సమస్యలు ప్రస్తావించేనా
నగరంలో నత్తనడకన స్మార్ట్‌సిటీ పనులు
వరంగల్ అర్బన్: క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలు గుర్తించి, చర్చించే పరిష్కార మార్గాలను అన్వేషించడం లేదు. పౌర సేవలు, ధ్రువీకరణ పత్రాలు, నిర్మాణ అనుమతులు, ఆక్రమణలు తదితర ఫిర్యాదులపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కొర్రీలు పెడుతున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సేవలు ఏవైనా కొంతమంది డబ్బులు డిమాండ్ చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. కొందరు కార్పొరేటర్లు, అధికారులు తమ విన్నపాలు లెక్కచేయడం లేదని ప్రజలు పేర్కొంటున్నారు. సోమవారం ఉదయం 11:30 గంటలకు మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నారు. ఎజెండాలో 29 అంశాలు పొందుపర్చారు. సర్వసభ్య సమావేశంలో ప్రజల సమస్యలు ప్రస్తావించి పరిష్కారం చూపుతారా? కేవలం తీర్మానాల ఆమోదంతోనే మమ అనిపిస్తారా? అని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
వారానికోసారి కాల్వలు శుభ్రం..
రోడ్లు, లేఔట్లు, ఖాళీ స్థలాలను ఆక్రమిస్తున్నారని గ్రీవెన్స్ సెల్‌లో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. చెత్త సేకరణకు ప్రతీ ఇంటికి ఏడాదికి రూ.720 వసూలు చేస్తున్నారు. వాస్తవంగా పరిశీలిస్తే స్వచ్ఛ ఆటోలు రోజూ రావట్లేదు. కాలనీల్లో మురుగు కాల్వలు వారానికోసారి శుభ్రం చేస్తున్నారు. వీధి దీపాలు వెలుగక చాలా కాలనీలు అంధకారంలో మగ్గుతున్నాయి. ఫిర్యాదులను పట్టించుకోవట్లేదు. కాలనీల్లో దోమలు, కుక్కలు, కోతులు, పందుల బెడద తప్పట్లేదు. వీటి నివారణకు ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా.. ప్రజలకు ఉపశమనం కలగడం లేదు. రోడ్ల వెంట నడవాలంటే భయపడుతున్నారు. కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, కోతులను అడవుల్లోకి తరలిస్తున్నామని రికార్డుల్లో చూపిస్తున్నా.. ప్రజలు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. నగరంలో ఫుట్‌పాత్‌ల ఆక్రమణకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ సమస్యలతో వాహనదారులు సతమతమవుతున్నారు. కాలనీల్లో రోడ్లను ఆక్రమించి భవనాలు కడుతున్నారు. లేఔట్ ఖాళీ స్థలాలు, పార్కులు, శ్మశానవాటిక స్థలాలు దర్జాగా కబ్జా చేస్తున్నారు. ఇళ్ల నిర్మాణ అనుమతులు, అనుమతి లేని నిర్మాణాలు, కొత్త ఇంటి నంబర్లు, పేరు మార్పిడి, ట్రేడ్ లైసెన్స్‌ల పేరిట పెద్ద ఎత్తున ప్రజల నుంచి డబ్బులు దండుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అభివృద్ధి పనుల పేరిట పర్సంటేజీల మత్తులో జోగుతున్నారు. అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ముంపు నుంచి తేరుకోలేదు. కనీస వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కార్పొరేటర్లలో నిరాశ
అధికార, ప్రతిపక్ష కార్పొరేటర్లు నిరాశ, నిస్పృహల్లో ఉన్నారు. నాలుగున్నరేళ్లు గడిచింది. కానీ, ఆశించిన స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టలేకపోయామనే భావన నెలకొంది. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేవారు కరువయ్యారని వాపోతున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది, అధికారులు తమ ఆదేశాలను లెక్క చేయడం లేదని విమర్శలున్నాయి. కౌన్సిల్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రతిపక్షం ఏం చెప్పినా అధికార పక్షం అడ్డు చెప్పడం, అధికార పార్టీ ఏం ప్రస్తావించినా, ప్రతిపక్షం వ్యతిరేకించడం ఇక్కడ పరిపాటిగా మారింది. కొంతమంది సభ్యులు తమ లాభాపేక్ష కోసం అధికారులను టార్గెట్ చేస్తున్నారని, వారి ఉనికి చాటుకోవడానికి అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారే తప్ప సమస్యల పరిష్కారంపై దృష్టిసారించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కాలనీల్లో అస్తవ్యస్తంగా
తాగునీటి సరఫరా
నేడు గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ సమావేశం
సమస్యలు ప్రస్తావించేనా
సమస్యలు ప్రస్తావించేనా


