ఆదాయం తప్ప వసతులు పట్టవా?
అరకొర వసతులతో గుంటూరు రిజిస్ట్రేషన్ కార్యాలయం 153 సంవత్సరాల నుంచి ఒకే కార్యాలయంలో మనుగడ రికార్డులపై పట్టలు కప్పి కాపాడుతున్న సిబ్బంది
నిత్యం అరచేతిలో వైకుంఠం చూపించే పాలకులు ప్రజాసమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ గుంటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంతోపాటు జిల్లాలో మరికొన్నింటిలో సమస్యలు. రాష్ట్ర ఖజానాకు కాసుల వర్షం కురిపించే కార్యాలయం ఇది. సుదీర్ఘ చరిత్ర దీని సొంతం. కనీసం పట్టించుకునే వారు లేక దీనస్థితిలో కొట్టుమిట్టాడుతోంది.
గుంటూరు వెస్ట్ : నగరం నడిబొడ్డున, కలెక్టరేట్ ఆవరణలోని గుంటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిస్థితి ప్రజలను అసహనానికి గురిచేస్తోంది. దీనిని అప్పటి బ్రిటీషు ప్రభుత్వ హయాంలో జూలై 1, 1872లో ప్రారంభించారు. ఇప్పటికే 153 సంవత్సరాలు గడిచింది. ఏటా సుమారు 50 వేల వరకు దస్తావేజులు ఇక్కడ రిజిస్టర్ అవుతాయి. రూ.100 కోట్లకుపైగా ఆదాయం వస్తుంది. కానీ మరమ్మతులకు కూడా దిక్కులేక శిథిలావస్థకు చేరుకుంది. 2008లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నూతన భవన నిర్మాణానికి రూ.60 లక్షలు కేటాయించారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నిధులను విడుదల చేయలేదు. ఏ ప్రభుత్వం ఉన్నా క్రమం తప్పకుండా రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచుకుంటూ పోతున్నారు. మౌలిక సదుపాయాల సంగతి మాత్రం పట్టించుకోవడంలేదని ప్రజలు, సామాజిక కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కనీస వసతులు కరవు
పురాతన భవనం కావడంతో పైకప్పు గత 20 ఏళ్ల నుంచి లీక్ అవుతోంది. దీంతో ఇక్కడ పనిచేసే సిబ్బందితోపాటు దాతల సహకారంతో పైన పట్టలు కప్పించారు. విద్యుత్ తీగలు కూడా బ్రిటీషు కాలం నాటివే. ఇక రికార్డులు భద్రపరిచే ఇనుప రాక్స్ కూడా తుప్పుపడుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా మళ్లీ లీకులు ఏర్పడ్డాయి. దీనిని ప్లాస్టిక్ కవర్లతో కప్పి ఉంచారు. పైకప్పు రాళ్ళకు చెమ్మ పడుతోంది. ఎప్పుడు ఏమవుతుందో తెలీక ప్రజలతోపాటు సిబ్బంది కూడా బిక్కు బిక్కు మంటూ కాలం గడుపుతున్నారు. ఇటీవల కాలంలో అక్కడక్కడా పెచ్చులు కూడా ఊడిపడుతున్నాయి. రిజిస్ట్రేషన్ కార్యాలయానికి ఎదురుగా 2012లో రెవెన్యూ భవన్ నిర్మించారు. వాస్తవానికి ఇది రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వారి పార్కింగ్‌కు ఉపయోగించేవారు. రెవెన్యూ భవన్ నిర్మాణంతో ఇక్కడ ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. దీనికి ప్రత్యామ్నాయం చూపలేదు. ఇటీవల రిజిస్ట్రేషన్ కాంపౌండ్ ఆవరణలో కొత్త షెడ్డును సిబ్బంది సొంత ఖర్చుతో నిర్మించారు. అంతే కాకుండా మరుగుదొడ్లు కూడా దాతల సహకారంతోనే ఏర్పాటు చేశారు.
ఆదాయం తప్ప వసతులు పట్టవా?


