
దంపతుల మధ్య గొడవ..
● మనస్తాపంతో మహిళ ఆత్మహత్య
● తూర్పు తండాలో ఘటన
సంగెం: దంపతుల మధ్య గొడవతో మనస్తాపం చెందిన ఓ మహిళ క్షణికావేశంలో బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సంగెం మండలం నల్లబెల్లి శివారు తూర్పు తండాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన అజ్మీరా జ్యోతి(44), బాలరాజు దంపతులకు ఇద్దరు కుమారులు సంతోశ్, సందీప్ ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. పెద్ద కుమారుడికి వివాహం జరగగా వ్యవసాయం చేసుకుంటున్నాడు. చిన్న కుమారుడు చదువుకుంటున్నాడు. బుధవారం కుటుంబం, మేకలు మేపడానికి వెళ్లే విషయాల్లో దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన జ్యోతి వ్యవసాయ బావి వద్దకు వెళ్లి అందులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. జ్యోతి బావిలో దూకుతుండగా పక్క చేనులో కలుపు తీస్తున్న మహిళా రైతు బానోత్ బుజ్జమ్మ చూసి తండాకు చెందిన మూడు మోతీలాల్‌కు చెప్పింది. మోతీలాల్ తండాకెళ్లి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చి చూడగా జ్యోతి బావిలో కనిపించలేదు. డయల్100కు కాల్ చేసి విషయం తెలపడంతో స్థానిక పోలీసులు.. ఫైర్ రెస్క్యూ టీంకు సమాచారం అందించగా వారు వచ్చి వెతకగా జ్యోతి మృతదేహం లభించింది. మృతురాలి కుమారుడు సంతోశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ పేర్కొన్నారు.