
ఇంద్రజాల కళను స్వయంకృషితో సాధించి, మేజిక్‌స్టార్‌గా గుర్తింపు పొందిన ప్రతిభ ఆయన సొంతం. ఆయనే భీమవరం పట్టణానికి చెందిన దంతులూరి సత్యనారాయణరాజు (బోస్). ఇంద్రజాల ప్రదర్శనలు చేయడమే కాకుండా, ఇంద్రజాల కళకు సంబంధించి పలు పుస్తకాలను కూడా రాశారు. తన ప్రదర్శనలు, పుస్తకాల ద్వారా దేశ విదేశాల్లో ‘మేజిక్ బోస్’గా ప్రసిద్ధి పొందారు. బోస్ కామర్స్‌లో డిగ్రీ, మెకానికల్ ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తి చేశాక, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 27 ఏళ్లు ఉద్యోగం చేసి, మేజిక్ మీద మక్కువతో 2001లో స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేశారు.
తొలినాళ్లలో మేజిక్‌పై ఎలాంటి అవగాహన లేని బోస్, ‘మేజిక్ ఇన్ ఫ్యామిలీ సర్కిల్’ అనే పుస్తకం చదివి, ఈ కళపై ఆకర్షితులయ్యారు. చాలామంది ఇంద్రజాలికులు గురువుల పర్యవేక్షణలో సాధన చేస్తుంటారు. బోస్ మాత్రం తనకు ప్రత్యక్ష గురువు ఎవరూ లేకపోయినా, స్వయంకృషితో, పట్టుదలతో మేజిక్ కళను సాధన చేసి, అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. ‘మేజిక్ కళ మాత్రమే కాదు, సైన్స్ కూడా’ అంటారు బోస్. ప్రేక్షకుల ఇంద్రియాలను మభ్యపరచి, వారి తెలివితేటలను తప్పుదారి పట్టించేదే మేజిక్. ఈ కళ ఆత్మస్థైర్యాన్ని కలిగించి, ఒత్తిడిని తగ్గించడమే కాకుండా, ఆలోచనాశక్తిని పెంచుతుందని కూడా ఆయన చెబుతారు.
మేజిక్ స్కూల్ స్థాపన
క్లోజప్ మేజిక్, కంజారింగ్ మేజిక్, స్టేజి మేజిక్, స్ట్రీట్ మేజిక్ ప్రక్రియల్లో బోస్ సిద్ధహస్తుడిగా పేరు పొందారు. ఇతరులు సులువుగా మేజిక్ నేర్చుకోడానికి అనేక పుస్తకాలు రాయడమే కాకుండా, ‘మాయాదండ’ పేరుతో ఇంద్రజాలంపై ప్రత్యేక మాసపత్రికను నడిపారు. ‘మాయాబజార్’ అనే సంస్థను నెలకొల్పి, ఆ సంస్థ ద్వారా మేజిక్ స్కూల్‌ను స్థాపించి, ఔత్సాహికుల అభ్యాసానికి ఉపయోగపడేలా అందులో మేజిక్ పరికరాలను అందుబాటులో ఉంచారు. సాటి మెజీషియన్లకు సేవలు అందించడానికి ‘పీపుల్స్ మేజిక్ సర్కిల్’ను ఏర్పాటు చేశారు.
అసంఖ్యాకమైన అవార్డులు
భీమవరం పట్టణంలో కళ్లకు గంతలు కట్టుకుని ప్రదాన రహదారిపై మోటారు సైకిల్ నడిపి ప్రేక్షకులను విస్మయానికి గురిచేసిన బోస్– దాదాపు 38 అవార్డులందుకున్నారు. 1988లో సొసైటీ ఆఫ్ ఇండియన్స్ మెజీషియన్స్ జాతీయస్థాయి అవార్డుతో ప్రారంభమై; ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ మెజీషియన్స్ అసోసియేష¯Œ గోల్డ్‌మెడల్, కోల్‌కతాలో నేతాజీ అవార్డు, గోవా భారతీయ కళారత్న అవార్డు, ఇంద్రజాల బ్రహ్మ, నేషనల్ లివింగ్ లెజండ్ అవార్డు వంటి ఎన్నో అవార్డులను అందుకున్నారు.
ప్రపంచ రికార్డులు
మేజిక్‌లో ఎన్నో పరిశోధనలు చేసిన బోస్, స్వయంగా వందకు పైగా కొత్త ట్రిక్కులు కనిపెట్టారు. మరొక వంద కొత్త మేజిక్ పరికరాలను సృష్టించారు. మేజిక్ మాయాజాలంతో ఎన్నో ప్రపంచ రికార్డులు సాధించారు. ఆయన సాధించిన రికార్డుల్లో యూనిక్ వరల్డ్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, గోల్డె¯Œ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వంటివి ఉన్నాయి.
బిరుదులు, సత్కారాలు
పీపుల్స్ మెజీషియన్, మేజిక్ స్టార్, మేజిక్ గైడ్, ఇంద్రజాల విద్యావిశారద, మేజిక్ చక్రవర్తి, మల్టీ టాలెంటెడ్ మెజీషియన్ వంటి ఎన్నో బిరుదులతో సత్కారాలు, ప్రముఖ రాజకీయనాయకులు, సినీప్రముఖల ప్రశంసలు అందుకున్నారు.స్వదేశంలో విరివిగా ప్రదర్శనలు ఇవ్వడమే కాకుండా; సింగపూర్, మలేషియా, థాయ్‌లండ్, ఇండోనేషియా, నేపాల్, శ్రీలంక, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, నెదర్లండ్స్, ఆస్ట్రియా, వాటికన్ సిటీ, ఇటలీ తదితర దేశాల్లోనూ అనేక ప్రదర్శనలు ఇచ్చి, అక్కడి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. తన మేజిక్ ప్రదర్శనల ద్వారా మూఢనమ్మకాలపై పోరాటం, బౌద్ధ ప్రచారం, జైలోని ఖైదీలకు బౌద్ధ పుస్తకాల పంపిణీ, పేద బాలలకు ఆర్ధిక సహాయం వంటి సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల మన్ననలు పొందారు.
∙