breaking news
Sundarbans area
-
Satarupa Majumdar: బాల్యం చిగురించింది
ఆమె పేరు శతరూప మజుందార్. కోల్‌కతాలో టీచర్. అనుకోకుండా జరిగిన ఒక ప్రయాణం ఒక పెద్ద మార్పునకు బీజం అయింది. ఆ మార్పు ఆమె జీవితానికి కాదు. పదిహేడు వందల మంది పిల్లల జీవితాల్లో మార్పుకు కారణమైంది. మోడువారిన బాల్యం కొత్త చిగుళ్లు సంతరించుకుంది. శతరూప కుటుంబానికి వారమంతా పని చేయడం, వారాంతంలో సమీపంలో ఉన్న ప్రదేశానికి చిన్న టూర్ వెళ్లడం అలవాటు. అలా ఆమె 2012లో వెస్ట్ బెంగాల్‌లోని హింగల్‌గంజ్‌కు టూర్వెళ్లింది. ఇది ఒక దీవి. భారత్– బంగ్లాదేశ్‌ల సరిహద్దులో ఇచ్చామతి నది మధ్యలో ఉంది. అక్కడి పిల్లలను చూసినపుడు తీవ్రంగా మనసు కలచి వేసింది. భోజనానికి బడి దాదాపుగా ఏడాది పొడవునా వర్షాలు, వరదలతో సతమతమయ్యే ప్రాంతం అది. ప్రభుత్వం పాఠశాలలో మధ్యాహ్నం భోజనం పెడుతుంది కాబట్టి పిల్లలు స్కూలుకెళ్తారు. అయితే వాళ్లు బడిలో ఉండేది మధ్యాహ్నం భోజనం చేసే వరకే. ఆ తర్వాత మురికిగుంటల్లో ఆటలకు వెళ్లిపోతారు. బడిలో ఉండమని పిల్లల్ని కట్టడి చేయాల్సిన, అవసరమైతే మందలించాల్సిన బాధ్యతను గురువులు మర్చిపోతారు. వాళ్లను కన్నవాళ్లు బడికి పంపాల్సిన బాధ్యత ఎరిగిన వాళ్లు కాదు. చేపలు పట్టడం, బీడీలు చుట్టడం, వ్యవసాయ కూలిపనులతో కడుపు నింపుకోవడమే భారంగా ఉండే జీవితాలవి. ఈ నేపథ్యంలో సాగిన బడి ప్రస్థానం ఏ పిల్లలనైనా ఫెయిల్ చేసి తీరుతుంది. ఫెయిలైన తర్వాత ఏడాది బడిలో పేరు ఉండదు. పేరు లేదు కాబట్టి వాళ్లకు మధ్యాహ్నం భోజనం ఉండదు. పిల్లలు బడి ముఖం కూడా చూడరు. ఇక ఆ పిల్లల బాల్యం పువ్వులా ఎలా విచ్చుకుంటుంది? బడిమానేసిన పిల్లలు పెద్దవాళ్లతోపాటు బీడీలు చుట్టడంలో మునిగిపోతారు. అక్షరాలు దిద్దాల్సిన వేళ్లు బీడీలను అల్లుతుంటే చూడలేకపోయింది శతరూప. ఆ పిల్లలందరూ తన ఆరేళ్ల కూతురి వయసుకి కొంచెం అటూఇటూగా ఉన్నవాళ్లే. తన కూతురు పెరుగుతున్న వాతావరణానికీ– ఈ పిల్లలు పెరుగుతున్న వాతావరణానికీ ఎక్కడా పోలికే లేదు. పేదరికం పెనం మీద అట్టుడికి పోతున్న బాల్యం వాళ్లది. అందమైన బాల్యం పిల్లలు హక్కు. ఆ హక్కు నిరభ్యంతరంగా నేలరాయబడుతోందక్కడ. ‘స్వతంత్ర భారతంలో పాలకులు ఇన్నేళ్లపాటు వాళ్లకు అందించిన సౌకర్యాలేమిటి’ అనే ప్రశ్న మదిలో ఉదయిస్తుంది. కానీ సమాధానం చెప్పేవాళ్లే ఉండరు. అయితే శతరూప సమాధానం కోసం చూడలేదు. తనే ఒక సమాధానం కావాలనుకుంది. మర్చిపోలేదామె! ఇక్కడో విషయాన్ని గమనించాలి. ఇలాంటి పరిస్థితులను చూసినప్పుడు చాలామంది మనసు కకావికలమవుతుంది. కానీ టూర్ ముగించుకుని నగరానికి వెళ్లిన వెంటనే రొటీన్లో పడి మర్చిపోవడమూ జరుగుతుంది. అయితే శతరూప విషయంలో అలా జరగలేదు. హింగల్గంజ్ నుంచి కోల్‌కతాకు వెళ్లిన తర్వాత కూడా తాను చూసిన దృశ్యాలు ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి. అందుకే స్వప్నోఫూరోన్ వెల్ఫేర్ సొసైటీని స్థాపించింది. ‘స్వప్నోఫూరోన్’ పేరుతో సుందర్బన్లో తొలి ఇంగ్లిష్ మీడియం స్కూలు పెట్టింది శతరూప. స్వప్నోపురోన్ అంటే ‘కల నిజమాయె’ అని అర్థం. ఆ తర్వాత మరో ఐదు దీవుల్లో పాఠశాలలను తెరిచింది. ఈ పదేళ్లలో ఆ పాఠశాలలు పదిహేడు వందల బాల్యాలను గాడిలో పెట్టాయి. అచ్చమైన, అందమైన బాల్యాన్ని ఆస్వాదిస్తూ పెరుగుతున్నారా పిల్లలు. -
‘సుందర వనాల’కు ముప్పు
మనిషి నిర్లక్ష్యం, నిష్క్రియాపరత్వం పర్యావరణానికి నిత్యమూ ప్రమాదం తెస్తుంటే...అనుకోకుండా జరిగే ఘటనలు వాటికి తోడవుతున్నాయి. సుందర్బన్స్ ప్రాంతంలో ఈమధ్య రెండు నౌకలు ఢీకొని లక్షలాది లీటర్ల చమురు సముద్రంలో కలిసిన ఉదంతం అటువంటిదే. అయిదురోజులక్రితం జరిగిన ఈ ప్రమాదంవల్ల 80 చదరపు కిలోమీటర్ల పరిధిలోని సముద్ర జలాలు కలుషితమై అక్కడుండే అపురూపమైన జీవరాశికి భారీ నష్టం వాటిల్లుతున్నదంటున్నారు. సుందర్బన్స్ ప్రాంతం యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించిన ప్రాంతం. రాయల్ బెంగాల్ టైగర్‌తో సహా అనేక పశుపక్ష్యాదులు, అరుదైన ఇరవాడీ రకం తిమింగలాలు, ఉప్పునీటి మొసళ్లు, ఇతర జలచరాలు ఉన్నాయి. అక్కడ దట్టమైన మడ అడవులున్నాయి. సుందర్బన్స్ మొత్తం 26,000 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉండగా మూడింట రెండువంతుల ప్రాంతం బంగ్లాదేశ్‌లో ఉంది. మిగిలిన భాగం భారత్ పరిధిలోకి వస్తుంది. దానికి చేర్చి షీలా, పాసూర్వంటి నదులు, వాటికి సంబంధించిన కాల్వలున్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో వాస్తవానికి నౌకాయానాన్ని అనుమతించకూడదు. నిత్యమూ పెద్ద శబ్దం చేసుకుంటూ వెళ్లే నౌకల వల్ల అక్కడి జీవరాశి ప్రశాంతతకు భంగం కలుగుతుందని, ఇలా అనుకోని ఘటనేదైనా సంభవిస్తే ఆ ప్రాంతం కాలుష్యం బారిన పడుతుందని భావించి నౌకలను అటువైపు రానీయకూడదని నిర్ణయించారు. నౌకలనేమిటి...ఏ రకమైన ప్రయాణ సాధనాలనూ అనుమ తించరాదనుకున్నారు. పైగా దట్టమైన మంచు అలుముకొని ఉన్నప్పుడు నౌకా గమనానికి అనుమతించరు. అటువంటిది మూడున్నర లక్షల లీటర్ల ఫర్నేస్ ఆయిల్‌తో వెళ్తున్న నౌకను అటుగా ఎందుకు వెళ్లనిచ్చారన్నది ప్రశ్న. ఆ నౌక సాంకేతిక లోపంతో మునకేస్తున్న దశలో మరో నౌక వచ్చి దాన్ని ఢీకొట్టింది. పర్యవసానంగా ఒక్కసారిగా చమురు లీకైంది. ఈ ప్రమాదం సంభవించిన కొన్ని గంటలకే చేపలు, పీతలు, తాబేళ్లు ఇతర జలచరాలు వేల సంఖ్యలో కొట్టుకు రావడం మొదలైందని సమీప ప్రాంతంలోని మత్స్యకారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో భౌగోళికంగా ఉండే విలక్షణతవల్ల గాలులు ఆరుగంటలకొకమారు దిశ మారతాయి. వాటికి అనుగుణంగా ఉండే కెరటాల కదలికలుఈ చమురు తెట్టు విపత్తును మరింతగా పెంచుతున్నాయి. చుట్టూ ఉండే మడ అడవులకు ముప్పు కలగడంతోపాటు సముద్రానికి చేర్చి ఉండే నదులు, కాలువల్లోని జలచరాలకు కూడా ముప్పు కలుగుతున్నది. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి తగిన సూచనలు చేయాల్సిన వ్యవస్థలు సక్రమంగా లేకపోవడమే ఈ తరహా ప్రమాదాలకు కారణం. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించిన ప్రాంతమే అయినా బంగ్లాదేశ్ ఆ స్థాయిలో దీని పరిరక్షణను పట్టించుకుంటున్నట్టు కనబడదు. ఇలాంటి విపత్తులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలమైన బంగ్లాదేశ్ ఇప్పుడు దీన్ని నివారించడానికి అవసరమైన సాంకేతికత తమ వద్ద లేదని చేతులెత్తేస్తున్నది. ఒకపక్క మడ అడవులు, మరోపక్క రాయల్ బెంగాల్ అభయారణ్యం, తిమింగలాల పరిరక్షణకు సంబంధించిన మూడు ప్రాంతాలు ఉన్నప్పుడు అటు వైపు నౌకలు వెళ్లడానికి అనుమతించకూడదు. అధికారికంగా ఎన్నడో నిషేధిం చామని బంగ్లాదేశ్ చెబుతున్నా నౌకల రాకపోకలు అక్కడ సాగుతూనే ఉన్నాయి. దీన్నంతా చూసీచూడనట్టు వదిలేయడమే ప్రస్తుత విపత్తుకు దారితీసింది. పైగా ప్రమాదం జరగడం ఇది మొదటిసారేమీ కాదు. గత నాలుగేళ్లలో ఇది మూడో ప్రమాదమని చెబుతున్నారు. మడ అడవులతోపాటు వాటి విస్తరణలో కీలక పాత్ర పోషించే పీతలు కూడా చమురు తెట్టు ప్రభావంవల్ల నాశనమవు తున్నాయని పర్యావరణవేత్తలు గుండెలు బాదుకుంటున్నారు. అభివృద్ధి, అది తీసుకొచ్చే సౌలభ్యాలు సజావుగా సాగినంతకాలం బాగానే ఉంటాయి. వికటించినప్పుడు దాని పర్యవసానాలు భయంకరంగా పరిణమిస్తాయి. గత నాలుగు దశాబ్దాల్లో పర్యావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల వల్ల పక్షులు, సరీసృపాలు, క్షీరదాలు, ఉభయచరాలు మూడోవంతుకు పడిపోయాయని ఐక్యరాజ్యసమితి చెబుతున్నది. ఇదే తంతు కొనసాగితే అడవులు క్షీణించి జలవనరుల్లో నాచు పెరుగుతుందని ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇలా క్రమేపీ జీవరాశి క్షీణిస్తుంటే వాటి తాలూకు దుష్ర్పభావంనుంచి మనిషి కూడా తప్పించుకోలేడు. నానాటికీ పెరుగుతున్న కర్బన ఉద్గారాలవల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటున్నది. ఇది భూతాపానికి దారితీసి భూకంపాలు, సునామీలు, పెనుతుపానులు వంటివి సంభవిస్తున్నాయి. ఒకపక్క కర్బన ఉద్గారాల తగ్గింపు విషయంలో అంగీకారానికి రాలేక దేశాలన్నీ సతమత మవుతుంటే ఇలాంటి చమురు తెట్టు ఉదంతాలు పర్యావరణాన్ని మరింత కుంగదీస్తున్నాయి. నాలుగేళ్లక్రితం మెక్సికన్ జలసంధిలో చమురు వెలికితీతలో ప్రమాదం సంభవించి లక్షల లీటర్ల చమురు లీకై లెక్కకందని స్థాయిలో అరుదైన జీవరాశికి ముప్పు కలిగింది. ప్రమాదాలు చెప్పి రావు. కనుక సుందర్బన్స్ ప్రాంతంలో నౌకాయానం తీరుతెన్నులపై పటిష్ట నిఘా ఉండాలి. ప్రపంచంలోనే దట్టమైన, విస్తారమైన మడ అడవులున్న ప్రాంతంగా సుందర్బన్స్ను కంటికి రెప్పలా రక్షించుకోవాలి. అలాగే చమురు తెట్టును అరికట్టే వివిధ సాంకేతికతలను బడుగుదేశాలకు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత అభివృద్ధి చెందిన దేశాలపై ఉన్నది. సుందర్బన్స్వంటి ప్రాంతాలు భౌగోళికంగా ఎవరి పరిధిలో ఉన్నప్పటికీ అవి ప్రపంచ ప్రజానీకానికంతకూ చెందినవి. జీవరాశి మనుగడతో ముడిపడి ఉండే ఇలాంటి అపురూప సంపద పరిరక్షణ మానవాళి ఉమ్మడి బాధ్యతని గుర్తుంచుకోవాలి.