
అభివృద్ధి పథంలో తెలంగాణ
మహబూబాబాద్ రూరల్ : తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నారని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ జాటోత్ రామచంద్రునాయక్ అన్నారు. బుధవారం మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుల సన్నాహక సమావేశం పార్టీ పార్లమెంట్ నియోజవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వర్ రావు అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని వీరబ్రహ్మేంద్రస్వామి మందిరంలో నిర్వహించారు. డిప్యూటీ స్పీకర్ జాటోత్ రామచంద్రునాయక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్యఅతిథిగా హాజరుకానుండగా ఈ నెల 4వ తేదీన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారన్నారు. నా యకులు, కార్యకర్తలను ప్రభుత్వంలో భాగస్వాములను చేసేందుకు ఖర్గే వస్తున్నారని, ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులు తప్పనిసరిగా ఖర్గే సభకు అధిక సంఖ్యలో తరలిరావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారని తెలిపారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించేందుకు కృషి చేస్తామని, సెప్టెంబర్ లోపు గ్రామపంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సి పాలిటీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో మానుకోట, భద్రాచలం, సత్తుపల్లి ఎమ్మెల్యేలు డాక్టర్ మురళీనాయక్, తెల్లం వెంకట్రావు, మట్టా రాగమయి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మద్ది బేబీస్వర్ణకుమారి, నాగ సీతారాములు, డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్‌చందర్ రెడ్డి, కేసముద్రం ఏఎంసీ చైర్మన్ ఘంట సంజీవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
డిప్యూటీ స్పీకర్ జాటోత్
రామచంద్రునాయక్