
రోగికి కేసు షీట్ ఇవ్వాల్సిందే..!
గుంటూరు మెడికల్: రోగికి కేసు షీటు ఇవ్వాల్సిందేనని జాతీయ వినియోగదారుల సమాఖ్య ఉపాధ్యక్షుడు డాక్టర్ చదలవాడ హరిబాబు అన్నారు. గుంటూరులోని గర్తపురి కన్జూమర్స్ కౌన్సిల్ ఆఫీసులో సోమవారం వైద్య వివరాలు, హాస్పిటల్స్ విధులపై సమావేశం నిర్వహించారు. సమావేశానికి చేకూరి రాజశేఖర్ అధ్యక్షత వహించారు. డాక్టర్ హరిబాబు మాట్లాడుతూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్ ప్రకారం రోగ నిర్ధారణ, పరిశోధన వివరాలు రోగికి తప్పనిసరిగా వైద్యాధికారులు తెలియజేయాలని తెలిపారు. రోగి మరణిస్తే అన్ని కారణాలు ఆ కేసులో తెలపాలని చెప్పారు. వైద్యులు ఏ మందులు ఎప్పుడు వాడారు..నర్సింగ్ సిబ్బందికి చెప్పిన సూచనలు కేసులో తేదీల వారీగా ఉండాలని, చికిత్స వివరాలు సమగ్రంగా ఉండాలని తెలిపారు. రోగి గానీ, అతని బంధువులు గానీ మెడికల్ రికార్డులు కావాలని అడిగిన తరువాత 72 గంటల్లో అందించాలని సూచించారు. రాజశేఖర్ మాట్లాడుతూ రోగికి రికార్డు ఇవ్వకుండా మెడికల్ ప్రాక్టీషనర్‌కు ఏ మినహాయింపు, ఏ చట్టం ఇవ్వలేదని తెలిపారు. మొత్తం చికిత్స వివరాల ఫొటో కాపీలు హాస్పిటల్ వారు ఇవ్వాలని సూచించారు. జిల్లా విజిలెన్స్ సభ్యుడు బీరాల నాగేశ్వరరావు మాట్లాడుతూ హాస్పిటల్ వారు రోగికి వైద్య వివరాలను నిరాకరించడమంటే తన బాధ్యత నిర్వహణలో నిర్లక్ష్యమవుతుందని తెలిపారు. న్యాయస్థానాలు కోరినప్పుడు తప్పనిసరిగా సంబంధిత రోగి రికార్డులు సమర్పించాల్సి ఉంటుందని సూచించారు. బేబీ సరోజిని మాట్లాడుతూ వైద్యులు తప్పు చేసి ఉంటే అందువల్ల నష్టపోయిన రోగులు, కేసు షీటును సాక్ష్యాధారంగా కోర్టులో ఉపయోగించవచ్చని తెలిపారు. మునిపల్లె కవిత మాట్లాడుతూ రోగులకు చికిత్స చేసిన వివరాలను అందించడంలో పూర్తి పారదర్శకత ఉండాలని సూచించారు. కేసు సీట్ బాధ్యత వైద్యులు, హాస్పిటల్ పైన ఉందని చాలా కేసుల్లో కోర్టులు తీర్పులు ఇచ్చాయని ఆయన పేర్కొన్నారు.
జాతీయ వినియోగదారుల సమాఖ్య ఉపాధ్యక్షుడు డాక్టర్ చదలవాడ హరిబాబు