new variety seeds
-
కూరగాయలు కొత్త రంగుల్లో!
మన కూరగాయలు సంప్రదాయేతర రంగుల్లోకి రూపొంతరం చెందుతున్నాయి. క్యాలీ ఫ్లవర్ తెల్లగానే ఉండాలనేం లేదు.. వేరే రంగులో కనిపిస్తే ఆశ్చర్యపోకండి. త్వరలోనే పసుపు, ఊదా, ఆకుపచ్చ రంగుల్లోనూ క్యాలీ ఫ్లవర్ మార్కెట్లో కనిపించవచ్చు. అలాగే, బ్రకోలి ఆకుపచ్చగానే ఉండాలనేం లేదు.. పసుపు పచ్చగానూ ఉండొచ్చు. క్యారట్ ఎర్రగానే ఉండాలనేం లేదు.. ముల్లంగి, బంగాళదుంప, బీన్స్ ఇవన్నీ ఊదా రంగులోనూ రానున్నాయి. ఇంతకీ రంగుల కూరగాయలు మనకు మంచివేనా? రంగుతో పాటు పోషకాల్లోనూ ఏమైనా ప్రత్యేకత ఉందా? ఈ వంగడాలను రూపొందిస్తున్న పద్ధతులేమిటి? పర్యవసానాలేమిటి..?కూరగాయలు మనిషి తీసుకునే ΄పౌష్టికాహారంలో కీలక పాత్రను పోషిస్తున్నాయి. అవశ్యమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్ల కోసం కూరగాయలపైనే ఆధారపడుతున్నాం. వైవిధ్యభరితమైన రంగుల్లో కూరగాయలను రూపొందించటం (కలర్ బ్రీడింగ్) వ్యవసాయంలో దూసుకొస్తున్న సరికొత్త ధోరణుల్లో ఒకటి. కొత్త రంగుల్లో కనిపించే కూరగాయల్లో అదనపు పోషకాలు ఉండటం, వాణిజ్యపరమైన గిరాకీ ఉండటం వల్ల శాస్త్రవేత్తలు ‘కలర్ బ్రీడింగ్’పై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అనాదిగా మనకు తెలిసిన రంగులోనే కాదు ఇతర రంగుల్లోనూ కూరగాయలు మార్కెట్లోకి వస్తున్నాయి. చూపులకు ఆకర్షణీయంగా కనిపించడటం కోసం మాత్రమే కాదు ప్రత్యేక పోషకాల కోసం కూడా రంగుల కూరగాయ వంగడాలు రూపుదిద్దుకుంటున్నాయి.→ అటవీ జాతులే ఆధారంకొత్త వంగడాల రూపుకల్పనలో మన కూరగాయలకు సంబంధించిన అటవీ జాతుల పాత్రే అధికం. సాధారణ వంగడాల్లో లోపించే ఆంథోశ్యానిన్లు, కరొటెనాయిడ్లు, బెటాలైన్స్ అటవీ జాతుల్లో ఉంటాయి. అందుకే వాటితో సంప్రదాయ, ఆధునిక పద్ధతుల్లో సంకరపరచి రంగు రంగుల వంగడాలు రూపొందిస్తున్నారు. అధిక బీటా కరొటెన్ లేదా ఆంథోశ్యానిన్ కలిగిన నారింజ, ఊదా, తెలుపు, పసుపు, ఎరుపు రంగుల్లో క్యారట్ వంగడాలను రూపొందించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా, టొమాటోలో కూడా ఎరుపు, పసుపు, నారింజ, ఆకుపచ్చ, నలుపు, రెండు రంగులు కలిసిన రూపంలో లైకోపెన్ వంటి యాంటీఆక్సిడెంట్‌తో కూడిన కొత్త వంగడాలను రూపొందించడానికి వీలుందన్ని నిపుణులు చెబుతున్నారు. క్యాప్సికం (కూరమిరప)లో కూడా ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నారింజ, ఊదా రంగుల్లో విటమిన్ సి కలిగి ఉండేలా కొత్త వంగడాలు రూపొందుతున్నాయి. బీట్రూట్లు సహజంగానే ఎరుపు, పసుపు లేదా తెలుపు రంగుల్లో ఉన్నాయి. డైటరీ ఫైబర్, బెటాలైన్స్ ఎక్కువ బీట్రూట్లలో ఉంటాయి. నారింజ, ఊదా, ఆకుపచ్చ రంగుల్లో క్యాలీఫ్లవర్ వంగడాలను రూపొందిస్తున్నారు. వీటిలో విటమిన్ సి, గ్లుకోసినొలేట్లు పుష్కలంగా ఉంటాయి. ΄పౌష్టికాహారం, ఆకర్షణీయంగా ఉండే ఈ రకాల కూరగాయల్లో రంగురంగుల వంగడాల అభివృద్ధికి అవకాశాలున్నాయి.→ జన్యుసవరణ కూడా..కూరగాయల రంగును మార్చడానికి అనేక ప్రజనన (బ్రీడింగ్) పద్ధతులను ఉపయోగిస్తారు. సాంప్రదాయ పద్ధతిలో స్థానిక లేదా అడవి జాతుల నుంచి రంగురంగుల వైవిధ్యాలను ఎంచుకుని, వాటిని ఇతర రకాలతో సంకరం చేస్తారు. రేడియేషన్ పద్ధతిలో ఉత్పరివర్తన ప్రేరేపిత జన్యు మార్పుల ద్వారా కొత్త రంగుల వంగడాలను రూపొందిస్తారు. బంగారు రంగు క్యాలీఫ్లవర్ ఇలాంటిదే. వర్ణద్రవ్యం సంబంధిత లక్షణాలను మరింత సమర్థవంతంగా గుర్తించి, కొత్త రకాలను అభివృద్ధి చేయటంలో అత్యాధునిక మార్కర్–అసిస్టెడ్ సెలక్షన్ వంటి పద్ధతులు బ్రీడర్లకు తోడ్పడుతున్నాయి. క్రిస్పర్ కాస్9 వంటి జన్యు సవరణ బయోటెక్నాలజీ విధానాలు వర్ణద్రవ్య జన్యువుల ఖచ్చితమైన సవరణకు దోహదం చేస్తాయని చెబుతున్నారు. అయితే జన్యుమార్పిడి పద్ధతులు ఇతర జాతుల నుంచి రంగును, జన్యువులను కూడా తెచ్చిపెట్టుకునే వీలుకల్పిస్తాయి. అతి ఎరుపు గుజ్జు కలిగి ఉండేలా పుచ్చకాయ వంగడాన్ని రూపొందించటంలో ఈ పద్ధతిని పాటించారు. → ఆదరణ ఉంటుందా?కలర్ బ్రీడింగ్‌లో కొత్త వంగడాలు రూపొందించటం మన దేశంలో ఆంథోశ్యానిన్లతో కూడిన ఊదారంగు క్యారట్ వంగడంతోప్రారంభమైంది. పోషకాలు అధికంగా ఉండే ఈ రకానికి మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తోందని చెబుతున్నారు. ఆంథోశ్యానిన్లు అధికంగా ఉండే నల్ల టొమాటోలు, బీటా కరొటెన్తో కూడిన నారింజ రంగు క్యాలీఫ్లవర్ యూరప్లోప్రాచుర్యం పొందాయి. అయితే, కొత్త రంగుల కూరగాయలను, జన్యుసవరణ కూరగాయలను సంప్రదాయక మార్కెట్లలో వినియోగదారులు ఎంత వరకు ఇష్టపడతారనే సందేహాలున్నాయి. రంగులప్రాధాన్యంప్రాంతానికో విధంగా ఉంటుంది. సాంస్కృతిక, సంప్రదాయ సంబంధమైన పట్టింపులు ఉంటాయి. కాబట్టి రైతులు ఈ రకాలను సాగు చేసే ముందు ఆలోచించుకోవాలి. రంగును బట్టి పోషకాలు!కూరగాయలు ఆయా రంగుల్లో ఉండటానికి మూల కారణం వాటిల్లోని ప్రత్యేక బయోయాక్టివ్ కాంపౌండ్లే. ఆంథోశ్యానిన్లు, కరొటెనాయిడ్లు, క్లోరోఫిల్, బెటాలైన్స్ వంటి బయోయాక్టివ్ మూలకాలలో.. ఏ మూలకం ఉంటే ఆ కూరగాయకు ఆ రంగు వస్తుంది. → కూరగాయ వేరే రంగులో ఉంటే చూడముచ్చటగా ఉండటంతో పాటు దానిలో పోషకాల వల్ల ప్రత్యేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరతాయని నిపుణులు చెబుతున్నారు. → ఆంథోశ్యానిన్ల వల్ల ఊదా, ఎరుపు రంగులు వస్తాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించటంతో పాటు గుండెజబ్బుల ముప్పును తగ్గిస్తాయి. → కరొటెనాయిడ్ల వల్ల పసుపు, నారింజ రంగులు వస్తాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. → క్లోరోఫిల్ వల్ల ఆకుపచ్చని రంగు వస్తుంది. శరీరంలో నుంచి మలినాలను బయటకు పంపటానికి, పొట్ట సూక్ష్మజీవుల ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఇది ఉపకరిస్తుంది. → ఎరుపు, పసుపు రంగు కూరగాయల్లో ఉండే బెటాలైన్స్ శరీరంలో వాపును తగ్గిస్తాయి.కలర్ బ్రీడింగ్‌తో ΄పౌష్టికాహార భద్రతఅధిక పోషకాలున్న రంగు రంగుల కూరగాయలపై దేశవ్యాప్తంగా ప్రచారం కల్పిస్తే ΄పౌష్టికాహార భద్రతకు దోహదమవుతుంది. సంప్రదాయ బ్రీడింగ్ పద్ధతులతో ఎం.ఎ.ఎస్, క్రిస్పర్ కాస్ 9 జన్యుసవరణ వంటి ఆధునిక పద్ధతులను మిళితం చేస్తే మెరుగైన ఫలితాలు పొందే అవకాశాలున్నాయి. జెనిటిక్స్, బ్రీడింగ్ రంగంలో శాస్త్రవేత్తలు, విద్యార్థులకు కలర్ బ్రీడింగ్ మంచి అవకాశాలను కల్పిస్తుంది.– డాక్టర్ రామన్ సెల్వకుమార్, సెంటర్ ఫర్ప్రొటెక్టెడ్ కల్టివేషన్ టెక్నాలజీ భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐఎఆర్ఐ), పూసా, న్యూఢిల్లీ -
ఇంటర్ ఫెయిలైన రైతు ఆవిష్కరణ.. ఎస్కె–4 పసుపు!
చేసే పని మీద శ్రద్ధాసక్తులు మెండుగా ఉంటే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని నిరూపించే విజయగాథ రైతు శాస్త్రవేత్త సచిన్ కమలాకర్ కారేకర్ది. పన్నెండో తరగతి ఫెయిల్ అయ్యి వ్యవసాయం చేపట్టిన సచిన్ శ్రద్ధగా వ్యవసాయం చేస్తూ అధిక దిగుబడినిచ్చే ఒక చక్కని పసుపు వంగడాన్ని అభివృద్ధి చేశారు. దాని పేరు ‘ఎస్కె–4’. ఈ వంగడం సచిన్‌కు ఉత్తమ ప్లాంట్ బ్రీడర్‌గా, గొప్ప ఆవిష్కర్తగా కీర్తితోపాటు జాతీయ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. ఎస్కె–4 పసుపు రకాన్ని ఇప్పుడు 13 రాష్ట్రాల్లో సాగు చేస్తుండటం విశేషం. తాను పండిస్తున్న పసుపు పంటలో మెరుగైన ఫలితాలనిస్తున్న మొక్కల్ని వేరే చేస్తూ కొన్ని సంవత్సరాల పాటు శ్రద్ధగా కొనసాగించిన ఎంపిక ప్రక్రియ ద్వారా ఈ కొత్త వంగడాన్ని ఆయన రూపొందించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ద్వారా కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖకు చెందిన నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ జాతీయ స్థాయి ద్వితీయ ఆవిష్కర్త పురస్కారాన్ని అందుకున్నారు. ఔషధ విలువలకు పెట్టింది పేరైన పసుపు పంటకు సంబంధించి దేశవ్యాప్తంగా 30 వంగడాలు సాగులో ఉన్నాయి. మహారాష్ట్రలో రైతులు 70% విస్తీర్ణంలో రాజపురి సేలం వెరైటీని సాగు చేస్తుంటారు. ఇది 20 రాష్ట్రాల్లో విస్తారంగా సాగవుతున్నప్పటికీ మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లో ఎక్కువగా సాగవుతోంది. 2022–23లో మన దేశంలో 11.61 లక్షల టన్నుల పసుపు పండింది. పసుపునకు సంబంధించి ప్రపంచంలోనే భారత్ అత్యధిక ఉత్పత్తిదారు, వినియోగదారు, ఎగుమతిదారు కూడా!సచిన్ కమలాకర్ కరేకర్ (48) స్వస్థలం మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా అబ్లోలి అనే గ్రామం. చిప్లన్కు 55 కి.మీ. దూరంలో ఈ ఊరు ఉంది. సచిన్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన తర్వాత 22 ఏళ్ల వయసు నుంచి గత 26 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. 500 వక్క చెట్లు, 50 కొబ్బరి చెట్ల మధ్య పసుపును అంతరపంటగా సాగు చేస్తున్నారు. అధిక దిగుబడినిచ్చే వంగడాలను రూపొందించాలన్న ఆకాంక్ష మొదటి నుంచే ఆయనకు ఉంది. నచ్చిన గుణగణాలున్న మొక్కల్ని ఏటేటా వేరుగా సాగు చేస్తూ కొత్త పసుపు వంగడాన్ని ఆవిష్కరించారు. దీన్నే క్లోనల్ సెలక్షన్ మెథడ్ అంటారు.1998 నుంచి కొత్త వంగడంపై కృషిసచిన్ తన సేద్య ప్రయాణం గురించి ఇలా చెప్పుకొచ్చారు.. ‘1998లో నేను ఒక స్థానిక పసుపు రకాన్ని సాగు చేయటం ప్రాంభించాను. పొలంలో కొన్ని మొక్కల పంట కాలం మిగతా వాటికన్నా ముందుగానే ముగుస్తున్నట్లు గుర్తించాను. ఆ మొక్కలు చాలా ఏపుగానూ పెరిగాయి. అట్లా మెరుగ్గా కనిపించిన మొక్కల దుంపలను వెలికితీసి, విడిగా ఉంచాను. ఆ పసుపు దుంపలు చాలా పెద్దవిగా ఉన్నాయి. ముదురు రంగులో ఆకర్షణీయంగానూ, చీడపీడలను దీటుగా తట్టుకొని బాగా పెరిగాయి. అధిక దిగుబడి కూడా వచ్చింది. అదే విధంగా ఆ మొక్కల్ని ప్రతి ఏటా సాగు చేస్తూ, మెరుగ్గా ఉన్న మొక్కల పసుపు కొమ్ముల్ని నాటి, మళ్లీ వాటిలో నుంచి మంచి వాటిని ఏరి తర్వాత ఏడాది సాగు చేయటం 2007 వరకు కొనసాగించాను. 2008 నాటికి నాకు నచ్చిన (త్వరగా కోతకు రావటం, ఏపుగా చీడపీడలను తట్టుకొని పెరగటం, అధిక దిగుబడి, దుంప రంగు బాగుండటం.. వంటి) మంచి గుణగణాలున్న మెరుగైన కొత్త వంగడం సిద్ధమైంది. దాన్ని ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసి, దానికి ఎస్కె–4 అని పేరు పెట్టాను.’కుక్కుమిన్ 4%పచ్చి పసుపు హెక్టారుకు 55–56 టన్నుల దిగుబడినిచ్చే వంగడం ఇది. చాలా ఆకర్షణీయంగా ముదురు ఎరుపు–పసుపు రంగు. దీని పంటకాలం 160–170 రోజులు. అధిక వర్షపాతం గల ప్రాంతానికి అనువైనది. దుంపకుళ్లు తెగులును, ఆకు మచ్చ తెగులును తట్టుకునే గుణం దీనికి ఉంది. నేషనల్ ఇన్నేవేషన్ ఫౌండేషన్ (ఎన్ఐఎఫ్) ఈ వంగడాన్ని గుర్తించి 2020 ఖరీఫ్‌లో ప్రయోగాత్మకంగా దపోలిలోని డాక్టర్ బాలసాహెబ్ సావంత్ కొంకణ్ కృషి విద్యాపీఠ్ (డిబిఎస్కెకెవి) ఆవరణలో సాగు చేయించింది. హెక్టారుకు పచ్చి పసుపు 56 టన్నుల అధిక దిగుబడి వచ్చింది. 28 రకాల కన్నా ఎస్కె–4 రకం అధిక దిగుబడినిచ్చింది. ఈ పసుపులో కుర్కుమిన్ 4% ఉంది. దీంతో ఈ రకం పసుపు విత్తనాన్ని పరిసర జిల్లాల్లోని రైతులకు సచిన్ ఇవ్వటం ప్రారంభించారు. ఆ రైతులకు కూడా మంచి దిగుబడి వచ్చింది. ఆ విధంగా ఈ రకం పసుపు సాగు 2021 నాటికే ఎస్కె–4 రకం మహారాష్ట్రలో లక్ష ఎకరాలకు విస్తరించింది. దీంతో పొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ యాక్ట్ –2001 కింద ఈ సరికొత్త వంగడానికి సంబంధించి సచిన్‌కు ప్రత్యేక జన్యు హక్కులు ఇవ్వమని కోరుతూ ఎన్ఐఎఫ్ దరఖాస్తు చేసింది.ఎస్కె–4 పేరు ఎందుకొచ్చింది?తన ఆవిష్కరణకు మూలమైన స్థానిక వంగడం సంగ్లి కడప వెరైటీ స్పెషల్ కొంకణ్‌ను ఇచ్చింది షెండ్గే కాక అనే రైతు. అందుకని కొత్త వంగడానికి మొదటి అక్షరం ఆయనది, రెండో అక్షరం తనది కలిపి ఎస్కె–4 అని పేరు పెట్టారు. డిబిఎస్కెకెవికి చెందిన ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ప్రఫుల్ల మలి మాట్లాడుతూ.. మేం ఈ రకాన్ని రెండేళ్లు వరుసగా సాగు చేసి చూశాం. రాజేంద్ర సోనా అనే రకం మాదిరిగా ఇది కూడా అధిక దిగుబడినిచ్చే రకమని రుజువైంది.రాజేంద్ర సోనా హెక్టారుకు 64 టన్నుల దిగుబడినిచ్చేదైనప్పటికీ దాని విత్తనం అందుబాటులో లేదు. అందువల్ల ఎస్కె–4 రకం ప్రత్యామ్నాయంగా అధిక వర్షపాతం నమోదయ్యే కొంకణ్ ్ర΄ాంతానికి ఇది అనువైనదిగా గుర్తించాం. తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాల్లో దీని పనితీరు ఎలా ఉంటుందో ఇంకా పరీక్షించాల్సి ఉంది అన్నారు. సింద్‌దుర్గ్, రాయ్‌గడ్, రత్నగిరి జిల్లాల్లో చాలా మంది రైతులు ఈ రకాన్ని సాగు చేస్తున్నారు. గుహగర్ తాలూకా వేలాంబ్ గ్రామానికి చెందిన విశ్రాం మలి (58) అనే రైతు గత ఏడాది ఈ పంటను సాగు చేయగా ఒక మొక్క కుదురులోని పసుపు 8.15 కిలోల బరువు తూగింది!నర్సరీ పెంచి నాట్లు వేయటం మేలుడాక్టర్ ప్రఫుల్ల మలి ఇంకా ఇలా చెప్పారు.. ఏప్రిల్‌లో నర్సరీ బ్యాగుల్లో పసుపు విత్తనం పెడతాం. జూన్‌లో ఆ మొక్కల్ని పొలంలో నాటుతాం. నాట్లకు ముందు సేంద్రియ ఎరువు వేసి పొలాన్ని దుక్కి చేస్తాం. ఆగస్టులో రెండో దఫా ద్రవ ఎరువును అందిస్తాం. జనవరి ఆఖరు వరకు నీరు ఇస్తుంటాం. ఫిబ్రవరిలో పంట కోత జరుగుతుంది. ప్రతి మొక్కకు సగటున 3.2 కిలోల దుంపలు వస్తాయి. సచిన్ ఈ వంగడాన్ని పదేళ్లుగా రైతులకు ఇస్తున్నారు. దీనితోపాటు దీని యాజమాన్య మెళకువలపై రైతులకు ఆయన తరచూ శిక్షణ ఇస్తున్నారు. పసుపు విత్తనాన్ని నేరుగా పొలంలో నాటే కంటే నర్సరీలో పెంచి నాట్లు వేయటం వల్ల అధిక దిగుబడి వస్తోందని ఇటీవల వరకు గుహాగర్లో వ్యవసాయ విస్తరణాధికారిగా పనిచేసిన గజేంద్ర పానికర్ అంటున్నారు. విత్తనం 500 మందిరైతులకు ఇచ్చానేను కొత్తగా అభివృద్ధి చేసిన ఎస్కె–4 రకం పసుపు విత్తనాన్ని రత్నగిరి, సింధుదుర్గ్, రాయగడ్ జిల్లాలకు చెందిన దాదాపు 500 మంది రైతులకు ఇచ్చాను. కొత్తగా వేసే రైతులు అతిగా ఆశపడి ఈ రకాన్ని మొదటే ఎక్కువ విస్తీర్ణంలో వేయొద్దు. మొదట ఒక గుంట (వెయ్యి చదరపు అడుగులు) లో వేసి చూడండి. తర్వాత పది గుంటలకు పెంచండి. నేనూ అలాగే చేశా. ఇప్పుడు రెండు ఎకరాల్లో సాగు చేస్తున్నా. ఈ ప్రత్యేక పొలాన్ని చూడటానికి సందర్శకులు వస్తుంటారు.- సచిన్ కమలాకర్ కారేకర్, ఎస్కె–4 పసుపు రకం ఆవిష్కర్త, అబ్లోలి, రత్నగిరి జిల్లా, మహారాష్ట్ర.నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ జాతీయ ద్వితీయ పురస్కార గ్రహీత, ఆవిష్కర్తకు ఆరేళ్లపాటు ప్రత్యేక హక్కులు2023లో న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్ఐఎఫ్) నిర్వహించిన ద్వైవార్షిక గ్రామస్థాయి ఆవిష్కరణలు మరియు అసాధారణ సంప్రదాయ విజ్ఞాన పురస్కారాల 11 వ మహాసభలో రైతు శాస్త్రవేత్త సచిన్ కమలాకర్ కారేకర్కు జాతీయ ద్వితీయ పురస్కారం లభించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన పురస్కారం అందుకున్నారు. ఎన్ఐఎఫ్ గతంలో దరఖాస్తు ఆధారంగా.. ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ అథారిటీ (పిపివి అండ్ ఎఫ్ఆర్ఎ) 2024 డిసెంబర్లో సచిన్ అభివృద్ధి చేసిన ఎస్కె–4 వంగడానికి ప్రత్యేక వంగడంగా గుర్తింపునిచ్చింది. సచిన్ కమలాకర్ కరేకర్ను ప్లాంట్ బ్రీడర్’గా గుర్తించి ప్రత్యేక హక్కులను ప్రదానం చేసింది. దీని ప్రకారం ఆరేళ్ల పాటు ఈ వంగడాన్ని పండించి, విత్తనాన్ని అమ్ముకునే ప్రత్యేక హక్కు ఆవిష్కర్త అయిన సచిన్‌కు దఖలుపడింది. నిర్వహణ: పంతంగి రాంబాబు ,సాగుబడి డెస్క్ -
విత్తుకు రెడీ
– నూతన వంగడాల ఆవిష్కరణ – శాస్త్రవేత్తల కృషిని కొనియాడిన ఏడీఆర్ నంద్యాలరూరల్: నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన వంగడాలను ఏడీఆర్ గోపాల్‌రెడ్డి బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన శాస్త్రవేత్తల కషిని కొనియాడారు. ఎన్‌డీఎల్‌ఆర్–7 నంద్యాల సోనా, ఎస్బీజీ49 నంద్యాల గ్రాము దేశ వాలి శనగ రకం, ఎండీ ఎస్‌హెచ్ 1012 ప్రభాత్ పొద్దుతిరుగుడుకు చెందిన నూతన వంగడాలను ఆవిష్కరించారు. ఇటీవలే ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయ పరిధిలో రూపొందించిన ఏడింటిలో నాలుగు అత్యల్ప వర్షపాత మండలాల కోసం రూపొందించబడినవని, వాటిలో మూడు నంద్యాల శాస్త్రవేత్తల సష్టే కావడబం గర్వకారణమన్నారు. – నంద్యాల సోనా.. వరిలో కర్నూలు సోనా(బీపీటీ 5204)కు ప్రత్యామ్నాయంగా నంద్యాల సోనాను రూపొందించారు. గింజ నాణ్యత, పరిమాణం, రుచి, అన్నం నిల్వ సామర్థ్యం తదితర విషయాల్లో కర్నూలు సోనాతో సమానం. ఖరీఫ్‌లో 140రోజులు, రబీలో 135రోజుల్లో కోతకు వస్తుంది. దోమపోటు, ఆకుముడత, అగ్గితెగులను తట్టుకుటుంది. కోత దశలో పైరు పడిపోదు, గింజ రాలదు. ఎకరాకు సగటున 25–35 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఆలస్యంగా నాటుకు అనుకూలం. కర్నూలు సోనా కంటే రూ.100 నుండి రూ.150 వరకు అధిక ధర. 2015–16లో కర్నూలు జిల్లాలో 8వేల ఎకరాలు, కడప జిల్లాలో 1000 , కర్ణాటకలో 3500 ఎకరాలు వ్యవసాయ పరిశోధనా స్థానం పర్యవేక్షణలో సాగులో ఉంది. నంద్యాల గ్రాము–49.. శనగకు సంబంధించి నంద్యాల గ్రాము –49 రకం అధిక దిగుబడిని ఇచ్చే దేశ వాలి వంగడం. ఇది జేజీ–11 రకానికి ప్రత్యామ్నాయం. 90–105 రోజుల వ్యవధిలో 20 నుంచి 25క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. గింజలు మంచి సైజు, నాణ్యత, రంగు కలిగి ఉండటంతో అధిక ధర లభిస్తుంది. ప్రభాత్ –1012.. తక్కువ పంట కాలం, అధిక దిగుబడి, అధిక నూనెశాతం కల్గిన సన్‌ఫ్లవర్ రకం ఇంది. 90–95రోజుల వ్యవధిలో వర్షాధారంగా ఎకరాకు 6 నుంచి 7క్వింటాళ్లు, నీటి పారుదల కింద 8 నుంచి 10క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. బూజు తెగులను తట్టుకుంటుంది. ఇది కేబీఎస్‌హెచ్–44, డీఆర్ ఎస్‌హెచ్–1, ఎస్బీ–275, ఇతర ప్రయివేటు సంకరాలకు మంచి ప్రత్యామ్నాయం. – కె.1535(కదిరి అమరావతి).. వేరుశెనగకు సంబంధించిన ఈ రకం కదిరి ఆరు రకాలకు ప్రత్యామ్నాయం. చీడపీడలు, బెట్టను తట్టుకునే శక్తి అధికం. కాండం కుళ్లు తెగులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సాగుకు అనుకూలం.