
విపత్తు నిర్వహణ ప్రణాళికలు రూపొందించాలి
న్యూశాయంపేట: ప్రజల భాగస్వామ్యంతోనే సమర్థవంతంగా విపత్తు నిర్వహణ సాధ్యమని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్డీఎంఏ) జాయింట్ అడ్వైజర్ నావల్ ప్రకాశ్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో నావల్ మాట్లాడారు. చట్టప్రకారం కొత్తగా పట్టణ విపత్తు నిర్వహణ అథారిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు. విపత్తు నిర్వహణలో ఏఐ, డ్రోన్ టెక్నాలజీ ఉపయోగంపై దృష్టి సారించాలని సూచించారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ జిల్లాలో ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. ముంపు గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించామని, శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, పాఠశాలలను గుర్తించినట్లు చెప్పారు. వాటిలో ఉన్నవారిని ముందస్తుగానే ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయి మాట్లాడుతూ బల్దియా ఏర్పాటు చేసిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ద్వారా నగరంలో విపత్తులను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎన్డీఎంఏ అండర్ సెక్రటరీ అభిషేక్ బిశ్వాస్, సీనియర్ కన్సల్టెంట్ వసీం ఇక్బాల్, గౌతమ్ కృపా, సంధ్రా, అనుపమా, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎన్డీఎంఏ జాయింట్ అడ్వైజర్
నావల్ ప్రకాశ్