Satarupa Majumdar: బాల్యం చిగురించింది | Teacher Incredible Journey of Building an English-Medium School in Remote Sundarbans | Sakshi
Sakshi News home page

Satarupa Majumdar: బాల్యం చిగురించింది

Mar 10 2022 4:22 AM | Updated on Mar 12 2022 11:34 AM

Teacher Incredible Journey of Building an English-Medium School in Remote Sundarbans - Sakshi

ఆమె పేరు శతరూప మజుందార్‌. కోల్‌కతాలో టీచర్‌. అనుకోకుండా జరిగిన ఒక ప్రయాణం ఒక పెద్ద మార్పునకు బీజం అయింది.

ఆమె పేరు శతరూప మజుందార్‌. కోల్‌కతాలో టీచర్‌. అనుకోకుండా జరిగిన ఒక ప్రయాణం ఒక పెద్ద మార్పునకు బీజం అయింది. ఆ మార్పు ఆమె జీవితానికి కాదు. పదిహేడు వందల మంది పిల్లల జీవితాల్లో మార్పుకు కారణమైంది. మోడువారిన బాల్యం కొత్త చిగుళ్లు సంతరించుకుంది.

శతరూప కుటుంబానికి వారమంతా పని చేయడం, వారాంతంలో సమీపంలో ఉన్న ప్రదేశానికి చిన్న టూర్‌ వెళ్లడం అలవాటు. అలా ఆమె 2012లో వెస్ట్‌ బెంగాల్‌లోని హింగల్‌గంజ్‌కు టూర్‌వెళ్లింది. ఇది ఒక దీవి. భారత్‌– బంగ్లాదేశ్‌ల సరిహద్దులో ఇచ్చామతి నది మధ్యలో ఉంది. అక్కడి పిల్లలను చూసినపుడు తీవ్రంగా మనసు కలచి వేసింది.

భోజనానికి బడి
దాదాపుగా ఏడాది పొడవునా వర్షాలు, వరదలతో సతమతమయ్యే ప్రాంతం అది. ప్రభుత్వం పాఠశాలలో మధ్యాహ్నం భోజనం పెడుతుంది కాబట్టి పిల్లలు స్కూలుకెళ్తారు. అయితే వాళ్లు బడిలో ఉండేది మధ్యాహ్నం భోజనం చేసే వరకే. ఆ తర్వాత మురికిగుంటల్లో ఆటలకు వెళ్లిపోతారు. బడిలో ఉండమని పిల్లల్ని కట్టడి చేయాల్సిన, అవసరమైతే మందలించాల్సిన బాధ్యతను గురువులు మర్చిపోతారు. వాళ్లను కన్నవాళ్లు బడికి పంపాల్సిన బాధ్యత ఎరిగిన వాళ్లు కాదు.

చేపలు పట్టడం, బీడీలు చుట్టడం, వ్యవసాయ కూలిపనులతో కడుపు నింపుకోవడమే భారంగా ఉండే జీవితాలవి. ఈ నేపథ్యంలో సాగిన బడి ప్రస్థానం ఏ పిల్లలనైనా ఫెయిల్‌ చేసి తీరుతుంది. ఫెయిలైన తర్వాత ఏడాది బడిలో పేరు ఉండదు. పేరు లేదు కాబట్టి వాళ్లకు మధ్యాహ్నం భోజనం ఉండదు. పిల్లలు బడి ముఖం కూడా చూడరు. ఇక ఆ పిల్లల బాల్యం పువ్వులా ఎలా విచ్చుకుంటుంది? బడిమానేసిన పిల్లలు పెద్దవాళ్లతోపాటు బీడీలు చుట్టడంలో మునిగిపోతారు.

అక్షరాలు దిద్దాల్సిన వేళ్లు బీడీలను అల్లుతుంటే చూడలేకపోయింది శతరూప. ఆ పిల్లలందరూ తన ఆరేళ్ల కూతురి వయసుకి కొంచెం అటూఇటూగా ఉన్నవాళ్లే. తన కూతురు పెరుగుతున్న వాతావరణానికీ– ఈ పిల్లలు పెరుగుతున్న వాతావరణానికీ ఎక్కడా పోలికే లేదు. పేదరికం పెనం మీద అట్టుడికి పోతున్న బాల్యం వాళ్లది. అందమైన బాల్యం పిల్లలు హక్కు. ఆ హక్కు నిరభ్యంతరంగా నేలరాయబడుతోందక్కడ. ‘స్వతంత్ర భారతంలో పాలకులు ఇన్నేళ్లపాటు వాళ్లకు అందించిన సౌకర్యాలేమిటి’ అనే ప్రశ్న మదిలో ఉదయిస్తుంది. కానీ సమాధానం చెప్పేవాళ్లే ఉండరు. అయితే శతరూప సమాధానం కోసం చూడలేదు. తనే ఒక సమాధానం కావాలనుకుంది.

మర్చిపోలేదామె!
ఇక్కడో విషయాన్ని గమనించాలి. ఇలాంటి పరిస్థితులను చూసినప్పుడు చాలామంది మనసు కకావికలమవుతుంది. కానీ టూర్‌ ముగించుకుని నగరానికి వెళ్లిన వెంటనే రొటీన్‌లో పడి మర్చిపోవడమూ జరుగుతుంది. అయితే శతరూప విషయంలో అలా జరగలేదు. హింగల్‌గంజ్‌ నుంచి కోల్‌కతాకు వెళ్లిన తర్వాత కూడా తాను చూసిన దృశ్యాలు ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి. అందుకే స్వప్నోఫూరోన్‌ వెల్ఫేర్‌ సొసైటీని స్థాపించింది.

‘స్వప్నోఫూరోన్‌’ పేరుతో సుందర్‌బన్‌లో తొలి ఇంగ్లిష్‌ మీడియం స్కూలు పెట్టింది శతరూప. స్వప్నోపురోన్‌ అంటే ‘కల నిజమాయె’ అని అర్థం. ఆ తర్వాత మరో ఐదు దీవుల్లో పాఠశాలలను తెరిచింది. ఈ పదేళ్లలో ఆ పాఠశాలలు పదిహేడు వందల బాల్యాలను గాడిలో పెట్టాయి. అచ్చమైన, అందమైన బాల్యాన్ని ఆస్వాదిస్తూ పెరుగుతున్నారా పిల్లలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement