Vivan Marwaha: దేశం చుట్టిన యువకుడు | Vivan Marwaha Travelled More Than 30000 Kms To Interview More Than 900 Millennials | Sakshi
Sakshi News home page

Vivan Marwaha: దేశం చుట్టిన యువకుడు

Jun 2 2022 11:40 PM | Updated on Jun 2 2022 11:40 PM

Vivan Marwaha Travelled More Than 30000 Kms To Interview More Than 900 Millennials - Sakshi

వివన్‌

‘యూత్‌’ అనేది ఒక పుస్తకం అనుకుంటే.. చాలామందికి ముఖచిత్రం మాత్రమే తెలుసు. పుస్తకం లోపలికి వెళితే ఏ పేజీలో ఏముందో ఎవరికెరుక! ఆ యూత్‌లోనే ఒకరైన 26 ఏళ్ల వివన్‌ మర్వాహ దేశమంతా తిరిగి యూత్‌ను అన్ని కోణాలలో అర్థం చేసుకునే అద్భుతమైన పుస్తకం రాశాడు. తాజాగా అతడి పేరు ‘ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30 ఏషియా’ జాబితాలో చోటుచేసుకుంది...

‘మా జనరేషన్‌కు మీ జనరేషన్‌కు అసలు సంబంధమే లేదు. ఎంతో తేడా కనిపిస్తుంది!’ అంటాడు నాన్న. ‘మారోజుల్లో స్కూల్లో మగపిల్లలతో మాట్లాడడానికి భయపడేవాళ్లం’ అంటుంది అమ్మ. ‘మీ తరానికి ఖర్చు చేయడం తప్ప పొదుపు చేయడం తెలియదు’ అంటాడు తాత. నిజంగా మనకు మిలీనియల్స్‌ గురించి ఎంత తెలుసు? ఎంత తెలియదు? అసలు వారి ప్రపంచం ఏమిటి? ఈ ప్రశ్నలకు జవాబు వెదుక్కోవడానికి ఆ మిలీనియల్స్‌లో ఒకరైన వివన్‌ సుదీర్ఘమైన దూరాలు ప్రయాణం చేశాడు.

అలా మొదలైంది...
దిల్లీలో పెరిగిన వివన్‌ పైచదువుల కోసం కాలిఫోర్నియా(యూఎస్‌)కు వెళ్లాడు. అక్కడ తాను గమనించింది ఏమిటంటే మిలీనియల్స్‌ మానసిక ప్రపంచాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రభుత్వం వివిధ రూపాల్లో నిర్మాణాత్మకమైన కృషి చేయడం. ‘యూత్‌ ఎక్కువగా ఉన్న మన దేశంలో ఇలాంటి ప్రయత్నం ఎందుకు జరగడం లేదు’ అని ఆశ్చర్యపోయాడు వివన్‌. 

కాలేజి చదువు పూర్తయిన తరువాత ‘నెక్స్‌›్ట ఏమిటీ?’ అనే ప్రశ్న ముందుకు వచ్చినప్పుడు ఒక పుస్తకం రాయాలనిపించింది. మనదేశంలోని మిలీనియల్స్‌ ప్రపంచంలోకి వెళ్లాలనుకున్నాడు. దీనికి ముందస్తు సన్నాహంగా మన దేశ మిలీనియల్స్‌కు సంబంధించిన సమాచారం కోసం వెదికితే నిరాశే ఎదురైంది.

తనకు లభించిన అరకొర సమాచారంతోనే నోట్స్‌ రాసుకొని అమెరికా నుంచి బయలుదేరాడు. ఇండియాకు వచ్చి నలుదిక్కులలోని 13 రాష్ట్రాలలో 30,000 కి.మీ దూరం ప్రయాణించాడు.‘మిలీనియల్స్‌ గురించి తెలుసుకోవాలంటే కాలేజిలకు వెళితే సరిపోతుంది’ అనే కాన్సెప్ట్‌ను నమ్ముకోలేదు వివన్‌. సెల్‌ఫోన్‌ రిపేర్‌ చేసేవారి నుంచి సెలూన్‌లో పనిచేసేవారి వరకు అందరినీ కలిశాడు. వారి అభిప్రాయాల్లో దాపరికాలు, ముసుగులు లేవు. మనసులో ఉన్నది బయటికి స్వేచ్ఛగా మాట్లాడేస్తున్నారు.

‘ఒకప్పుడు బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమాల్లో కనిపించే నిరుద్యోగం ఇప్పుడు లేదు. చాలా అవకాశాలు ఉన్నాయి. నాకు చదువు పెద్దగా అబ్బలేదు. నా ఫ్యూచర్‌ గురించి ఇంట్లో వాళ్లు బాధ పడ్డారు. ఇప్పుడు నేను సెల్‌ఫోన్‌ రిపేరింగ్‌ షాప్‌ నడుపుతున్నాను. నా సంపాదన ప్రభుత్వ ఉద్యోగి నెలజీతంతో సమానంగా ఉంది’ అంటున్నాడు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన అక్షిత్‌ అనే కుర్రాడు. బెంగాల్‌లోని కోల్‌కతాకు వెళితే...

‘లవ్‌మ్యారేజ్‌ని ఇష్టపడతావా? పెద్దలు కుదిర్చిన పెళ్లి అంటే ఇష్టమా?’ అనే ప్రశ్నకు నీళ్లు నమలకుండా ‘పెద్దలు కుదిర్చిన పెళ్లినే ఇష్టపడతాను’ అన్నాడు ఒక కాలేజి కుర్రాడు. ఇదే అభిప్రాయం చాలా మంది నోటి నుంచి వినిపించింది. ఇంఫాల్‌(మణిపూర్‌)లో ఒకచోట...‘మనం ఎక్కడ ఉన్నామనేది సమస్య కాదు. మెగా సీటిలో ఉన్నా మారుమూల పల్లెలో ఉన్నా సామాజిక మాధ్యమాలు, ఇతరత్రా సాధనాల ద్వారా అనేకానేక విషయాలు తెలుసుకోవచ్చు. మనకు కావాల్సింది ఆసక్తి మాత్రమే’ అంటోంది యూత్‌. అయితే ఒక అంశంపై అన్ని ప్రాంతాలలోనూ ఒకేరకమైన అభిప్రాయాలు వినిపించడం లేదు.

‘మీ లక్ష్యం ఏమిటి?’ అని దిల్లీ, ముంబై యువతరాన్ని ప్రశ్నిస్తే స్టార్టప్‌ల గురించి చెప్పారు. జబల్‌పూర్‌లాంటి పారిశ్రామిక పట్టణాల్లో ప్రభుత్వ ఉద్యోగం, భద్రజీవితమే తమ లక్ష్యం అంటుంది యువతరం. ఎన్నో ప్రాంతాలు, ఎన్నో పట్టణాలు తిరిగి...కెరీర్, రాజకీయాలు, మతం, కులం, ఆశలు, ఆశయాలు...మొదలైన వాటిపై మిలీనియల్స్‌ అభిప్రాయాలను లోతుగా తెలుసుకొని ‘వాట్‌ మిలీనియల్స్‌ వాంట్‌’ పేరుతో పుస్తకం రాశాడు వివన్‌. ఈ పుస్తకానికి ‘ఇండియన్‌ మిలీనియల్స్‌ బయోగ్రఫీ’ అంటూ ప్రశంసలు లభించాయి. జీక్యూ ఇండియా ‘టాప్‌ నాన్‌ ఫిక్షన్‌ బుక్‌ ఫర్‌ 2021’ జాబితాలో నిలిచింది.

‘అమెరికా, చైనాలతో పోల్చితే ఇండియన్‌ మిలీనియల్స్‌ ఏమిటి?’ 
వివన్‌ మాటల్లో చెప్పాలంటే...‘1993లో ఇండియా, చైనా జీడిపి ఇంచుమించుగా ఒకేస్థాయిలో ఉండేది. ఆ తరువాత మాత్రం చైనా దూసుకుపోయింది. ఫలితంగా మన మిలీనియల్స్‌తో పోల్చితే చైనా వాళ్లు ఆర్థికస్థిరత్వంతో ఉన్నారు. వారిలో అభద్రతా కనిపించడం లేదు. అమెరికాలో గత తరాలతో పోల్చితే చాలా స్వేచ్ఛగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. మనదేశంలో మాత్రం సంప్రదాయాలను గౌరవించే ధోరణి పెరిగింది’ క్షేత్రస్థాయిలోకి వెళితే ఎన్నో విలువైన విషయాలు తెలుస్తాయి అని చెప్పడానికి బలమైన ఉదాహరణ...వాట్‌ మిలీనియల్స్‌ వాంట్‌.                           

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement