గురుకుల పాఠశాల నిర్వహణపై ఆగ్రహం
వరంగల్: ఆరెపల్లిలోని పాకాల కొత్తగూడకు చెందిన మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలికల గురుకుల పాఠశాల నిర్వహణపై కలెక్టర్ సత్యశారద ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్, డిప్యూటీ వార్డెన్లకు మెమోలు జారీ చేయాలని డీబీసీడీఓ పుష్పలతను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ సత్యశారద గురుకల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా స్టోర్ రూం, కిచెన్, డైనింగ్ హాల్ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్‌లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, ఇతర సరుకుల నాణ్యతను, విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. స్టోర్స్ అపరిశుభ్రంగా ఉండడం, మెనూ ప్రకారం భోజనం ఉండకపోవడంతో డిప్యూటీ వార్డెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యానికి తావివ్వకుండా, మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పలు సబ్జెక్టుల్లో విద్యార్థుల పరిజ్ఞానాన్ని పరీక్షించారు. విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలున్నాయా అని అడిగారు. ఏమైనా సమస్యలుంటే ఫిర్యాదు బాక్స్‌లో వేయాలని సూచించారు.
ప్రిన్సిపాల్, డిప్యూటీ వార్డెన్లకు
మెమోలు జారీ చేయాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద ఆదేశం


