Mystery: ‘ఆ వాసన భరించలేక 15 మంది చనిపోయారు! ఇంకొంత మంది..’

Mystery: Mexico 43 Students 2014 Mass Missing Interesting Facts - Sakshi

మెక్సికో నరమేధం

Mystery: ఏదేశంలోనైనా.. అక్రమార్కులకు అధికారపు అండదండలు ఉన్నంతవరకూ అభాగ్యుల జీవితాలన్నీ అపశృతులే. ఉద్యమించే గళాలన్నీ నిస్సహాయపు ఆర్తనాదాలే. ఆ ఊచకోతల తాలూకు రక్తపు ఛాయలన్నీ ఆధారాలుగా భ్రమింపజేసే ఎండమావులే! దానికి ఉదాహరణే మెక్సికో నరమేధం!! అక్కడో మాఫియా గ్యాంగ్‌.. స్థానిక అధికారులతో కలసి 43 మంది విద్యార్థులను సజీవదహనం చేసింది.

ఈ కేసులో అనుమానితులుగా ఉన్న 80 మంది నిందితుల్లో 44 మందికి పైగా పోలీసులే ఉండటం గమనార్హం. ఒక పోలీస్‌ ఉన్నతాధికారి, నగర మేయర్, అతడి భార్యా ఈ కేసులో పాత్రధారులే. ఘటన జరిగి ఏడేళ్లు గడిచినా.. నేటికీ నేరనిర్ధారణ జరగలేదు. శిక్షలు అమలుకాలేదు. తవ్వేకొద్దీ మిస్టరీగా మారిపోయిన ఈ ఘటనలో 43 మంది విద్యార్థులు ఏమయ్యారు? ఒక ఊచకోతపై పోరాటం చేస్తూ వాళ్లూ ఊచకోతకు గురయ్యారా? 

నేటికీ ప్రశ్నలుగానే మిగిలిపోయిన సత్యాలు.
24 సెప్టెంబర్‌ 2014, దక్షిణ మెక్సికోలోని టీచర్‌ ట్రైనింగ్‌ స్కూల్‌కు చెందిన 43 మంది విద్యార్థులు కనిపించకుండా పోయిన రోజది. 1968 నాటి విద్యార్థుల ఊచకోతల వార్షిక నిరసన ప్రదర్శనలో పాల్గొనేందుకు.. 19 ఏళ్ల నుంచి 20 ఏళ్ల మధ్య వయసున్న విద్యార్థులు.. భారీ సంఖ్యలో అయిదు బస్సుల్లో బయలుదేరారు. అయితే కొకులా, ఇగౌలా ప్రాంతానికి చేరుకునేసరికి పోలీసులు రోడ్లకు అడ్డంగా బారీకేడ్లను పెట్టి ఆ బస్సులను అడ్డుకున్నారు.

ఉన్నట్టుండి మొదలైన పోలీసు కాల్పులు, దానివల్ల జరిగిన తొక్కిసలాట కారణంగా అప్పటికే ఆరుగురు విద్యార్థులు చనిపోయారు. చాలామంది గాయపడ్డారు. ఆ ఘర్షణల నుంచి తప్పించుకున్న కొందరు విద్యార్థులు దగ్గర్లోని కొండల వెనక్కి పారిపోయారు. అయితే పోలీసులు దొరికినవారిని దొరికినట్లుగా పట్టుకుని, రెండు బస్సుల్లో ఎక్కించి వేరే ప్రాంతానికి తరలించారనేది నాటి స్థానిక కథనం. ఆ మరునాడు నుంచే 43 మంది విద్యార్థులు కనిపించకుండా పోయారు.

పోలీసులే విద్యార్థుల్ని మాయం చేశారని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు పోరాటం చెయ్యడంతో.. ప్రత్యేక ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. వారు కొందరు పోలీసులతో పాటు స్థానిక మేయర్‌ హోస్‌ లూయీస్‌ అబార్కా, అతడి భార్య మారియాను అదుపులోకి తీసుకుని విచారించారు. కానీ, ఫలితం లేదు. అయితే పోలీసులు ఆ రాత్రి పట్టుకున్న విద్యార్థులను ఓ డ్రగ్‌ మాఫియాకు అప్పగించారనేది అప్పటికే అందిన రహస్య సమాచారం. దాన్ని బలపరచే ఓ మెసేజ్‌.. ఈ కేసుకి కీలక ఆధారంగా మారింది. ఆ డ్రగ్‌ మాఫియా గ్యాంగ్‌లోని ఒక వ్యక్తి.. ఆ మాఫియా నేతకు మొబైల్‌లో పంపిన మెసేజ్‌ ఏంటంటే..

‘వారిని బస్సుల్లోంచి చెత్తను తరలించే లారీల్లో ఎక్కించి డంప్‌యార్డుకు తీసుకెళ్లాం. ఆ వాసన భరించలేక 15 మంది చనిపోయారు. మిగిలిన వారంతా కొన ఊపిరితో ఉన్నారు. అందరినీ లారీలోంచి దింపి, ఓ గుట్టగా వేసి, డీజిల్, పెట్రోల్‌ పోసి నిప్పంటించాం. తెల్లవారేదాకా ఆ దేహాలు దహనమవుతూనే ఉన్నాయి. పూర్తిగా బూడిద అయిన తర్వాత అస్థికలను ఎనిమిది ప్లాస్టిక్‌ బ్యాగుల్లోకి ఎత్తి, కొకులా సమీపంలో ఉన్న ఓ నదిలో పడేశాం. ఇక ఎవరూ గుర్తుపట్టలేరు’ అని!

ఈ మెసేజ్‌.. విచారణాధికారులకు చిక్కింది. దీంతో పోలీసులే ఆ విద్యార్థులను డ్రగ్‌ మాఫియాకు అప్పగించారని, ఆ విద్యార్థుల్లో ఆ మాఫియా గ్రూప్‌కు చెందని ప్రత్యర్థులు ఉన్నారనే అనుమానంతోనే అందరినీ సజీవదహనం చేసుంటారని అంచనాకు వచ్చారు. అనాబెల్‌ హెర్నాండెజ్‌ అనే జర్నలిస్ట్‌ తన ప్రాణాలకు తెగించి పలు కీలక ఆధారాలు సంపాదించింది. ఆ వివరాలతో (మెక్సికోలో నరమేధం) పేరుతో 2016లో ఓ పుస్తకాన్ని విడుదల చేసింది.

అసలు నిజానిజాలు తేల్చేందుకు ఆ మాఫియా గ్యాంగ్‌లో కొందరు వ్యక్తులను రహస్యంగా కలుసుకుంది అనాబెల్‌. ‘విద్యార్థులను మాఫియాకు అప్పగించింది పోలీసులే. దీని వెనుక రాజకీయ ప్రముఖుల హస్తముంది. ఆ రోజు విద్యార్థులు ప్రయాణిస్తున్న అయిదు బస్సుల్లో రెండు బస్సులు మాఫియా స్మగ్లింగ్‌కు ఉపయోగించే బస్సులు కావడమే ఈ దుర్ఘటనకు అసలు కారణం.

ఆ బస్సుల్లో  అప్పటికే మాఫియా రెండు మిలియన్‌ డాలర్ల (రూ.15,33,90,000) విలువ చేసే హెరాయిన్‌ను రహస్యంగా దాచిపెట్టింది. బస్సులు గనుక మెక్సికోకు చేరితే అందులోని మత్తుమందు డ్రగ్‌ కంట్రోల్‌ టీమ్‌కు చిక్కుతుందనే భయంతోనే ఆ మాఫియా డాన్‌.. స్థానిక నాయకులతో, పోలీసులతో అప్పటికప్పుడు మాట్లాడి బస్సులను దారి మళ్లించారు’ అని అనాబెల్‌ తన పుస్తకంలో రాసింది. 

ఆమె కథనం ప్రకారం ఆ రోజు డ్రగ్‌ డీలర్స్‌ నుంచి, మాఫియా డాన్‌ నుంచి.. చాలామంది ప్రముఖులకు ఫోన్‌ కాల్స్‌ వచ్చాయని.. మొదటి ఫోన్‌ కాల్‌ ఇగౌలాలోని 27వ బెటాలియన్‌ కల్నల్‌కు వచ్చిందని పలు ఆధారాలు అందించింది. అయితే పుస్తకం మార్కెట్‌లోకి రాగానే ఆమెకు బెదిరింపు కాల్స్‌ రావడం మొదలయ్యాయి. ఆమెకు సమాచారం ఇచ్చిన మాఫియా వ్యక్తిని కిరాతకంగా హత్య చెశారు. అతడి భార్యను అపహరించారు. ఇదంతా ఓ ఘోరమైన కుట్ర. 

ఇప్పటి వరకూ ఆ 43 మందిలో ముగ్గురు విద్యార్థుల అవశేషాలు మాత్రమే లభిచడం ఈ కేసులో కనిపించిన పురోగతి. 2014లో 19 ఏళ్ల అలెగ్జాండర్‌ మోరా అనే విద్యార్థి అవశేషాలను.. కొకులాలోని డంప్‌యార్డ్‌ దగ్గర ఉన్న ఒక ప్రవాహంలో కనుగొన్నారు. 2020లో క్రిస్టియన్‌ అల్ఫోన్సో రోడ్రిజ్‌(19) అనే విద్యార్థి అవశేషాలు, 2021లో హోసివానీ గురేరో (20) అనే విద్యార్థి  అవశేషాలు లా కార్నిసెరియా లోయలో లభించాయి.

మిగిలిన 40 మంది ఏమయ్యారనేది నేటికీ మిస్టరీనే. విద్యార్థులకు చెందిన పలు నమూనాలు లభించినా ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌లో మ్యాచ్‌ కాకపోవడం కూడా ఓ కుట్రే. మెక్సికోలో డ్రగ్స్‌ మాఫియాదే పెత్తనం. ఇక్కడ ఇలాంటి ఘటనలు కోకొల్లలు. అందులో ఇది కూడా ఒకటి అంటుంటారు కొందరు. కానీ బాధిత కుటుంబాలు మాత్రం నేటికీ పిడికిలి బిగించే నిలబడ్డాయి న్యాయం కోసం.
-సంహిత నిమ్మన 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top