రోగులకు సన్‌ ‘స్ట్రోక్‌’ | - | Sakshi
Sakshi News home page

రోగులకు సన్‌ ‘స్ట్రోక్‌’

May 13 2025 2:04 AM | Updated on May 13 2025 2:04 AM

రోగుల

రోగులకు సన్‌ ‘స్ట్రోక్‌’

జీజీహెచ్‌లో పనిచేయని ఏసీలు
● పక్షవాతంతో ప్రాణాపాయ స్థితిలో రోగులు ● మొరాయిస్తున్న చికిత్సా పరికరాలు ● వైద్యులు, వైద్య సిబ్బందికి చెమటలు ● అధికారుల్లో కనిపించని స్పందన ● ‘సాక్షి’ చొరవతో సోమవారం రాత్రి ఏసీలు ఏర్పాటు ● కార్డియాలజీ విభాగంలో పనిచేయని ఏసీలపై స్పందించని అధికారులు

గుంటూరు మెడికల్‌: గుంటూరు జీజీహెచ్‌ స్ట్రోక్‌ యూనిట్‌కు రాష్ట్ర వ్యాప్తంగా ఓ గుర్తింపు ఉంది. ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో లేని విధంగా గుంటూరు జీజీహెచ్‌లో (బ్రెయిన్‌ స్ట్రోక్‌) పక్షవాతం వచ్చిన వారికి తక్షణమే చికిత్స అందించి ప్రాణాలు కాపాడేందుకు డాక్టర్‌ ఎన్‌.వి.సుందరాచారీ దాతల సహాయంతో స్ట్రోక్‌ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ప్రతినెలా వందల కొద్ది బాధితుల ప్రాణాలు కాపాడుతున్న స్ట్రోక్‌ యూనిట్‌లో నాలుగు రోజులుగా ఏసీలు పనిచేయడం లేదు. దీంతో రోగులకు చికిత్స అందించేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది చమటోడుస్తున్నారు. కోమాలో ఉండి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న రోగులకు కొద్దిపాటి సాయం అందించేందుకు పక్కన ఉండే రోగుల సహాయకులు సైతం ఏసీలు పనిచేయక సొంతంగా ఇళ్ల వద్ద నుంచి ఫ్యాన్లు తెచ్చి పెట్టుకుంటున్న పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు ఉండటం లేదు.

అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ....

స్ట్రోక్‌ యూనిట్‌లో ఏసీలు పనిచేయడం లేదని, తద్వారా చికిత్స పొందుతున్న స్ట్రోక్‌ బాధితులకు చికిత్స అందించేందుకు సైతం చాలా అవస్థలు పడాల్సి వస్తుందని వైద్యులు, వైద్య సిబ్బంది ఆసుపత్రి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చికిత్స కోసం రోగికి అమర్చే వైర్లు సైతం ఏసీలు పనిచేయక చమటలు కారిపోయి ఊడి పోతున్నాయి. దీంతో ఏ క్షణంలో రోగికి ఏమవుతుందోనన్న భయాందోళన వైద్యుల్లోనూ, వైద్య సిబ్బందిలోనూ, రోగి బంధువుల్లోనూ నెలకొని ఉంది. రాత్రి సమయాల్లో స్ట్రోక్‌ యూనిట్‌లో ఏసీలు పనిచేయక ఉక్కపోతకు ఊపిరాడక లోపల ఉండలేక, ప్రాణాపాయ స్థితిలో ఉన్న బంధువులను వదిలి బయటకు రాలేక నరకయాతన పడుతున్నారు. కాగా ఏసీలు పనిచేయక స్ట్రోక్‌ యూనిట్‌లో రోగులు పడుతున్న ఇబ్బందులపై ‘సాక్షి’ సూపరింటెండెంట్‌ కార్యాలయాన్ని వివరణ కోరగా వారు కాంట్రాక్టర్‌ను మూడు రోజుల క్రితం మార్చామని తెలిపారు. సోమవారం నూతన కాంట్రాక్టర్‌ ఏసీలు మరమ్మతులు చేస్తున్నట్లు వెల్లడించారు. సోమవారం రాత్రికి ఏసీలు పనిచేయడంతో స్ట్రోక్‌ యూనిట్‌లో రోగులు, వైద్య సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

కార్డియాలజీలో పనిచేయకపోయినా స్పందించడం లేదు

రెండు నెలలుగా కార్డియాలజీ సీసీయూ విభాగంలో ఏసీలు పనిచేయడం లేదు. ఈ విషయాన్ని పలు మార్లు ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు, ఆసుపత్రి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ నేటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో చికిత్స పొందుతున్న విభాగంలో ఏసీలు పనిచేయక గుండెజబ్బు రోగులు, స్ట్రోక్‌ రోగులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అయినప్పటికీ ఆసుపత్రి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుండిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అత్యవసర వైద్య సేవల విభాగంలో కూడా (క్యాజువాల్టి) ఏసీలు పనిచేయక అవస్థలు పడుతున్నారు. ఆసుపత్రి అధికారులు ఇప్పటికై నా స్పందించి ఆసుపత్రుల్లో ప్రతి వార్డులో ఏసీలకు తక్షణమే మరమ్మతులు చేయించి రోగుల ప్రాణాలు పోకుండా కాపాడాలని పలువురు బాధితులు కోరుతున్నారు.

రోగులకు సన్‌ ‘స్ట్రోక్‌’ 1
1/1

రోగులకు సన్‌ ‘స్ట్రోక్‌’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement