దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ: దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు. హనుమకొండలోని అంబేడ్కర్ భవన్‌లో జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. కలెక్టర్ స్నేహ శబరీష్ జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. దివ్యాంగుల సౌకర్యార్థం అంబేడ్కర్ భవన్, కలెక్టరేట్‌లో ర్యాంపు సౌకర్యం ఏర్పాటు చేసేందుకు తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వేడుకల్లో భాగంగా దివ్యాంగ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వివిధ క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన దివ్యాంగులకు కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రశంసపత్రాలు, జ్ఞాపికలు అందించారు. జిల్లా సంక్షేమ అధికారి జె.జయంతి అధ్యక్షతన జరిగిన వేడుకల్లో డీఆర్‌డీఓ మేన శ్రీను, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ ఇసంపల్లి జోనా, డీఎంహెచ్‌ఓ అప్పయ్య, కేయూ పాలకమండలి సభ్యురాలు డాక్టర్ కె.అనితారెడ్డి, విద్య ఫౌండేషన్ చైర్మన్ బిల్లా మహేందర్, దివ్యాంగ సంఘం ప్రతినిధులు రాజు, శ్రీనివాస్, సీడీపీఓ విశ్వజ, ఎఫ్‌ఆర్‌ఓ రవి కృష్ణ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఇన్‌చార్జ్ అధికారి ఎస్.ప్రవీణ్ కుమార్, చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ భాస్కర్, పోషణ్ అభియాన్ కోఆర్డినేటర్ సుమలత పాల్గొన్నారు.
మిల్లర్లు తరుగు తీయొద్దు..
హన్మకొండ అర్బన్: రైతులు విక్రయించిన ధాన్యంలో రైస్ మిల్లర్లు తరుగు తీయొద్దని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. కలెక్టరేట్‌లో సీఎంఆర్, ధాన్యంలో తరుగు తీస్తున్నారని రైతుల ఫిర్యాదు మేరకు పౌరసరఫరాలు శాఖ అధికారులు, రైస్ మిల్లర్లతో కలెక్టర్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తరుగు పేరుతో రైతులను మిల్లర్లు ఇబ్బంది పెట్టొద్దన్నారు. అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వాజీద్ అలీ, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ మేనేజర్ మహేందర్, జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, పౌరసరఫరాల శాఖ అధికారులు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.


