''ఇయ్యాల బిచ్చమడుగుడొస్తే రేపు ఓట్లు కూడా..''

Election Campaign Dirty Tricks Starts Just Like Begger - Sakshi

పొద్దు మీకింది. మొగులు మీద చుక్కలు ఎల్లినయి. వాడకట్టుల దీపాలు ఎల్గినయి. ఎపటి తీర్గనే ఆనంద్‌ బాగ్‌ చౌరస్త కాడ్కి బోయిన. గాడ రవి పాన్‌ డబ్బ ఉన్నది. గది మాదోస్తుల అడ్డ.‘‘ఎలచ్చన్లు దగ్గర బడుతున్నయి. లీడర్లు ఏం జేస్తున్నరు?’’ అని సత్నారి అడిగిండు.‘‘ముందుగాల సర్వేలు జేపిచ్చిండ్రు’’ అని యాద్గిరిజెపిండు.‘‘సర్వేలు ఎందుకు?’’‘‘ఎవలకు ఎంత బలముందో ఎర్క జేస్కునేతందుకు.’’‘‘ఎర్క జోస్కోని ఏం జేస్తరు?’’‘‘ఎవ్వలికి ఎక్వ బలముంటె గాల్లకు ఎమ్మెల్యె టికిట్‌ఇస్తరు.’’‘‘టికిట్‌ రానోల్లు ఏం జేస్తరు?’’‘‘గోడ దుంకుతరు.

లేకుంటె రెబల్‌ క్యాండిడేట్లుగ పోటి జేస్తరు.’’‘‘అన్ని పార్టిల లీడర్లు ఏం జేస్తరు?’’‘‘పాదయాత్రలు జేస్తరు. బస్సు యాత్రలు జేస్తరు.’’‘‘ఇంకేం జేసిండ్రు?’’‘‘పార్టీ కార్యకర్తలకు ట్రేనింగ్‌ ఇపిచ్చిండ్రు.’’‘‘ఎవలితోని ఇపిచ్చిండ్రు?’’‘‘ముందుగాల బిచ్చపతి అనేటి బిచ్చగానితోని ట్రేనింగ్‌ ఇపిచ్చిండ్రు. ‘ఒక్క పది రూపాయలు దానమియ్యి. దానమిస్తె పున్యమొస్తది. నీ పేరు జెప్పుకోని బత్కుత. నీ పెండ్లాం పిల్లలు సల్లగుంటరు అనుకుంట బిచ్చమడ్గాలె. బిచ్చమేసె దాంక సతాయించాలె. ఇండ్లల్ల అడుక్కునేటప్పుడు గింత బిర్యాని పెట్టమ్మా, సోర్వ ఎయ్యమ్మా అని పాడాలె. ధర్మతల్లీ!

నాకు బిచ్చమేస్తె మీ ఇంటికి లచ్చిందేవొస్తది. నీ మొగని జీతం బెర్గుతది. నీ బిడ్డ పెండ్లి అయితది. నీ కొడ్కుకు కొల్వు దొర్కుతది. నీ మెడలకు బంగారి గొల్సు, నడ్ముకు వడ్డాన వొస్తయి. చేతులకు బంగారి గాజులు,చెవులకు కమ్మలొస్తయి. నీ మొగడు దినాం నిన్ను మోటర్ల దిప్పుతడు. అమెరిక గొంచబోతడు. రొండంత్రాల బంగ్ల గట్టిస్తడు. నువ్వు ఏం గావాలన్నాఇస్తడు. గింత ఉడుకుడు బువ్వెయ్యమ్మా! గింత కూర, మామిడి తొక్కు బెట్టమ్మా! గిలాసల జెరంత సల్లబొట్టు బొయ్యమ్మా అని అనాలె. బిచ్చం బెట్టెదాంక ఇంటి ముంగటనే ఉండాలె. ఇయ్యాల బిచ్చమడ్గొస్తె రేపు ఓట్లుఅడ్గుడు మీకు అల్కగైతది’అనుకుంట బిచ్చపతి పాటం జెపిండు.థియరీ క్లాసులైనంక ప్రాక్టికల్స్‌ షురువైనయి. చిన్గిన అంగి, పైంటును పార్టీ కార్యకర్తలు దొడుక్కున్నరు.

ఒక చేత్ల బొచ్చె, ఇంకో చేత్ల కట్టె బట్టుకున్నరు. కొందరు గుడి మెట్ల మీద గూసోని బిచ్చమడిగిండ్రు. కొందరు రేల్‌టేషన్ల, బస్టాండ్లల్ల బిచ్చమడిగిండ్రు. కొందరు
గుడ్డోల్లు, కుంటోల్ల లెక్క యాక్టింగ్‌ జేస్కుంట బిచ్చమడిగిండ్రు.పొద్దు మీకినంకగా దినం అడ్క తెచ్చినయి గాల్లు బిచ్చపతికి సూబెట్టిండ్రు. గవ్విటిని జూసి గాడు మార్కులేసిండు.’’‘‘ఇంకెవలితోని ట్రేనింగ్‌ ఇపిచ్చిండ్రు?’’‘‘తిట్ల మీద పాటం జెపెటందుకు నర్సమ్మ అనేటామెను బిల్సిండ్రు. గామె తిట్లల్ల మషూర్‌. ముందుగాల తిట్టినంకనే గామె మాట్లాడ్తది. ‘నీ నోట్లె మన్నువడ. నీ ఇంట్ల పీన్గెల్ల. నీ దౌడల్‌ దగ్గర బడ. నీ తలపండు బల్గ. నీకు పిండం బెట్ట. నీ పెండ్లాం ముండమొయ్య. నీ ముక్కుల దూది బెట్ట. నీ చేత్ల జెష్ట మొల్వ. నీకు గజ్జి లెవ్వ. నీ యాపారం జెడ.

నువ్వు ఆకల్తోని సావ. నువ్వు లంగవు. లఫంగవు.బట్టె బాజ్‌ గానివి. బద్మాష్‌వి. సన్నా సివి. దద్దమ్మవు. బేకార్గానివి. నక్కవు. గజ్జి కుక్కవు.పందివి. జిల్ల పుర్గువు. నీ కాల్లు చేతులిర్గ. నీకు గత్తర్‌ దల్గ’ అనుకుంట నర్సమ్మ తిట్ల దండకం సదివింది. తిట్ల దండకంను చపాయించి తలా ఒక కాపి ఇచ్చిండ్రు.’’‘‘ఇంకెవ్వరితోనైన ట్రేనింగ్‌ ఇపిచ్చిండ్రా?’’‘‘ఒక గూండాను బిలిసిండ్రు. మీటింగ్‌లను ఎట్ల చెడగొట్టాలెనో, సూటి జూసి కోడిగుడ్లు, టమాటలు, పాత చెప్పులు ఎట్ల ఎయ్యాలెనో గాడు నేరిచ్చిండు. ఒక బైరూపులోడు వొచ్చిండు. రంగు బూస్కోకుంటనే యేసాలు ఎట్ల ఎయ్యాలెనో జెపిండు.ఇంకొగాయిన వొచ్చిండు. ఏం లేకున్నా గంటలు,గంటలు ఎట్ల సీచ్‌ గొట్టాలెనో పాటాలు జెపిండు.’’గీ తీర్గ మా దోస్తులు మాట్లాడుకుండ్రు.

-తెలిదేవర భానుమూర్తి,
సీనియర్‌ జర్నలిస్ట్‌,
99591 50491
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top