సంక్షోభంలో పాక్‌

Economic crisis of Pakistan - Sakshi

తలకు మించిన భారంగా ఇంధన దిగుమతులు

కరెంటు ఆదా కోసం రంగంలోకి ప్రభుత్వం

మార్కెట్లు, మాల్స్, ఫంక్షన్‌ హాళ్లు త్వరగా మూసేయాలని ఆదేశం

జనం పెదవి విరుపు, వ్యాపారుల గగ్గోలు

ఇస్లామాబాద్‌: చుక్కలనంటుతున్న నిత్యావసరాల ధరలు. తీర్చలేని రుణ భారం. నానాటికీ పతనమవుతున్న కరెన్సీ విలువ. తీవ్ర రూపు దాలుస్తున్న కరెంటు కొరత. పులి మీద పుట్రలా పడ్డ ప్రకృతి విలయాలు... ఇలా ఎటు చూసినా సమస్యలతో పొరుగు దేశం పాకిస్తాన్‌ నానాటికీ పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. మరో శ్రీలంకలా మారకముందే ఏదోలా సమస్య నుంచి బయట పడే మార్గాల వెదుకులాటలో పడింది. ఆపద నుంచి గట్టెక్కించకపోతారా అని అంతర్జాతీయ ద్రవ్య నిధి తదితరాల వైపు ఆశగా చూస్తోంది...

పాకిస్తాన్‌లో నానాటికీ తీవ్ర రూపు దాలుస్తున్న ఆర్థిక సంక్షోభానికి అడ్డుకట్ట వేసేందుకు షహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. దేశ మొత్తం దిగుమతుల్లో ఇంధన బిల్లుదే పెద్ద వాటా. ప్రస్తుతం విదేశీమారక నిల్వలు 11.7 బిలియన్‌ డాలర్లకు పడిపోయాయి. దేశ మొత్తం దిగుమతి అవసరాలను తీర్చడానికి ఇవి మరో నెల రోజులు మాత్రమే సరిపోతాయి. ఈ నేపథ్యంలో ఇంధన పొదుపు కోసం ప్రభుత్వం తక్షణం రంగంలోకి దిగి పలు చర్యలు చేపట్టింది.

మార్కెట్లన్నీ రాత్రి 8.30కల్లా మూసేయాలంటూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఫంక్షన్‌ హాళ్లు, రెస్టారెంట్లు కూడా పదింటికల్లా మూతబడాల్సిందేనని తేల్చి చెప్పింది. షాపింగ్‌ మాల్స్‌ కూడా ముందుగానే మూతపడుతున్నాయి. ‘ఇంధన పొదుపు’ లక్ష్యంతో మంగళవారం కేంద్ర కేబినెట్‌ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాలన్నీ తక్షణం అమల్లోకి వస్తాయని పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్‌ అసిఫ్‌ వెల్లడించారు.

రూ.6,200 కోట్ల ఆదాయే లక్ష్యం...
పాక్‌లో విద్యుదుత్పాదన చాలావరకు చమురు ఆధారితమే. చమురు దిగుమతులపై ఏటా 300 కోట్ల డాలర్ల దాకా ఖర్చు పెడుతోంది. తాజా చర్యల ఉద్దేశం ఈ వ్యయాన్ని వీలైనంత తగ్గించడమే. అంతేగాక ప్రభుత్వ శాఖల్లో కూడా విద్యుత్‌ వాడకాన్ని కనీసం 30 శాతం తగ్గించడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని అధికారులు వెల్లడించారు. దీనివల్ల మొత్తమ్మీద 6,200 కోట్ల రూపాయలు ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. వీటితో పాటు ఉద్యోగులు వీలైనంత వరకూ ఇంటి నుంచి పని చేసేలా చూడాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది.

నాసిరకపు విద్యుత్‌ బల్బుల తయారీ తదితరాలపై త్వరలో నిషేధం కూడా విధించనున్నారు. అయితే, ప్రభుత్వ తాజా నిర్ణయంపై దుకాణదారులు, ఫంక్షన్‌ హాల్స్, మాల్స్‌ యజమానులు గగ్గోలు పెడుతున్నారు. కరోనాతో రెండేళ్లకు పైగా సతమతమై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తమ పాటిల ఇది పిడుగుపాటు నిర్ణయమేనని, దీన్ని తక్షణం వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. రాత్రి పొద్దుపోయేదాకా షాపింగులు, రెస్టారెంట్లలో డిన్నర్లు పాకిస్తానీలకు రివాజు. ప్రభుత్వ నిర్ణయంపై వారినుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.

600 కోట్ల డాలర్ల రుణం!
మరోవైపు ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడేందుకు ఐఎంఎఫ్‌ నుంచి కనీసం 600 కోట్ల డాలర్ల తక్షణ రుణం సాధించేందుకు పాక్‌ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గత ఆగస్టులో ఐఎంఎఫ్‌ నుంచి పాక్‌ 110 కోట్ల డలర్ల రుణం తీసుకుంది. గత వేసవిలో విరుచుకుపడ్డ ఆకస్మిక వరదలు దేశాన్ని అతలాకుతలం చేసి వదిలాయి. వాటివల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ఏకంగా 4,000 కోట్ల డాలర్ల మేర నష్టం వాటిల్లిందని అంచనా.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top