
ప్రహ్లాదుడు ఒకసారి భూలోక సంచారం చేయాలనుకున్నాడు. సాధు సజ్జనులతో కలసి బయలుదేరాడు. భూలోకంలో సంచరిస్తూ, సహ్యాద్రి ప్రాంతానికి చేరుకున్నాడు. కావేరీ నదిలో స్నానసంధ్యాదులు పూర్తి చేసుకుని, ప్రహ్లాదుడు ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ, సాధు సజ్జన బృందంతో ముందుకు నడవ సాగాడు. తోవలో నేల మీద దుమ్ము, ధూళిలో పడుకుని ఉన్న ఒక మహర్షిని అల్లంత దూరం నుంచి చూశాడు. ఆ మహర్షిలో ఎలాంటి చలనం లేదు. ప్రహ్లాదుడిని అనుసరించి వస్తున్నవారు కూడా ఆయనను గమనించారు.
‘ఎవరీ మహర్షి? ఎందుకిలా నేల మీద పడుకుని ఉన్నారు? దగ్గరలో ఆశ్రమమేదైనా ఉందా? ఇలా దుమ్ము, ధూళిలో నిశ్చలంగా పరుండి ఉండటం ఏమైనా వ్రత నియమమా?’ అని వారిలో వారు రకరకాలుగా తర్జనభర్జనలు పడ్డారు.మహర్షి సంగతేమిటో స్వయంగా తెలుసుకుందామని ప్రహ్లాదుడు ఆయనను సమీపించాడు. నెమ్మదిగా ఆయన పాదాల చెంత కూర్చున్నాడు. పాదాలకు శిరసును ఆన్చి నమస్కరించి, ఆ పాదాలను తన ఒడిలోకి తీసుకుని, నెమ్మదిగా ఒత్తుతూ, ‘మహానుభావా!’ అని సంకోచిస్తూనే పలకరించాడు.ఆ మహర్షి నెమ్మదిగా కళ్లు తెరిచి, ‘ఏమిటి?’ అన్నట్లు ప్రహ్లాదుని వంక చూశాడు.‘మహానుభావా! తమరు ఎందుకిలా నేల మీద పడి ఉన్నారు? శరీరమంతా దుమ్ము, ధూళితో నిండి ఉందంటే, మీరు చాలాకాలంగా ఇలాగే ఉన్నట్లు అర్థమవుతోంది.
ఇది ఏమైనా వ్రత నియమమా? లోకంలో ప్రయత్నం లేకుంటే, మనిషికి ధనం లభించదు. ధనం లేకుంటే, సుఖభోగాలు లభించవు. మానవ సహజమైన సుఖాలను త్యజించి, మీరిలా నేల మీద పడుకుని ఉన్నా, మీలో తేజస్సు ప్రకాశిస్తూనే ఉంది. ఇదంతా వింతగా ఉంది. మీ వింత పద్ధతికి కారణం ఏమిటో చెప్పండి’ అని అడిగాడు ప్రహ్లాదుడు.‘నాయనా ప్రహ్లాదా! ఇదంతా తెలియకనే అడుగుతున్నావా? నీవు సాక్షాత్తు శ్రీహరినే మెప్పించిన భక్తాగ్రేసరుడివి. ప్రవృత్తి నివృత్తి ఫలాలను ఆధ్యాత్మిక దృష్టితో చూడగలిగిన తత్త్వవేత్తలలో అగ్రగణ్యుడివి. అలాంటి నువ్వు నన్నిలా అడగటం ఆశ్చర్యంగా ఉంది. అయినా అడిగావు గనుక చెబుతాను, విను. దీనివల్ల నీకూ నాకూ ఆత్మశుద్ధి కలుగుతుంది’ అని ఆ మహర్షి తన కథను చెప్పనారంభించాడు.
‘కర్మలు ఆచరిస్తూ; వాటి వల్ల కలిగే జన్మల ఫలితాలను చూస్తూ; ఈ సుడిగుండంలో తిరిగి తిరిగి విసిగి వేసారిపోయాను. ఇదివరకటి జన్మలో నేను కొండచిలువను. ఇప్పుడు మానవజన్మ ఎత్తాను. మానవజన్మ స్వర్గమోక్షాలకు ప్రవేశద్వారం. మానవజన్మలోనూ దుష్కర్మలను ఆచరిస్తే జంతుజన్మ లభిస్తుంది. పాప పుణ్యాలు రెండూ చేస్తే, మళ్లీ మానవజన్మ లభిస్తుంది. దుఃఖాలను తొలగించుకోవడానికి, సుఖాలను పొందడానికి మనుషులు ఏవేవో కర్మలు చేస్తూనే ఉంటారు. వాటి వల్ల లభించే అనుకూల, ప్రతికూల ఫలితాలను అనుభవిస్తూనే ఉంటారు. అసలు ఫలానుభవమే వద్దనుకున్నవాడు కర్మలను ఆచరించవలసిన పని ఏముంది? సుఖం ఆత్మస్వరూపం. భోగాలు అశాశ్వతాలు.
ఈ జ్ఞానం కలిగిన తర్వాత నేను కర్మలను ఇంకా ఎందుకు ఆచరించాలి? అందువల్లనే నిశ్చేష్టుడినై, నిష్ప్రయత్నుడినై పూర్వజన్మ సంచితాలైన ప్రారబ్ధ కర్మల ఫలాలను అనుభవిస్తూ ఇక్కడ పరుండి ఉన్నాను.ప్రహ్లాదా! ధనం వల్ల సుఖం దొరుకుతుందని అన్నావు కదా! ధనం వల్ల దుఃఖమే తప్ప సుఖం లేదు. ధనాన్ని రాజ, చోర, శత్రు, మిత్ర, పుత్ర, కళత్రాదులు అపహరించుకుపోతారనే భయం మనిషికి దుఃఖాన్ని కలిగిస్తుంది. ధనవంతులు నిశ్చింతగా నిద్రించలేరు. అందువల్ల ధనం మీద, ధనం వల్ల కలిగే భోగాల మీద మమకారాన్ని విడిచిపెట్టడం ఉత్తమం.ఈ సృష్టిలో నాకు తేనెటీగ, అజగరం గురువులు. తేనెటీగలు ఎంతో శ్రమించి, తాము కట్టుకున్న పట్టులో తేనెను కూడబెడతాయి. ఎవడో వచ్చి, పొగపెట్టి తేనెటీగలను చంపి, పారదోలి ఆ తేనెను దోచుకుపోతాడు. అలాగే మానవులు ధనం కూడబెడతారు. చివరకు దాని వల్లనే నశిస్తారు. అందువల్ల తేనెటీగల నుంచి నేను వైరాగ్యాన్ని నేర్చుకున్నాను.
నా ఇంకో గురువు అజగరం– అంటే, కొండచిలువ. అది మహాసర్పం. అది అందుబాటులో ఉన్న ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తుంది. తర్వాత కదలదు, మెదలదు. తనకై తాను సొంత ప్రయత్నమంటూ చేయదు. తిండి దొరకకుంటే, ఎన్నాళ్లయినా పస్తులుంటూ ముడుచుకుని పడుకుంటుంది. అజగరాన్ని చూసి నేను సంతుష్టిని నేర్చుకున్నాను. నాకు సుఖం లేదు, దుఃఖం లేదు. ఎవరినీ ఏదీ అడగను. ఎవరు ఏది ఇచ్చినా తీసుకుంటాను. పట్టువస్త్రాలు ధరించినా, చిరిగిన గుడ్డపీలికలు ధరించినా నాకు తేడా ఉండదు. హంసతూలికా తల్పాలపై శయనించినా, ఇలా మట్టిలో శయనించినా నాకు ఒకేలా ఉంటుంది. సగుణమైనా, నిర్గుణమైనా నాకు ఒకటే! అధికమైనా అల్పమైనా ఒకటే! నాది సర్వసమదృష్టి. దీనివల్ల సుఖదుఃఖ భేదాన్ని చిత్తవృత్తిలో లయింపజేయగలిగాను.
చిత్తవృత్తిని మనసులో, మనసును అహంలో, అహాన్ని మాయలో, మాయను ఆత్మానుభూతిలో లయింపజేశాను. స్వానుభవంలో ఆత్మస్థితిలో ఏకనిష్ఠలో ఉంటున్నాను.ప్రహ్లాదా! నువ్వు యోగ్యుడివి. ఇది చాలామందికి లోకవిరుద్ధంగా, శాస్త్ర విరుద్ధంగా అనిపిస్తుంది. ఆధ్యాత్మికజ్ఞానివైన నువ్వు అర్థం చేసుకోగలవు. అందుకే ఇదంతా నీకు చెప్పాను’ అని అజగరవ్రతంలో ఉన్న మహర్షి ముగించాడు.ప్రహ్లాదుడు అమితానందంతో ఆయనను సేవించి, పూజించి ఆయన ఆశీస్సులు పొందాడు. అజగర మహర్షి నుంచి తెలుసుకున్న ఆధ్యాత్మిక జ్ఞానంతో ఆత్మతృప్తి పొంది, ఆయన నుంచి వీడ్కోలు తీసుకుని, తన బృందంతో కలసి యాత్ర కొనసాగించేందుకు బయలుదేరాడు.
∙సాంఖ్యాయన