు. ఇప్పుడు భారత ప్రభుత్వం దృష్టిలో ఆర్థిక నేరగాళ్లుగా పరాయి దేశాల్లో తలదాచుకుంటున్న వ్యక్తులు. అయితే ఈ ఇద్దరూ కలిసి ఓ పార్టీలో తెగ ఎంజాయ్ చేస్తూ గడిపిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
I Did It My Way అంటూ అలనాటి అమెరికన్ సింగర్ ఫ్రాంక్ సినాత్రా(Frank Sinatra) పాడిన ప్రసిద్ధ గీతాన్ని ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ-పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా కలిసి ఆలపించారు. లండన్‌లో గత ఆదివారం తన నివాసంలో లలిత్ మోదీ ఇచ్చిన పార్టీలో ఇది జరిగింది. ఈ విలాసవంతమైన పార్టీ వీడియోను ఈ వీడియోను లలిత్ మోదీ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. పైగా ముందుగానే ఏం జరుగుతుందో ఊహిస్తూనే.. “Controversial for sure. But that’s what I do best” అంటూ సందేశం ఉంచారు. ఇప్పుడు నెట్టింట ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఈ గ్రాండ్ ఈవెంట్‌ను లలిత్ మోదీ తన నివాసంలోనే నిర్వహించారట. ప్రపంచం నలుమూలల నుంచి 310 మందికి పైగా అతిథులు హాజరయ్యారని ఆయన తెలిపారు. వాళ్లలో విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ కూడా ఉన్నారు. ఈ వీడియో ఇంటర్నెట్‌ను కుదిపేయకపోతే మంచిదే. వివాదాస్పదమైతే ఏముంది... అదే నా స్టైల్! అంటూ లలిత్ మోదీ చివర్లో సందేశం ఉంచారు.
గేల్ గతంలో ఐపీఎల్ ఆర్సీబీ జట్టుకు ఆడిన సంగతి తెలిసిందే. గేల్ సైతం తన మాజీ బాస్‌లు లలిత్ మోదీ, మాల్యాలతో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, “We living it up. Thanks for a lovely evening” అని రాశారు.
లలిత్ మోదీ 2010లో భారతదేశం విడిచి యూకేలో నివసిస్తున్నారు. ఆయనపై బిడ్ రిగ్గింగ్, మనీలాండరింగ్, విదేశీ మారక చట్ట ఉల్లంఘనల ఆరోపణలు ఉన్నాయి. విజయ్ మాల్యా రూ.9,000 కోట్ల రుణ డిఫాల్ట్ కేసులో భారత్‌కు కావలసిన నిందితుడు. 2017లో లండన్‌లో అరెస్టయ్యారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఈ ఇద్దరూ చట్టపరమైన చిక్కుల్లో ఉన్నప్పటికీ.. తరచూ ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడం, ఒకరి పోస్టులకు మరొకరు కామెంట్లు చేస్తుండడం, పలు ఇంటర్వ్యూలలో కనిపిస్తుండడం అప్పుడప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.