కలెక్టరేట్లలో నేటి గ్రీవెన్స్ రద్దు
హన్మకొండ అర్బన్/న్యూశాయంపేట: గ్రామపంచాయతీ ఎన్నికల దృష్ట్యా హనుమకొండ, వరంగల్ కలెక్టరేట్లలో సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌ను రద్దు చేసినట్లు కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాల అధికారులు ఎన్నికల నిర్వహణలో ఉన్నందున ఈ కార్యక్రమం రద్దు చేసినట్లు పేర్కొన్నారు. హనుమకొండ, వరంగల్ జిల్లా ల ప్రజలు గమనించాలని కలెక్టర్లు కోరారు.
గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్..
వరంగల్ అర్బన్: బల్దియా ప్రధాన కార్యాలయంలో సోమవారం కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నందున గ్రీవెన్స్ సెల్ రద్దు చేసినట్లు కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నగర ప్రజలు గ్రీవెన్స్‌కు రావొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.
9, 10 తేదీల్లో
నోబెల్ డే ఉత్సవాలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను పురస్కరించుకుని ఈనెల 9, 10 తేదీల్లో నోబెల్ డే ఉత్సవాలు నిర్వహించనున్నట్లు కేయూ స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ మామిడాల ఇస్తారి తెలిపారు. కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఇంగ్లిష్, ఎకనామిక్స్, బాటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఫార్మసీ విభాగాల విద్యార్థులకు 9వ తేదీన పోస్టర్ ప్రజెంటేషన్, వక్తృత్వ పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనే విద్యార్థులు తమ పేర్లను ఈనెల 5వ తేదీ లోపు తమ విభాగాలకు ఆన్‌లైన్‌లో సమర్పించాలని మామిడాల ఇస్తారి కోరారు. 10వ తేదీన నోబెల్ బహుమతి, పరిశోధన అంశంపై విషయ నిపుణులతో సెమినార్లు ఉంటాయని పేర్కొన్నారు. సాయంత్రం సెనేట్ హాల్‌లో నిర్వహించనున్న ముగింపు సమావేశంలో విజేతలకు బహుమతుల ప్రదానం ఉంటుందని తెలిపారు.
అలరించిన
కార్తీక నృత్యోత్సవం
హన్మకొండ: హనుమకొండ గోకుల్‌నగర్‌లోని అంబేడ్కర్ భవన్‌లో ఆదివారం నిర్వహించిన కార్తీక నృత్యోత్సవం అలరించింది. శ్రీభారతి కళాక్షేత్రం కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో కార్తీక సంగీత, నృత్య, వాయిద్యాల ఉత్సవం–25 నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 90 మంది కూచిపూడి నృత్య కళాకారులు, 60 మంది కర్ణాటక సంగీత కళాకారులు, ఇద్దరు వీణా, ఐదుగురు వయోలిన్, ఇద్దరు ఫ్లూట్ కళాకారులు పాల్గొని అత్యుత్తమ ప్రదర్శనతో ప్రతిభ చాటారు. ఈసందర్భంగా శ్రీభారతి కళాక్షేత్రం కల్చరల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు బొల్లం మాధవి మాట్లాడుతూ.. కళలపై అభిరుచిని పెంపొందించేందుకు, కళలను ప్రోత్సహించేందుకు ఇలాంటి పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి పోటీల నిర్వహణతో కళాకారుల్లో పోటీతత్వం పెరుగుతుందని, కళల్లో రాణించేందుకు సాధన చేస్తారన్నారు. కార్యక్రమంలో ఆర్గనైజర్ బొల్లం రవి, వ్యాఖ్యాత ఉమ్మడి లక్ష్మణాచార్యులు, కళాకారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
న్యూశాయంపేట: వరంగల్ జిల్లా పంచాయతీ ఎన్నికల జనరల్ అబ్జర్వర్‌గా రాష్ట్ర బీసీ సంక్షేమ కమిషనర్ బి.బాల మాయాదేవి నియమితులైనట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సాధారణ ఎన్నికల పరిశీలకులు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు జిల్లాలో పరిశీలిస్తారని తెలిపారు. ఎన్నికల నిబంధనలు, ఉల్లంఘనకు సంబంధించిన సమస్యల్ని నంబర్ 87127 35548 ద్వారా పరిశీలకులకు తెలియజేయవచ్చని కలెక్టర్ సూచించారు.


