గువ్వల్ని మింగుతున్న గద్దలు

Telugu Movie and serial Actress Deceased Special Story In Family - Sakshi

చిట్టి గువ్వలు ఎన్నో ఊళ్ల నుంచి కలల రెక్కలను అల్లార్చి ఎగిరి వస్తాయి. తెలియని నగరంలోతెలియని మనుషుల్ని నమ్మి ఆడతాయి. పాడతాయి. ప్రతిభ చూపి పైకి ఎగరాలనుకుంటాయి. కాని ఊరి గువ్వలంటే గద్దలకు లోకువ. అవి వెంటబడతాయి. వేధిస్తాయి. గువ్వలు కట్టుకుంటున్న గూళ్లను కూలదోస్తాయి. గతంలో నటి భార్గవి విషయంలో అయినా ఇప్పుడు శ్రావణి విషయంలో అయినా జరుగుతున్నది ఇదే. బహుపరాక్‌... బహుపరాక్‌.

ఏ రంగంలో అయినా మార్గదర్శులు అవసరం. సినిమా పరిశ్రమలో మరీ అవసరం. పెద్ద కుటుంబాల నుంచి పెద్ద ఊళ్ల నుంచి పెద్ద చదువులు చదువుకొని వచ్చిన వారికి ఇవన్నీ కొంత సులువుగా దొరుకుతాయి. చిన్న ఊళ్ల నుంచి వచ్చినవాళ్లకు ఏ ఆధారమూ దొరకనప్పుడు తాడైనా పామైనా పట్టుకోక తప్పదు. ఇలాంటి వారికి ముందు ఆశ్రయం ఇచ్చినవారే తరువాత విరోధులుగా మారడం, ఈ మార్గదర్శులనుకునే వారితోనే తీవ్రమైన సమస్యలు రావడం సినిమా పరిశ్రమ నిండా ఉంది. అయినప్పటికీ కొత్తగా వస్తున్న స్ట్రగులర్స్‌ గుడ్డిగానే ఉంటున్నారు సమస్యలు తెచ్చుకుంటున్నారు.

కంగనా రనౌత్‌ నుంచి
నటి కంగనా రనౌత్‌ కూడా తల్లిదండ్రులను ఎదిరించి హిమాచల్‌ ప్రదేశ్‌లోని చిన్న ఊరి నుంచి ముంబై చేరుకుంది. మొదట ఆమెకు ముంబైలో ఆశ్రయం ఇచ్చింది నటుడు ఆదిత్యాపంచోలి కుటుంబం. కంగనా కు అవకాశాలు రావడానికి ఆదిత్యా పలుకుబడి కొంత ఉపయోగపడింది. ఆ తర్వాత కంగనా అతని పట్టు నుంచి బయటపడటానికి చాలా పెనుగులాడాల్సి వచ్చిందని ఆమే చెప్పుకుంది. ఆదిత్యా పంచోలి తనపై భౌతిక దాడి చేశాడని కూడా చెప్పుకుంది. అయితే అప్పటికే ఆమె సినిమా రంగంలో ఎలా మెలగాలో తెలుసుకోవడం వల్ల నిలబడగలిగింది. ఆ తర్వాత మరో బాలీవుడ్‌ నటి జియా ఖాన్‌ ఆత్మహత్య కేసులో ఆదిత్యా పంచోలి కుమారుడు సూరజ్‌ పంచోలి పేరు ప్రముఖంగా వచ్చింది. దీనికి ముందు నటి మహిమా చౌదరి కూడా కొండ ప్రాంతం డార్జిలింగ్‌ నుంచి బాలీవుడ్‌ కలలు కంటూ ముంబై చేరుకుంది.

దర్శకుడు సుభాష్‌ ఘాయ్‌ ఈమెకు తొలి అవకాశం ‘పర్‌దేశ్‌’ లో ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన ఆమె కెరీర్‌ పట్ల శాసనకర్తగా మారడంతో మహిమా చౌదరి ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఈ విషయాన్ని ఆమె ప్రెస్‌కు ఎక్కి చెప్పింది. ఇటీవల కూడా ఆమె సుభాష్‌ ఘాయ్‌ గురించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎంతో పేరు వచ్చినప్పటికీ ఈ డిస్ట్రబెన్స్‌ వల్ల  మహిమా చౌదరి కెరీర్‌ ఆశించిన స్థాయిలో సాగలేదు. ఈ మార్గదర్శుల వల్ల వచ్చే విలోమ ఫలితం ఏమిటంటే వీరు అవకాశాలు కల్పిస్తారు అని మిగిలినవారు ఇవ్వరు. ఆ మార్గదర్శులంటే పడనివారూ ఇవ్వరు. రామ్‌గోపాల్‌ వర్మతో ఎక్కువ సినిమాలు చేసిన ‘ఆంత్రా మాలి’ ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొందని చెప్పవచ్చు. అతి తక్కువ సమయంలోనే ఆమె సినిమాల నుంచి విరమించుకుంది.

లౌక్యంలో చిక్కుకుని
తెలుగు ప్రాంతాల నుంచి ముఖ్యంగా చిన్న ఊళ్ల నుంచి వచ్చిన వారికి సినిమా పరిశ్రమలో సరైన మార్గదర్శులు దొరకడం ముఖ్య సమస్య. బాలీవుడ్‌లో దీని కోసం కన్సల్టెంట్‌లు ఉంటారు. ఏజెన్సీలు ఉంటాయి. తెలుగులో ‘మేనేజర్లు’, ‘డేట్స్‌ చూసేవారు’ ఉంటారు. లేదా ‘స్నేహితులు’ ఉంటారు. వీరు ఇండస్ట్రీలోని అనుభవజ్ఞులైతే కెరీర్‌ ఒక విధానంలో నడుస్తుంది. వీరూ కొత్తవారై వీరూ అగమ్యగోచరంగా ఉంటే కెరీర్‌ ప్రమాదంలో పడుతుంది. చాలా కథలు ఎలా ఉంటాయంటే ‘నా వల్ల పైకి వచ్చావు. పైకి రాగానే నన్ను వదిలించుకుంటున్నావు’ అనేలా ఉంటుంది.

ఇవతలి పక్షానికేమో ‘నీ వల్ల పైకి వచ్చాను నిజమే. ఇప్పుడు నా మీద పడి బతుకుతూ నన్ను పంజరంలో పెట్టాలని చూస్తున్నావు’ అన్నట్టు ఉంటుంది. మనం ఎంచుకున్న రంగంలో పైకి రావాలంటే ‘నలుగురితో లౌక్యంగా’ ఉండాలి అనుకోవడం మరో సమస్యగా మారుతోంది. అందరితో మంచిగా, స్నేహంగా మాట్లాడిన వెంటనే దానిని అడ్వాంటేజ్‌గా తీసుకొని జీవితాల్లో చొరబడే పరిస్థితికి వస్తోంది. ఆ తర్వాత ప్రమాదాల వరకూ వెళుతోంది.

భార్గవి/శ్రావణి
2008లో ఆత్మహత్య చేసుకున్న ‘అష్టాచెమ్మా’ ఫేమ్‌ భార్గవి, ఇప్పుడు హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న శ్రావణి చిన్నఊళ్ల నుంచి వచ్చినవారే. భార్గవి సొంతఊరు గుంటూరు జిల్లా గోరంట్ల. ఆమెకు సినిమా రంగంలో వెలగాలని కలలు కంది. అందుకు నెల్లూరు జిల్లాకు చెందిన ప్రవీణ్‌ (బుజ్జి)ను మార్గదర్శిగా ఎంచుకుంది. ఆర్కెస్ట్రా నడుపుతూ సినీ పరిచయాలు కలిగిన ప్రవీణ్‌ భార్గవికి అవకాశాలు రావడానికి ప్రయత్నించాడు. సక్సెస్‌ అయ్యాడు. ఈలోపు వారిరువురూ ప్రేమలో పడ్డారని అంటారు. ‘అష్టాచెమ్మా’ హిట్‌ అయ్యాక భార్గవి కెరీర్‌ ఊపందుకుంది. అది ప్రవీణ్‌ కు ఇన్‌సెక్యూరిటీ కలిగించింది. 2008 డిసెంబర్‌లో ఇంట్లో ఆమెను కత్తితో పొడిచి చంపి అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతో ప్రతిభ ఉన్న భార్గవి భవిష్యత్తు అలా ముగిసింది.

ఇప్పుడు శ్రావణి కథ కూడా అలాగే ఉంది. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు నుంచి మంచి భవిష్యత్తును ఊహించుకుంటూ హైదరాబాద్‌ చేరుకున్న శ్రావణికి సాయి, దేవరాజ్‌ అనే మిత్రులే మార్గదర్శులు అయ్యారు. కెరీర్‌లో ముందుకు వెళ్లే కొద్దీ వీరిరువురి మధ్య ఆమె నలిగినట్టుగా ఇప్పటి వరకూ వస్తున్న వార్తల వల్ల తెలుస్తోంది. ఒక సినిమా నిర్మాత పేరు కూడా వినిపిస్తోంది. ఇంకా ఎంతమంది ఆడపిల్లలు ఈ వొత్తిళ్లలో, వలయాల్లో ఉన్నారో తెలియదు.

హత్య–ఆత్మహత్య– బ్లాక్‌మెయిల్‌
వర్క్‌ రిలేషన్స్‌గాని వ్యక్తిగత రిలేషన్స్‌గాని ఏర్పరుచుకోవడం, విరమించుకోవడంలో తగిన మెచ్యూరిటీ లేకపోవడం, వాటినెలా హ్యాండిల్‌ చేయాలో తెలియకపోవడం వల్ల రిలేషన్స్‌ ‘వద్దు’ అనుకున్నప్పుడు ‘హత్య’, ‘ఆత్మహత్య’, ‘బ్లాక్‌మెయిల్‌’ వంటి పదాలు తారసపడుతున్నాయి. ఇవన్నీ లేకుండా కూడా విడిపోయి ఎవరి పని వారు చేసుకోవచ్చు. ప్రతిదానికి ఈ కొత్త టెక్నాలజీ ఒకటి మంచితోపాటు చెడ్డకూ ఉపయోగపడుతోంది. ఫొటోలు, వీడియోలు, కాల్‌ రికార్డింగ్‌లు ఆ సమయానికి బాగున్నా ఆ తర్వాత నరకాన్ని సృష్టిస్తున్నాయి. సమస్యలు వచ్చినప్పుడు టీవీ రంగంలో అయినా సినిమా రంగంలో అయినా వెళ్లి చెప్పుకునే విభాగాలు ఉండాలి. సరైన పెద్దలు ఉండాలి. పోలీసు విభాగంలో కూడా ఈ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీ వారి కోసం కౌన్సిలింగ్‌ సెంటర్‌ అవసరం గట్టిగా కనపడుతోంది. మరో శ్రావణి ఉదంతం జరక్కూడదంటే ఏం చేయాలో అందరూ ఆలోచించాలి. అప్రమత్తంగా కావాలి.
– సాక్షి ఫ్యామిలీ  (ఇన్‌పుట్స్‌: సినిమా డెస్క్‌)

ప్రత్యూష బెనర్జీ గుర్తుందా?
ప్రత్యూష బెనర్జీ  ‘చిన్నారి పెళ్లి కూతురు’ ద్వారా ప్రేక్షకులకు పరిచయం. కెరీర్‌లో పైకొస్తుండగా 25 ఏళ్లకే 2016 ఏప్రిల్‌ 1న ఆత్మహత్య చేసుకుంది. దానికి కారణం బాయ్‌ఫ్రెండ్‌ రాహుల్‌ రాజ్‌ అని పోలీసుల కథనం. చనిపోయే ముందు రాహుల్‌తో ప్రత్యూష ఫోన్లో మాట్లాడిన సంభాషణను పోలీసులు సేకరించారు. కేసు న్యాయవిచారణలో ఉంది.

ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలి
నటి శ్రావణి మరణం నన్ను తీవ్రంగా కలిచివేసింది. కారణం ఏంటంటే 12 ఏళ్ల క్రితం నేను దర్శకత్వం వహించిన ‘అష్టాచమ్మా’ చిత్రంలో అద్భుతంగా నటించిన భార్గవి కూడా ఇలానే వ్యక్తిగత కారణాల వల్ల మరణించింది. చిన్న చిన్న ఊర్లనుండి, టౌన్లనుండి ఆర్టిస్ట్‌ అవుదామని వచ్చిన ఆడపిల్లలు ఏ పరిస్థితుల్లో ఇలాంటి ఉచ్చుల్లో బిగుసుకుపోతున్నారు? దీని గురించి చాలా తీవ్రంగా ఆలోచించాలి. ఇదే కెరీర్‌గా ఎన్నుకుని సినిమా పరిశ్రమకు వచ్చేవారికి ఈ పరిశ్రమపై నమ్మకాన్ని పెంచే విధంగా మనం చర్యలు చేపట్టాలి. వాళ్లకు వచ్చిన సమస్యలను చెప్పుకుని, దానికి పరిష్కారం ఇప్పించే ఒక వ్యవస్థను ఏర్పరచుకోవాలి. సినీరంగానికి సంబంధించినవారు, సామాజిక విశ్లేషకులు తీవ్రంగా ఆలోచించి ఏదో ఒక వ్యవస్థను ముందుకు తీసుకురావాలి. ఆ వ్యవస్థ ఏర్పాటయ్యేవరకూ ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదని కోరుకుంటున్నా. – దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ

శ్రావణి చాలా సిన్సియర్‌
శ్రావణి ఆత్మహత్య చేసుకుందనే విషయం తెలియగానే షాక్‌ అయ్యాను. ఆమె వర్క్‌ విషయంలో చాలా సిన్సియర్‌గా, హానెస్ట్‌గా ఉండేది. షూటింగ్‌కి టైమ్‌కి కరెక్ట్‌గా వచ్చేది. ఎప్పుడూ జోవియల్‌గా ఉంటూ అందరితో కలివిడిగా ఉండేది. నటీనటులు కొంచెం ఎమోషనల్‌గా ఉంటారు, కానీ శ్రావణి బాగా ప్రాక్టికల్‌గా ఉండేది. అలా ఉండే అమ్మాయి ఇలా ఆత్మహత్య చేసుకోవటం బాధ కలిగించింది. ఈ జనరేషన్‌ పిల్లలు తెలుసుకోవాల్సింది ఏంటంటే.. ప్రేమ సమస్య అవ్వొచ్చు, మరో సమస్య అవ్వొచ్చు... అవేమీ జీవితం కంటే  పెద్దవి కాదనేది వాళ్లు గమనించాలి. జీవితాన్ని ముగించే ముందు విచక్షణతో ఒక్క నిమిషం ఆలోచిస్తే ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉంటారు. – దర్శకుడు మలినేని రాధాకృష్ణ, ‘మౌనరాగం’ దర్శకుడు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top