
అర్భకులా? ::: దుర్బలులా? ::: కౌబాయ్‌లా? కాసనోవాలా?
వేమన చెప్పినట్లు, ‘పురుషులందు పుణ్య పురుషులు వేరు’ కావచ్చు. అయితే ఆ పుణ్య పురుషులు కూడా – ఈ భూమి మీద ఉండే మొత్తం 6 వర్గాల పురుషులలో ఏదో ఒక వర్గం కిందికి రావలసిందేనని స్విట్జర్లండ్‌లోని ఐడీఆర్ ల్యాబ్స్ శాస్త్రవేత్తలు తాజాగా చేసిన వర్గీకరణను బట్టి తెలుస్తోంది. యావత్ పురుషజాతిని వారు ఒక ‘షడ్భుజిలో’ సర్దేశారు. ఆల్ఫా, సిగ్మా, బ్రావో, ఒమేగా, డెల్టా, గామా అనే ఆరు రకాలుగా పురుషులను విభజించారు. మీరు ఏ కేటగిరీలోకి వస్తారో చూసుకోండి అని అంటూ చిన్న పరీక్షను కూడా రూపొందించారు.
1 ఆల్ఫా మేల్
ఇంటర్నెట్ సంస్కృతి వచ్చాక పురుషుల వ్యక్తిత్వాలను, వారి స్వరూపాలను ఒక ఆధిక్య శ్రేణి సోపానంగా అమర్చి; పురాణ పుంగవుల అన్వయింపుతో కేటగిరీలుగా విభజించి చూపడం సాధారణమైపోయింది. ఈ క్రమంలోనే ఐడీఆర్ ల్యాబ్స్ యావత్ పురుష లోకాన్ని ఆరు రకాలుగా విభజించింది. అందులో ఎవరు ఏ విభజన కిందికి వస్తారో తెలుసుకునేందుకు ‘పురుష సామాజిక సోపాన క్రమ పరీక్ష’ను రూపొందించింది. అందులో 31 ప్రశ్నలు ఉంటాయి. వాటికి సమాధానంగా ‘యెస్’ లేదా ‘నో’ అని ఐదు పాయింట్‌ల స్కేల్‌లో స్పందించమని ఆ పరీక్షా పత్రంలో ఉంటుంది. ఉదా: ఎన్ని అప్పులున్నా నేను ఆందోళ చెందను/ నా కింద ఉన్న పనివారి నుండి నేను పనిని పిండుకుంటాను/ నేను అంత తేలిగ్గా భయపడను/ ... ఇలాంటి స్టేట్‌మెంట్‌లు ఉంటాయి. చివర మీకు వచ్చిన స్కోర్ ఆధారంగా మీరు ఏ కేటగిరీ పురుషులో తెలుస్తుంది.
ఆల్ఫా మగవారిని పురుష సామాజిక సోపానక్రమంలో పైభాగాన ఉండేవారిగా వర్ణించారు. ఆల్ఫా పురుషులు ఆకర్షణీయమైనవారు. త్వరగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సవాళ్లను స్వీకరించటానికి ఇష్టపడతారు. మహిళల మనసు దోచుకుంటారు. తక్కిన కేటగిరీలలోని పురుషులంతా ఆల్ఫా పురుషులను అనుసరించాలని కోరుకుంటారు. సినిమాలు, టీవీలలో ఆల్ఫా మగవారిని తరచుగా ఇతరులపై ఆధిపత్యం చలాయించే వారిగా, ఎవరికి ఏం చేయాలో చెప్పటంలో ఆనందం పొందేవారిగా చిత్రీకరించినప్పటికీ వాస్తవానికి అలా ఉండరని ఐడీఆర్ ల్యాబ్స్ నిపుణులు అంటున్నారు. నిజానికి ఆల్ఫా మగవాడిగా ఉండటం అంటే మాటలు కాదు, ఆటలూ కాదు. సోపానక్రమంలో తమ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి; ఇతరులు తమ మార్గదర్శకత్వం కోసం, దిశానిర్దేశం కోసం చూస్తున్నప్పుడు ఆల్ఫాలు అపారమైన బాధ్యతలు, భారాలతో పోరాడవలసి ఉంటుంది. మరోవైపు ఆల్ఫాలు నాయకుడిగా తమ స్థానానికి మద్దతు ఇచ్చే వారి పట్ల చాలా స్నేహపూర్వకంగా, ఉదారంగా ఉంటారు.
2 సిగ్మా మేల్
పురుష సామాజిక సోపానక్రమంలో అసలు వీళ్లు ఉండనే ఉండరు. వీరు పిరికి వాళ్లు. సమాజ నియమాలకు జడుస్తారు. సొంత మార్గాన్ని అనుసరిస్తారు. ఆల్ఫాలు, బ్రావోలు వీళ్లను పట్టించుకోరు. అయితే, మహిళల విషయంలో సిగ్మాలు విజయవంతం అవుతారు. స్త్రీలు తరచుగా సిగ్మాల స్వీయ–నిర్ణయ తత్త్వాన్ని, నిర్లిప్తతను ఆకర్షణీయంగా భావిస్తారు. కాబట్టి సిగ్మాలు మహిళలకు దగ్గరవుతారు. ఆశ్చర్యకరంగా, సిగ్మాలను ఇంటర్నెట్ సంస్కృతి శృంగార పురుషులుగా పరిగణిస్తుంది. ఒక సిగ్మా విజయవంతం అయినప్పుడు, అతని జీవనశైలి ఆదర్శనీయం, ఆకర్షణీయం అవుతుంది.
3 బ్రావో మేల్
బ్రావో మగవారు ‘లెఫ్టినెంట్లు’. అగ్రస్థానానికి దగ్గరగా ఉంటారు. ఇంచుమించు ఆల్ఫా మగవారిలా ఉంటారు. విశ్వసనీయ సలహాదారులుగా వ్యవహరిస్తారు. ఆల్ఫాకు నమ్మకమైన సిబ్బందిగా ఉంటారు. మహిళలు వారిని ఇష్టపడతారు. ఆల్ఫా భరించాల్సిన తీవ్రమైన బాధ్యతల భారాలను తప్పించుకుంటూ, ఆల్ఫా ర్యాంకు సదుపాయాలను అనుభవిస్తారు. ఆల్ఫాల మాదిరిగా తమ స్థానం కోసం నిరంతరం పోరాడాల్సిన అవసరం ఉండదు కనుక బ్రావోలు ప్రజలతో కొంచెం స్నేహపూర్వకంగా ఉండగలరు.
4 ఒమేగా మేల్
పురుష సామాజిక సోపానక్రమంలో దిగువ నుంచి ఒక మెట్టు పైన ఒమేగా పురుషుడు ఉంటాడు. ఆల్ఫా పురుషుడికి ఒమేగా మేల్ పూర్తి వ్యతిరేకం. తరచు వీరు సామాజిక బహిష్కృతులుగా కనిపిస్తారు. సామాజిక నైపుణ్యాలు ఉండవు. అంతర్ముఖులుగా ఉంటారు, ఆత్మవిశ్వాసం ఉండదు. కొంతమంది వీరిని మేధావులు అనుకుంటారు. మరికొంతమంది పనికిమాలిన వాళ్లు అని భావిస్తారు. ఒంటరితనానికి భయపడి ఇతరులకు అతుక్కుపోతారు. వీళ్లనసలు స్త్రీలు చూడను కూడా చూడరు.
5 డెల్టా మేల్
డెల్టా మగవారిని పురుష సామాజిక సోపానక్రమంలో ‘కార్మికులు’గా వర్గీకరించారు ఐడీఆర్‌ల్యాబ్స్ నిపుణులు. వీరు సాధారణ వ్యక్తులు. ఆధిపత్యం కోసం పోరాడరు. ‘పనిని పూర్తి చేశాం’ అని గర్వంగా చెప్పుకుంటారు. నిజాయితీగా, సూటిగా ఉంటారు. ఇతరులలో నిజాయితీని, మర్యాదను ఆశిస్తారు కాబట్టి డెల్టాలు కొన్నిసార్లు మోసానికి, దగాకు గురవుతారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా ప్రేయసి డెల్టాలను ఇష్టపడటం వల్ల కాకుండా సహాయాల కోసం సహవాసం చేస్తారు. వీరి ఔదార్యాన్ని వారు ఉపయోగించుకుంటారు.
6 గామా మేల్
గామా మగవారు పురుష సామాజిక సోపానక్రమంలో ‘మేధావులు’. ఈ రకం పురుషులు పుస్తక జ్ఞానం కలిగి ఉంటారు, కాని ఆధిపత్యాన్ని నెలకొల్పటానికి అవసరమైన సామాజిక నైపుణ్యాలు, డబ్బు ఉండవు. వారి చూపులు ఆకర్షణీయంగా ఉండవు. వారిలో మానసిక దృఢత్వం కనిపించదు. తెలివి వారి బలం కాబట్టి, గామాలు తరచుగా జీవితంలోని మేధాపరమైన విషయాల గురించి మాట్లాడతారు. గామాలకు, మేధాపరంగా తక్కువ స్థాయి వారు పైకి ఎదగడం అన్యాయంగా కనిపిస్తుంది. చాలామంది గామా మగవారు తమను తాము రహస్య చక్రవర్తులుగా భావించుకుంటారు. కాని, దేనికీ బాధ్యత వహించరు. ఎప్పుడూ అసంతృప్తిగా ఉంటారు. ఆ నిరాశే వారిని మహిళలకు దూరం చేస్తుంది.