‘కేవైసీ’ తెలుసుకోవాల్సింది ఎవరు?

C Ramachandraiah Article On PM Modi Know Your Constitution Call - Sakshi

ఆకర్షణీయమైన నినాదాలతో ప్రజ లను వశపర్చుకొనే తంత్రం తెలిసిన ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా ‘కేవైసీ’ అనే ఓ క్యాచీ స్లోగన్‌ వది లారు. అంటే నో యువర్‌ కాన్‌స్టి ట్యూషన్‌.   ఇప్పటివరకూ కేవైసీకి నో యువర్‌ కస్టమర్‌ (నీ వినియోగ దారుని గురించి తెలుసుకో) అనే అర్థం ఉంది. మోదీ నో యువర్‌ కాన్‌ స్టిట్యూషన్‌ (నీ రాజ్యాంగాన్ని తెలుసుకో) అనే అర్థాన్నిచ్చి,  భారత రాజ్యాంగ అమలుపై మరోసారి చర్చ జరిగేందుకు అవకాశం కల్పించారు. నవంబర్‌ 26, 2020న గుజరాత్‌లోని కెవాడియాలో జరిగిన 80వ అఖిల భారత సభాపతుల ముగింపు సమావేశంలో మోదీ దీన్ని ప్రస్తావించడం విశేషం.  

రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవాలంటే రాజ్యాంగంలో, చట్టాల్లో ఉన్న భాషను సరళతరం చేయాలని మోదీ చేసిన సూచన సముచితమైనది. రాజ్యాంగం ప్రతులు ప్రజలందరి దగ్గర ఉండాలి. ముఖ్యంగా, ప్రజాప్రతినిధుల వద్ద తప్పని సరిగా ఉండాలి. రాజ్యాంగం ఏం చెప్పిందో తెలిసినంత మాత్రాన ప్రజలకు రాజ్యాంగ ఫలాలు అందుతాయా? గత 7 దశాబ్దాల అనుభవాలను చూసినట్లయితే అన్ని అక్ర మాలు రాజ్యాంగం నీడలోనే జరిగాయి. రాజ్యాంగం అమ లులో ఎక్కడ లోపాలు జరుగుతున్నాయో తెలుసుకొని వాటిని సరిదిద్దితేనే అన్ని వ్యవస్థలు రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేస్తాయి. అంబేడ్కర్‌ ‘ఈ రాజ్యాంగం ఎంత మంచిదైనా కావొచ్చు. దీనిని అమలు జరిపేవారు మంచివారైతే ఇది మంచిదవుతుంది. చెడ్డవారైతే ఇది చెడ్డదవుతుంది’ అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. 

నిజానికి, 5 ఏళ్ల క్రితమే 2016 నవంబర్‌ 26ను రాజ్యాంగదినంగా ప్రకటించి, నవంబర్‌ 26, 27 తేదీలలో రెండు రోజులపాటు ‘రాజ్యాంగానికి నిబద్ధులం’ అనే పేరుతో ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించింది. కాంగ్రెస్‌ పాలనలో అనేక రాజ్యాంగ వ్యవ స్థలు గాడి తప్పాయి. కాంగ్రెస్‌కు భిన్నంగా మోదీ నేతృ త్వంలో అన్ని వ్యవస్థలు రాజ్యాంగ సూత్రాలకు లోబడి పని చేస్తాయని ఆశించడం జరిగింది. గవర్నర్ల వ్యవస్థ, స్పీకర్‌ వ్యవస్థ, కార్యనిర్వాహక వర్గం, ఎన్నికల కమిషన్, న్యాయ వ్యవస్థ... అన్నీ రాజ్యాంగ నిబంధనలకు లోబడి పని చేయ డానికి తగిన సంస్కరణలను ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతుం దని ఆశించారు. గత ఆరేళ్ల అనుభవాలు చూసినట్లయితే రాజ్యాంగాన్ని ఓ దిక్సూచిలా చేసుకొన్నట్లు కనపడదు. అందుకు పలు ఉదాహరణలు కనిపిస్తాయి.

కేంద్ర, రాష్ట్ర సంబంధాలు గతంలో కంటే మెరుగుపడిన దాఖలాలు లేవు సరికదా పలు అంశాలపై కేంద్ర, రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలు పీఠముడి పడేస్థాయికి చేరాయి. పశ్చిమ బెంగా ల్‌లో గవర్నర్‌ వ్యవహారశైలి వివాదంగా మారింది. ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న పార్టీ ఫిరాయింపుల అంశంపై కేంద్రం ఉదాసీనంగా వ్యవహరించడం దురదృ ష్టకరం. 1985లో 52వ రాజ్యాంగ సవరణ, ఆ తర్వాత 2003లో జరిగిన 91వ రాజ్యాంగ సవరణల తర్వాత కూడా ఫిరాయింపుల నిరోధక చట్టం అపహాస్యం పాలవడానికి కారణం సభాపతి (స్పీకర్‌/చైర్మన్‌) తన నిర్ణయాన్ని వెలువ రించడానికి నిర్ణీత కాలపరిమితి లేకపోవడం. ఇది ఫిరాయిం పుదారులకు వరంగా పరిణమించింది.

2014–19 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు అధికార తెలుగుదేశంలోకి ఫిరాయించారు. అందులో నలు గురు రాజ్యాంగంపై ప్రమాణం చేసి మంత్రులయ్యారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే ఈ ప్రక్రియను సరిదిద్దడా నికి మోదీ ప్రభుత్వం ఇప్పటికీ ప్రయత్నం చేయడం లేదు. 190వ ‘లా కమిషన్‌’ సిఫార్సులను అమలు చేయడం లేదా మరోసారి చట్టసవరణ చేయడం ద్వారా ఫిరాయింపుల జాడ్యాన్ని అరికట్టవచ్చు. అటువంటి చొరవ ఎన్డీఏ ప్రభు త్వంలో కనపడటం లేదు. పార్లమెంటులో చేసే చట్టాలను పటిష్టవంతంగా అమలు చేయడం కేంద్రానికున్న రాజ్యాంగ బాధ్యతల్లో ముఖ్యమైనది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి పార్లమెంట్‌ ఆమోదించిన ‘ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన బిల్లు 2014’లోని పలు అంశాలను ఇప్పటికీ కేంద్రం అమలు చేయడం లేదు. 

స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగబద్ధంగా అందించా ల్సిన విధులు, నిధులు బదలాయించడంలో గత యూపీఏ అనుసరించిన మార్గంలోనే ఎన్డీఏ కూడా పయనిస్తోంది. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు అటకెక్కిన మహిళా రిజర్వే షన్ల బిల్లు చట్టరూపం దాల్చడానికి ఎన్డీఏ ప్రభుత్వం చొరవ చూపడం లేదు. వైద్యరంగంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు, ముఖ్యంగా కరోనా నేపథ్యంలో ప్రైవేటు వైద్యరంగం పాల్పడిన దాష్టీకాలనుండి గుణపాఠాలు నేర్చు కోవాలి. విద్య, వైద్య రంగాలను ప్రైవేటు కబంధ హస్తాల నుండి విముక్తం చేసి వాటిని సార్వజనీనం చేయాలి. ప్రజల విశ్వసనీయతను కోల్పోతున్న వ్యవస్థల్లో ఒకటైన ‘భారత ఎన్నికల కమిషన్‌’ను మరింత సమర్థవంతంగా, పారదర్శ కంగా రూపొందించి ఎవరు అక్రమాలకు పాల్పడినా ఉపేక్షిం చదన్న భయాన్ని రాజకీయ పార్టీలకు, వ్యక్తులకు కలిగేలా సంస్కరణలు చేపడతారని ఆశించినప్పటికీ, ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. న్యాయవ్యవస్థ ప్రజలకు సమ న్యాయాన్ని, సత్వర న్యాయాన్ని అందించడానికి అవసర మైన సహాయ సహకారాలు ప్రభుత్వపరంగా అందగలగాలి. 

దేశంలో దాదాపు 3,500కుపైగా వెనుకబడిన కులాలు ఉండగా అందులో 3,400 కులాలు ఇంతవరకు పార్లమెం టులోగానీ, అసెంబ్లీలోగానీ అడుగు పెట్టలేదు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రంలో 100కుపైగా ఉన్న వెనుక బడిన కులాలవారికి దాదాపు 70కుపైగా ప్రత్యేక కార్పొ రేషన్లు ఏర్పరచి రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రోత్సాహం కల్పించడం దేశంలోనే ఓ విప్లవాత్మక ముందడుగు. అయితే, జనాభాలో 50 శాతంగా ఉన్న ఓబీసీ వర్గాల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం గణనీయంగా నిధులు పెంచాల్సిన అవ సరం ఉంది. ఓబీసీ వర్గాలకు కేంద్రంలో ప్రత్యేకించి మంత్రి త్వశాఖను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ ఎప్పట్నుంచో ఉన్నప్పటికీ దానిని అమలు చేయాలన్న చిత్తశుద్ధి ఎన్డీఏ ప్రభుత్వంలో కనపడటం లేదు. 

రాజ్యాంగానికి నిబద్ధులం అని చాటుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. ఆకలి, అనారోగ్యం, పేదరికం నిర్మూలన, దోపిడీ, వివక్షల నుండి రక్షణ తదితర సామాజిక లక్ష్యాల సాధనలో ఏ మేరకు విజయం సాధించారన్నదే కొలమానం. రాజ్యాంగం అంటే చట్టపరమైన పత్రాలే కాదు, అదొక సామాజిక పత్రం అన్న అంబేడ్కర్‌ మాటల్ని చిత్త శుద్ధితో అమలు చేసి ఫలితాలు చూపించాలి. అప్పుడే రాజ్యాంగానికి కట్టుబడినట్లు భావించగలం. 
వ్యాసకర్త: సి. రామచంద్రయ్య మాజీ మంత్రి, ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top