
పూర్వం జంభాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు బ్రహ్మ కోసం తపస్సు చేసి, అనేక దివ్యవరాలు పొందాడు. అంతటితో సంతృప్తి చెందక శివుడి కోసం తపస్సు చేశాడు. తపస్సుతో శివుడిని మెప్పించి, వరాలుగా అనేక దివ్యాయుధాలను పొందాడు. ఇన్ని వరాలు పొందిన తాను త్రిలోకాధిపత్యం సాధించాలని తలచాడు. తలచినదే తడవుగా పెద్దసంఖ్యలో రాక్షస సైన్యాన్ని సమకూర్చుకుని; స్వర్గ, మర్త్య, పాతాళ లోకాల మీదకు దండయాత్రకు బయలుదేరాడు.
మర్త్య పాతాళ లోకాలు జంభాసురుడికి తేలికగానే వశమైపోయాయి. స్వర్గంపై దండెత్తిన జంభాసురుడి రాక్షస సైన్యానికి, దేవ సైన్యానికి భీకర యుద్ధం జరిగింది. జంభాసురుడి ధాటికి తట్టుకోలేక దేవతలు చివరకు ఓటమిని అంగీకరించి, స్వర్గాన్ని విడిచిపెట్టి పారిపోయారు. స్వర్గం నుంచి పారిపోయిన దేవతలు భూలోకంలోని ఒక పర్వతారణ్య ప్రాంతానికి చేరుకున్నారు.
అది వాలఖిల్యాది మహర్షుల తపోభూమి. దేవగురువు బృహస్పతి కూడా అక్కడకు చేరుకున్నాడు. బృహస్పతి ఆధ్వర్యంలో దేవతలంతా మహర్షుల వద్దకు వెళ్లి, వారికి తమ గోడు చెప్పుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీమహావిష్ణువును ఆశ్రయించడం తప్ప వేరే దిక్కులేదని వాలఖిల్యాది మహర్షులు దేవతలకు చెప్పారు. శ్రీమహావిష్ణువు భూలోకంలో దత్తాత్రేయుడిగా అవతరించి, సహ్యాద్రి ప్రాంతంలో విహరిస్తున్నాడని తెలిపారు. అతడు మదవతీ మద్యలోలుడిగా, నింద్యాచారుడిగా కనిపిస్తాడని; అతడిని సేవిస్తూ కనిపించే మదవతి సాక్షాత్తు లక్ష్మీదేవి అని, అతడిని ప్రసన్నం చేసుకోవడం చాలా కష్టమని, గత్యంతరం లేదు కనుక అతడిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించక తప్పదని మహర్షులు చెప్పారు.
మహర్షుల మాటలతో ఇంద్రాది దేవతలు బృహస్పతిని ముందు నిలిపి, సహ్యాద్రి ప్రాంతానికి వెళ్లారు. కొంత వెదుకులాట తర్వాత దత్తాశ్రమాన్ని కనుగొన్నారు. ఆశ్రమం లోపల ఉన్న గది మధ్యభాగంలో విశాలమైన తల్పంపై మానినుల ఒడిలో విశ్రాంతిగా సేదదీరుతూ, ఒక భామిని ముందుగా తాను రుచి చూసి, చషకంలో నింపి అందిస్తున్న రకరకాల మధువులను అదేపనిగా తాగుతూ దత్తాత్రేయుడు కనిపించాడు. ఆశ్రమంలోని దృశ్యానికి దేవతలందరూ చకితులయ్యారు. వారు ఒకరికొకరు సైగలు చేస్తూ ఆశ్రమంలో ఎవరికి వారే సర్దుకున్నారు. దత్తాత్రేయుడికి, ఆయన ఆశ్రమ వాసులకు సేవలు చేయడం మొదలుపెట్టారు. ఇంద్రుడు స్వయంగా దత్తాత్రేయుడికి ఆంతరంగిక సేవకుడయ్యాడు. కొన్నాళ్లు గడిచాక దత్తాత్రేయుడు తనకు ఆంతరంగికంగా మెలగుతూ, అన్ని సేవలూ చేస్తున్న ఇంద్రుడిని పిలిచి, ‘ఎవరు మీరంతా? ఆశ్రమంలోకి వచ్చి, ఏమీ అడగకుండా మా అందరికీ ఎందుకు సేవలు చేస్తున్నారు?’ అని అడిగాడు.
దత్తాత్రేయుడు అన్నిరోజుల తర్వాత నోరుతెరిచి ప్రశ్నలు అడగటంతో ఇంద్రుడు అతడి పాదాల ముందు సాష్టాంగపడ్డాడు. తర్వాత లేచి, వినయంగా వంగి నిలబడి, ‘దత్తయోగీంద్రా! ఏమీ తెలియనట్లు నువ్విలా అడగడం విడ్డూరంగా ఉంది. నేను ఇంద్రుడిని. నాతో వచ్చిన మిగిలిన వారంతా దేవతలు. జంభాసురుడు దండెత్తి స్వర్గాన్ని ఆక్రమించుకోవడంతో దిక్కుతోచక ఇక్కడకు వచ్చాం. నీ అనుగ్రహం కోసం ఎదురుచూస్తూ కాలం గడుపుతున్నాం’ అని బదులిచ్చాడు ఇంద్రుడు.‘ఏమిటీ? నువ్వు దేవేంద్రుడివా? వీరంతా దేవతలా? అష్టదిక్పాలకులతో సేవలు పొందే నీ సేవలు నేను పొందడమా? అపచారం.. అపచారం. నేను నీ సేవలు పొందడం గాని, మా ఆశ్రమవాసులు దేవతల సేవలు పొందడం గాని తగనిపని.
ఈ క్షణం నుంచి మీరందరూ మీ సేవలను విరమించుకోండి. మీకే మేమంతా సేవలు చేసి, తరిస్తాం. ఇక జంభాసురుడు ఆక్రమించుకున్న స్వర్గాన్ని తిరిగి నువ్వు పొందడానికి సహకరించమంటావా? తప్పకుండా! నేను ఆచారభ్రష్టుడినైన మామూలు తపస్విని. మా ఆశ్రమవాసులను చూశావు కదా, మేమెంతటి వీరులమో నీకు అర్థమయ్యే ఉంటుంది. రణరంగానికి రాలేము గాని, శిబిరాల్లో ఉంటూ, క్షతగాత్రులకు సేవలు చేయడం ద్వారా సహకరించగలం’ అని పలికాడు దత్తాత్రేయుడు.‘దత్తయోగీంద్రా! కాపాడవలసిన నాథుడే మాతో పరాచికాలడటం తగునా? నువ్వు అనుగ్రహించకుంటే, సేవలు చేసుకుంటూ ఇదే ఆశ్రమంలో ఉండిపోతాం’ అన్నాడు ఇంద్రుడు.
‘దేవేంద్రా! అపార్థం చేసుకున్నావు. నా దినచర్య కళ్లారా చూశావుగా, ఇంద్రియాలనే జయించలేని నేను ఇంద్రుడికి సహకరించడమా, విడ్డూరం! మీకు ఏ సేవలు అందించాలో ఆజ్ఞాపించండి. తప్పకుండా ఆ సేవలు అందిస్తాం’ అన్నాడు దత్తాత్రేయుడు.‘స్వామీ! నీ పరీక్షలను తట్టుకోలేం. నువ్వు జగన్నాథుడివైన శ్రీమన్నారాయణుడివని నాకు తెలుసు. నీకు అనుదినం చషకంతో మధువును అందించే భామిని సాక్షాత్తు లక్ష్మీదేవి అని కూడా తెలుసు. నీ ఆశ్రమ బృందం, మధుసేవ, మానినీ వినోదం అంతా మాయ అని తెలుసు. మా అపరాధాలకు ఇదే విరుగుడు’ అంటూ ఇంద్రుడు దత్తాత్రేయుడి పాదాల వద్ద మోకరిల్లి, పాదాలను పట్టుకున్నాడు.
దత్తాత్రేయుడు పకపక నవ్వి, ‘నీ స్వర్గాన్ని నీకు తిరిగి ఇప్పిస్తాను. జంభాది రాక్షసులను నాకు కనిపించేలా చేయి. మిగిలిన సంగతి నేను చూసుకుంటాను’ అని అభయమిచ్చి పంపాడు.
దత్తత్రేయుడి ఆశీస్సులతో ఇంద్రుడు దేవతలతో బయలుదేరి, జంభాసురుడిపై యుద్ధాన్ని ప్రకటించాడు. దేవతలకు, రాక్షసులకు భీకర సంగ్రామం జరిగింది. యుద్ధంలో దేవతలు పారిపోతున్నట్లు నటించి, రాక్షసులను దత్తాశ్రమం వరకు తీసుకొచ్చారు. ఆశ్రమంలో సౌందర్యరాశిలా కనిపించిన లక్ష్మీదేవిని చూసి, రాక్షసుల మతులు పోయాయి. వారు ఆమెను తమ నాయకుడైన జంభాసురుడికి సమర్పిస్తే, సంతోషిస్తాడని తలచారు. తమ మాయతో బంగారు పల్లకిని సృష్టించి, అందులో కూర్చోమని లక్ష్మీదేవిని గద్దించారు. ఆమె దత్తాత్రేయుని వైపు చూసింది. కూర్చోమన్నట్లుగా సైగ చేశాడు. ఆమె నెమ్మదిగా వచ్చి, పల్లకిలో కూర్చుంది. అంతటి సౌందర్యరాశి కూర్చున్న పల్లకిని భుజాల మీద మోయడం కంటే తల మీద మోయడం బాగుంటుందనుకుని, రాక్షసులు ఆమె కూర్చున్న పల్లకిని నెత్తికెత్తుకుని మోసుకుపోయారు.
అప్పుడు దత్తాత్రేయుడు, ‘దేవతలారా! మీ కోరిక నెరవేరింది. లక్ష్మీదేవి వారి నెత్తికెక్కింది. అంటే, వారికి సర్వనాశనం తప్పదు’ అన్నాడు. ఆ మాటలతో దేవతలు రెట్టించిన ఉత్సాహంతో చేతికందిన ఆయుధాలను పట్టుకుని, రాక్షసుల వెంట పడ్డారు. అప్పటి వరకు విజృంభించిన రాక్షసులు ఒక్కసారిగా నీరసించి, యుద్ధరంగంలో పిట్టల్లా రాలిపోయారు. చివరకు జంభాసురుడు ఇంద్రుడి వజ్రాయుధానికి బలయ్యాడు. స్వర్గం తిరిగి దేవతల వశమైంది.
∙సాంఖ్యాయన