‘నేనున్నాను’ అని చెప్పాల్సిన బాధ్యతను గుర్తు చేసే రోజు

World Suicide Prevention Day about sakshi special story - Sakshi

సెప్టెంబర్‌ 10 ఆత్మహత్యా నివారణ దినోత్సవం

‘నాకెవరున్నారు’ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నవారికి వచ్చే మొదటి ఆలోచన అది. ‘నాకెవరూ లేరు’ అనిపించడం ‘ఈ సమస్య నుంచి నన్నెవరూ బయటపడేయలేరు’ అనిపించడం ‘ఈ సమస్య వల్ల నాతో ఉన్నవాళ్లంతా నాకు లేకుండా పోతారు’ అనిపించడం ‘నాకు ఎవరైనా తోడుంటే ఈ బాధ నుంచి బయటపడగలను’ అనిపించడం ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకసారి అనిపిస్తుంది. ఎప్పుడో ఒకసారి అనిపిస్తే నష్టం లేదు.
ఎప్పుడూ అనిపిస్తేనే ప్రమాదం. ఎప్పుడూ అనిపించేవారు గమనిస్తే తెలిసిపోతారు. అలాంటి వారికి ‘నేనున్నాను’ అని చెప్పాల్సిన బాధ్యతను గుర్తు చేసే రోజు ఇది. ముఖ్యంగా ఇంట్లో ప్రతి ఒక్కరూ ‘నీకు నేనున్నాను’ అని భరోసా ఇచ్చుకోవాల్సిన రోజు. కుటుంబసభ్యుల బలమే ఆత్మహత్యకు ప్రధాన విరుగుడు. ఆ సంగతిని గ్రహించాల్సిన రోజు కూడా ఇది.

భార్గవి మధ్య వయసు గృహిణి. ఉద్యోగం చేసే భర్త, కాలేజీలకు వెళ్లే ఇద్దరు పిల్లలు ఉన్నారు. రోజంతా ఇంటి పనుల్లో ఉంటుంది. ఎవరికి ఏ అవసరం వచ్చినా క్షణాల్లో అమర్చుతుంది. చీకూ చింత చిన్న కుటుంబం. కానీ ఓ రోజు భార్గవి బాత్రూమ్‌లో రక్తపు మడుగులో పడి ఉంది. ఆసుపత్రిలో చేర్చారు. మణికట్టు కోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించింది. కోలుకున్న భార్గవి ‘నాకెవరున్నారు’ అన్న మాటలకు భర్త, పిల్లలు ఆశ్చర్యపోయారు.
∙∙
సంజయ్‌ ఇంజినీరింగ్‌ చేస్తున్నాడు. ఆలస్యంగా నిద్రలేస్తున్నాడు. అడిగితే ఆకలి లేదంటున్నాడు. పిల్లాడికి ఈ మధ్య బద్ధకం ఎక్కువైంది అనుకుంది తల్లి. అదే మాట గట్టిగా అరిచి చెప్పాడు తండ్రి. మరుసటి రోజు ఉరి వేసుకుంటూ కనిపించిన కొడుకును చూసి అదేమని అడిగితే ‘ఎందుకు బతకాలి’ అని అడిగాడు. ఆ మాటలకు తల్లడిల్లిపోయారు తల్లిదండ్రులు.
∙∙
భార్గవి కుటుంబంలో పిల్లలు కాలేజీ చదువు అయిపోగానే ఫోన్లో ఉంటారు. భర్త ఇంట్లోనూ ఆఫీసు పని చేసుకుంటూ ఉంటాడు. అదేపనిగా స్నేహితులతో మాట్లాడతాడు. కానీ, భార్య స్థితి ఏంటో పట్టించుకోడు. తలనొప్పి, నీరసం అని చెప్పినా ‘మామూలేగా’ అనేస్తాడు. ‘ఎవరూ నన్ను పట్టించుకోరు’ అనే ఆలోచనతో చావే శరణ్యం అనుకుంది భార్గవి. సంజయ్‌ ప్రేమ విఫలమై, చదువులో ఫెయిల్‌ అయిన కారణంగా జీవితాన్ని చాలించాలనుకున్నాడనే విషయాన్ని తల్లిదండ్రులు తమ లోకంలో ఉండి పసిగట్టలేకపోయారు.
∙∙
‘పన్నెండేళ్ల పిల్లల స్థాయి నుంచి వృద్ధుల వరకు ఆత్మహత్యల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతూనే ఉందంటు’న్నారు మనస్తత్వనిపుణులు. ‘‘కుటుంబంలో ఎవరైనా ఆత్మహత్యకు సంబంధించిన మాటలు మాట్లాడం, బాధపడటం చూసినప్పుడు అసలు పట్టించుకోరు. వారి భావాలను చాలా చిన్నగా చేసి చూస్తారు. 80–90 శాతం జనం ఇలాగే ఆలోచిస్తారు’ అంటారు సైకియాట్రిస్ట్‌ డాక్టర్‌ కల్యాణ్‌. ఆత్మహత్య చేసుకోవాలనుకునేవారి ప్రవర్తన ఎలా ఉంటుందో వివరించారు.
► మాట్లాడే మాటల్లో ఎక్కువ శాతం నెగిటిÐŒ గా ఆలోచిస్తారు. ‘నాకంటూ ఏవీ లేవు, ఎవరూ లేరు, ఏం చేసినా మంచి జరగదు..’ అంటూ ప్రతికూల వాతావరణాన్ని వెదుక్కుంటూ ఉంటారు.
► ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారు పదే పదే ‘చచ్చిపోతాను’ అని చెబుతున్నా ‘వీళ్లేదో బెదిరించడానికి ఇలాగే చెబుతారులే.  వీళ్లకంత ధైర్యం ఎక్కడిది?’ అనుకుంటారు ఇతరులు. దాంతో వీరు తమ మాటకు విలువ లేదని అహం దెబ్బతిని ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు.
► ఇంకో రకం వారు ఎదుటివారిలో మార్పు కోసం ఆత్మహత్యను వాడతారు. నేను చచ్చిపోతాను అనే ఆలోచన ఎదుటివారికి తెలిస్తే వారిలో మార్పు వస్తుందనుకుంటారు. ఆ విషయాన్ని గ్రహించకపోతే అంతకు తెగిస్తారు.  

మాటల కరువు
‘‘అసలు కుటుంబ సభ్యుల మధ్య మాటలే కరువయ్యాయి. ఫోన్‌లోనే జీవిస్తున్నారు’’ అంటారు సైకాలజిస్ట్‌ డాక్టర్‌ జ్యోతిరాజ. ‘సమయానికి తినడం, నిద్రపోవడం ఇవి శరీరానికి ఆరోగ్యాన్నిస్తాయి. ఉల్లాసపు మాటలు, ఉత్సాహపు కబుర్లే మనసును ఆహ్లాదంగా ఉంచుతాయి’ అంటారామె.

పాజిటివ్‌ ఆలోచనా ధోరణి ఉన్నవాళ్లలోనే ఎక్కువ
 నెగిటివ్‌ ఆలోచనలు చేసేవారిలోనే ఆత్మహత్య చేసుకోవాలనే భావన ఉంటుందని అంతా అనుకుంటాం. కానీ, అన్ని విషయాల్లోనూ సానుకూల దృక్ఫధంతో ఉన్నవారు ఎప్పుడైనా ప్రతికూల పరిస్థితి ఎదురైతే ‘ఇక అయిపోయింది నా జీవితం. ఎప్పటికీ తేరుకోలేను’ అనే ఆలోచన వచ్చి జీవితాన్ని ముగించుకోవాలనుకుంటారు. ‘పాజిటివ్‌గా ఉండే నేను నెగిటివ్‌ జీవితాన్ని భరించలేను’ అనే ఆలోచన చేస్తారు. ఇలాంటి వారిలో కొన్ని సిగ్నల్స్‌ని కనిపిస్తాయి.

కీలకమైన సిగ్నల్స్‌.. గుర్తించండి
సాదా సీదాగా కాకుండా వారి మనసు లోతుల్లోనుంచి వచ్చే భావనలా గుర్తించాలి. ‘నేను ఏదైనా చేయగలను’ అనే మనిషి ‘ఏమీ చేయలేను, నేను వేస్ట్‌’ అన్నప్పుడు వెంటనే అలెర్ట్‌ అవ్వాలి. అవి ఎలాంటివంటే..
► అభిరుచులను, ఆసక్తులు వదిలేయడం
► ఇష్టమైన పనులు చేయకపోవడం
► ఇష్టమైన మాటలు మాట్లాడకపోవడం
► ఒంటరిగా ఉండాలనుకోవడం
► చేసే పని మీద దృష్టి పెట్టకపోవడం
► బయటకు వెళ్లేందుకు ఇష్టపడకపోవడం
► ఆనందంగా ఉండే పరిస్థితుల్లోనూ బాధగా ఉండటం.

బాధాకరమైన మాస్క్‌ వేసుకుంటారు
డిప్రెషన్‌లో ఉన్నవారి కళ్లు నిస్తేజంగా, మెరుపు కోల్పోయి కనపడతాయి. ముఖంలో నవ్వు ఉండదు. బ్లాంక్‌ ఫేస్‌తో ఉంటారు. భావోద్వేగాలను ముఖంలో పలికించలేరు. మాట్లాడటానికే ఇష్టపడరు. కాళ్లూ చేతుల కదలికలను కూడా ఇష్టపడరు. రోజువారీ పనులనూ నిర్లక్ష్యం చేస్తారు.
కాలు విరిగినా, చెయ్యి విరిగినా బాగయ్యేంతవరకు ఎలా విశ్రాంతి తీసుకుంటామో.. అలాగే మనసు కూడా సేదతీరేంత వరకు అవకాశాన్ని ఇవ్వాలి. సహనంతో కుటుంబ సభ్యులు ఇందుకు పూనుకోవాలి.

మాటలే మందు..!
పలకరించాలి. మాట్లాడుకోవాలి. గతంలో సాధించిన గెలుపు ఓటములను ప్రస్తావించాలి. పరిస్థితులు మారుతాయి అని చెప్పాలి. ఎక్కడన్నా బాధాకరమైన కథనాలు ఉంటే వాటి నుంచి వారు ఎలా బయటపడ్డారో కూడా చెప్పాలి. సానుభూతి వాతావరణం మంచిది కాదు. ప్రాంతాన్ని మార్చాలి. నలుగురిలో సులువుగా కలిసిపోయేలా ఉంచాలి.
– డా. కళ్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్‌

అతి పెద్ద మారణాయుధం ఫోన్‌
ఫోన్‌ కుటుంబాల్లోకి వచ్చి తిష్టవేసాకా  ఒకరి బాగోగులు ఒకరు పట్టించుకోవడం అనేదే పోయింది. ఎక్కడో ఉన్నవారిని ‘అయ్యో’ అని మెసేజుల్లో పరామర్శిస్తారు. కానీ, ఇంటి వ్యక్తిని మాత్రం విస్మరిస్తారు. పిల్లల దగ్గర నుంచి ఫోన్లు లాక్కుంటే తమ పెన్నిధిని కోల్పోయినట్టుగా భావిస్తున్నారు. పెద్దవాళ్లు ఫోన్‌ మాత్రమే తమ సర్వస్వం అన్నట్టుగా ఉంటున్నారు. వీటితోపాటు యువత ప్రేమ విఫలమైన కారణం, చదువులో వెనకబడటం వంటి వాటితో కూడా ఆత్మహత్యలు చేసుకోవాలనుకుంటున్నారు. కుటుంబమంతా కలిసి రోజూ పది నిమిషాలు మాట్లాడుకుంటే చాలు ఆ ఇంట ఆనందమే. ఆత్మహత్య అనే పదమే దరిచేరదు.
– డా. జ్యోతిరాజ, సైకాలజిస్ట్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top