కూరగాయలు కొత్త రంగుల్లో! | Sakshi Sagubadi: Breeding for Colour Development in Vegetable Crops | Sakshi
Sakshi News home page

Sagubadi: కూరగాయలు కొత్త రంగుల్లో!

May 20 2025 1:04 AM | Updated on May 20 2025 3:28 PM

Sakshi Sagubadi: Breeding for Colour Development in Vegetable Crops

‘కలర్‌ బ్రీడింగ్‌’తో రంగు రంగుల కూరగాయ వంగడాల అభివృద్ధి

సంప్రదాయ బ్రీడింగ్‌ పద్ధతులకు తోడైన జన్యుసవరణ

పలు రంగుల్లో క్యాలీ ఫ్లవర్, బ్రకోలి, క్యారెట్, టొమాటో తదితర కూరగాయలు

మన కూరగాయలు సంప్రదాయేతర రంగుల్లోకి రూపొంతరం చెందుతున్నాయి. క్యాలీ ఫ్లవర్‌ తెల్లగానే ఉండాలనేం లేదు.. వేరే రంగులో కనిపిస్తే ఆశ్చర్యపోకండి. త్వరలోనే పసుపు, ఊదా, ఆకుపచ్చ రంగుల్లోనూ క్యాలీ ఫ్లవర్‌ మార్కెట్‌లో కనిపించవచ్చు.  అలాగే, బ్రకోలి ఆకుపచ్చగానే ఉండాలనేం లేదు.. పసుపు పచ్చగానూ ఉండొచ్చు. క్యారట్‌ ఎర్రగానే ఉండాలనేం లేదు..  ముల్లంగి, బంగాళదుంప, బీన్స్‌ ఇవన్నీ ఊదా రంగులోనూ రానున్నాయి.  ఇంతకీ రంగుల కూరగాయలు మనకు మంచివేనా?  రంగుతో పాటు పోషకాల్లోనూ ఏమైనా ప్రత్యేకత ఉందా?  ఈ వంగడాలను రూపొందిస్తున్న పద్ధతులేమిటి? పర్యవసానాలేమిటి..?

కూరగాయలు మనిషి తీసుకునే ΄పౌష్టికాహారంలో కీలక పాత్రను పోషిస్తున్నాయి. అవశ్యమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్ల కోసం కూరగాయలపైనే ఆధారపడుతున్నాం. వైవిధ్యభరితమైన రంగుల్లో కూరగాయలను రూపొందించటం (కలర్‌ బ్రీడింగ్‌) వ్యవసాయంలో దూసుకొస్తున్న సరికొత్త ధోరణుల్లో ఒకటి. కొత్త రంగుల్లో కనిపించే కూరగాయల్లో అదనపు పోషకాలు ఉండటం, వాణిజ్యపరమైన గిరాకీ ఉండటం వల్ల శాస్త్రవేత్తలు ‘కలర్‌ బ్రీడింగ్‌’పై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అనాదిగా మనకు తెలిసిన రంగులోనే కాదు ఇతర రంగుల్లోనూ కూరగాయలు మార్కెట్‌లోకి వస్తున్నాయి. చూపులకు ఆకర్షణీయంగా కనిపించడటం కోసం మాత్రమే కాదు ప్రత్యేక పోషకాల కోసం కూడా రంగుల కూరగాయ వంగడాలు రూపుదిద్దుకుంటున్నాయి.

→ అటవీ జాతులే ఆధారం
కొత్త వంగడాల రూపుకల్పనలో మన కూరగాయలకు సంబంధించిన అటవీ జాతుల పాత్రే అధికం. సాధారణ వంగడాల్లో లోపించే ఆంథోశ్యానిన్లు, కరొటెనాయిడ్లు, బెటాలైన్స్‌ అటవీ జాతుల్లో ఉంటాయి. అందుకే వాటితో సంప్రదాయ, ఆధునిక పద్ధతుల్లో సంకరపరచి రంగు రంగుల వంగడాలు రూపొందిస్తున్నారు. అధిక బీటా కరొటెన్‌ లేదా ఆంథోశ్యానిన్‌ కలిగిన నారింజ, ఊదా, తెలుపు, పసుపు, ఎరుపు రంగుల్లో క్యారట్‌ వంగడాలను రూపొందించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా, టొమాటోలో కూడా ఎరుపు, పసుపు, నారింజ, ఆకుపచ్చ, నలుపు, రెండు రంగులు కలిసిన రూపంలో లైకోపెన్‌ వంటి యాంటీఆక్సిడెంట్‌తో కూడిన కొత్త వంగడాలను రూపొందించడానికి వీలుందన్ని నిపుణులు చెబుతున్నారు. 

క్యాప్సికం (కూరమిరప)లో కూడా ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నారింజ, ఊదా రంగుల్లో విటమిన్‌ సి కలిగి ఉండేలా కొత్త వంగడాలు రూపొందుతున్నాయి. బీట్‌రూట్‌లు సహజంగానే ఎరుపు, పసుపు లేదా తెలుపు రంగుల్లో ఉన్నాయి. డైటరీ ఫైబర్, బెటాలైన్స్‌ ఎక్కువ బీట్‌రూట్లలో ఉంటాయి. నారింజ, ఊదా, ఆకుపచ్చ రంగుల్లో క్యాలీఫ్లవర్‌ వంగడాలను రూపొందిస్తున్నారు. వీటిలో విటమిన్‌ సి, గ్లుకోసినొలేట్లు పుష్కలంగా ఉంటాయి. ΄పౌష్టికాహారం, ఆకర్షణీయంగా ఉండే ఈ రకాల కూరగాయల్లో రంగురంగుల వంగడాల అభివృద్ధికి అవకాశాలున్నాయి.

→ జన్యుసవరణ కూడా..
కూరగాయల రంగును మార్చడానికి అనేక ప్రజనన (బ్రీడింగ్‌) పద్ధతులను ఉపయోగిస్తారు. సాంప్రదాయ పద్ధతిలో స్థానిక లేదా అడవి జాతుల నుంచి రంగురంగుల వైవిధ్యాలను ఎంచుకుని, వాటిని ఇతర రకాలతో సంకరం చేస్తారు. రేడియేషన్‌ పద్ధతిలో ఉత్పరివర్తన ప్రేరేపిత జన్యు మార్పుల ద్వారా కొత్త రంగుల వంగడాలను రూపొందిస్తారు. బంగారు రంగు క్యాలీఫ్లవర్‌ ఇలాంటిదే. వర్ణద్రవ్యం సంబంధిత లక్షణాలను మరింత సమర్థవంతంగా గుర్తించి, కొత్త రకాలను అభివృద్ధి చేయటంలో అత్యాధునిక మార్కర్‌–అసిస్టెడ్‌ సెలక్షన్‌ వంటి పద్ధతులు బ్రీడర్లకు తోడ్పడుతున్నాయి. 

క్రిస్పర్‌ కాస్‌9 వంటి జన్యు సవరణ బయోటెక్నాలజీ విధానాలు వర్ణద్రవ్య జన్యువుల ఖచ్చితమైన సవరణకు దోహదం చేస్తాయని చెబుతున్నారు. అయితే జన్యుమార్పిడి పద్ధతులు ఇతర జాతుల నుంచి రంగును, జన్యువులను కూడా తెచ్చిపెట్టుకునే వీలుకల్పిస్తాయి. అతి ఎరుపు గుజ్జు కలిగి ఉండేలా పుచ్చకాయ వంగడాన్ని రూపొందించటంలో ఈ పద్ధతిని పాటించారు.  

→ ఆదరణ ఉంటుందా?
కలర్‌ బ్రీడింగ్‌లో కొత్త వంగడాలు రూపొందించటం మన దేశంలో ఆంథోశ్యానిన్లతో కూడిన ఊదారంగు క్యారట్‌ వంగడంతోప్రారంభమైంది. పోషకాలు అధికంగా ఉండే ఈ రకానికి మార్కెట్‌లో మంచి ఆదరణ లభిస్తోందని చెబుతున్నారు. ఆంథోశ్యానిన్లు అధికంగా ఉండే నల్ల టొమాటోలు, బీటా కరొటెన్‌తో కూడిన నారింజ రంగు క్యాలీఫ్లవర్‌ యూరప్‌లోప్రాచుర్యం పొందాయి. 

అయితే, కొత్త రంగుల కూరగాయలను, జన్యుసవరణ కూరగాయలను సంప్రదాయక మార్కెట్లలో వినియోగదారులు ఎంత వరకు ఇష్టపడతారనే సందేహాలున్నాయి. రంగులప్రాధాన్యంప్రాంతానికో విధంగా ఉంటుంది. సాంస్కృతిక, సంప్రదాయ సంబంధమైన పట్టింపులు ఉంటాయి. కాబట్టి రైతులు ఈ రకాలను సాగు చేసే ముందు ఆలోచించుకోవాలి. 

రంగును బట్టి పోషకాలు!
కూరగాయలు ఆయా రంగుల్లో ఉండటానికి మూల కారణం వాటిల్లోని ప్రత్యేక బయోయాక్టివ్‌ కాంపౌండ్లే. ఆంథోశ్యానిన్లు, కరొటెనాయిడ్లు, క్లోరోఫిల్, బెటాలైన్స్‌ వంటి బయోయాక్టివ్‌ మూలకాలలో.. ఏ మూలకం ఉంటే ఆ కూరగాయకు ఆ రంగు వస్తుంది. 

→ కూరగాయ వేరే రంగులో ఉంటే చూడముచ్చటగా ఉండటంతో పాటు దానిలో పోషకాల వల్ల ప్రత్యేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరతాయని నిపుణులు చెబుతున్నారు. 
→ ఆంథోశ్యానిన్ల వల్ల ఊదా, ఎరుపు రంగులు వస్తాయి. ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ను తగ్గించటంతో పాటు గుండెజబ్బుల ముప్పును తగ్గిస్తాయి. 
→ కరొటెనాయిడ్ల వల్ల పసుపు, నారింజ రంగులు వస్తాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. 
→ క్లోరోఫిల్‌ వల్ల ఆకుపచ్చని రంగు వస్తుంది. శరీరంలో నుంచి మలినాలను బయటకు పంపటానికి, పొట్ట సూక్ష్మజీవుల ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఇది ఉపకరిస్తుంది. 
→ ఎరుపు, పసుపు రంగు కూరగాయల్లో ఉండే బెటాలైన్స్‌ శరీరంలో వాపును తగ్గిస్తాయి.

కలర్‌ బ్రీడింగ్‌తో ΄పౌష్టికాహార భద్రతఅధిక పోషకాలున్న రంగు రంగుల కూరగాయలపై దేశవ్యాప్తంగా ప్రచారం కల్పిస్తే ΄పౌష్టికాహార భద్రతకు దోహదమవుతుంది. సంప్రదాయ బ్రీడింగ్‌ పద్ధతులతో ఎం.ఎ.ఎస్, క్రిస్పర్‌ కాస్‌ 9 జన్యుసవరణ వంటి ఆధునిక పద్ధతులను మిళితం చేస్తే మెరుగైన ఫలితాలు పొందే అవకాశాలున్నాయి. జెనిటిక్స్, బ్రీడింగ్‌ రంగంలో శాస్త్రవేత్తలు, విద్యార్థులకు కలర్‌ బ్రీడింగ్‌ మంచి అవకాశాలను కల్పిస్తుంది.

– డాక్టర్‌ రామన్‌ సెల్వకుమార్, సెంటర్‌ ఫర్‌ప్రొటెక్టెడ్‌ కల్టివేషన్‌ టెక్నాలజీ 
భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐఎఆర్‌ఐ), పూసా, న్యూఢిల్లీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement