
పుట్టగొడుగుల్లా గుర్తింపు లేని పాఠశాలలు
అరకొర వసతులతో నిర్వహణ
దిల్‌సుఖ్‌నగర్: విద్యా సంవత్సరం ప్రారంభం కావస్తున్నా అనుమతి లేని ప్రైవేటు పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు దృష్టి సారించలేదు. ఇప్పటి నుంచే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు అడ్మిషన్ల కోసం ఇంటింటికి వెళ్తున్నారు. అంతేకాక రకరకాల ప్రకటనలతో ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులు విద్యార్థుల తల్లితండ్రులను ఆకర్షించే ప్రయత్నం ముమ్మరం చేస్తున్నారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజులపై ప్రభుత్వం ఇంత వరకు ఎలాంటి జీఓను విడుదల చేయకపోవడంతో ఏ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించాలనే అయోమయంలో తల్లితండ్రులు ఉన్నారు.
రూ. లక్షల్లో ఫీజులు..
మలక్‌పేట్ జోన్ పరిధి వివిధ ప్రాంతాల్లోని ప్రైవేటు పాఠశాలల్లో ఉండాల్సిన కనీస సౌకర్యాలు లేవు. కానీ కార్పొరేట్ పాఠశాలల పేరుతో రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షల వరకు ఫీజులు వసూలు చేçస్తున్నారు. సరూర్‌నగర్, సైదాబాద్, బాలాపూర్ మంండలాల్లో గుర్తింపు లేని ప్రైవేటు పాఠశాలలు సుమారు 70కి పైగానే ఉన్నాయని అధికారులు చెబుతున్నా వారి దృష్టికి రాని పాఠశాలలు మరెన్నో ఉన్నాయి. గుర్తింపు లేని పాఠశాలల్లో అడ్మిషన్లు ప్రారంభించి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుండగా వాటిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
ఉన్నతాధికారులతో కుమ్మకై..
పేరుకు కార్పొరేట్ పాఠశాలలు, కానీ.. విద్యార్థులు ఆడుకోవడానికి కావాల్సిన ఆట స్థలాలు, మంచినీటి సౌకర్యం, రవాణా, సరైన తరగతి గదులు ఉండవు. పక్కనే ఉన్న ఖాళీ స్థలాన్ని ఆట స్థలంగా అధికారులకు చూపిస్తూ, ఇరుకు గదుల్లో పరిమితికి మించి విద్యార్థులతో కనీస అర్హత లేని ఉపాధ్యాయులతో చదువులు చెప్పిస్తున్నారు. జిల్లా అధికారులతో నేరుగా సంబంధాలు పెట్టుకుని కార్పొరేట్ స్థాయి పాఠశాలలు స్థానిక అధికారులు ఇచ్చిన నోటీసులను ఏ మాత్రం ఖాతరు చేయకుండా అడ్మిషన్లను కొనసాగిస్తున్నారు. జిల్లా అధికారుల కనుసన్నలలోనే గుర్తింపులేని పాఠశాలలు కొనసాగుతున్నాయని, వారి అండతోనే ఎలాంటి సౌకర్యాలు లేని పాఠశాలలు వేలల్లో ఫీజులు దండుకుంటున్నాయని ఆరోపణలు వస్తున్నాయి.
విద్యాశాఖ అధికారుల ఉదాసీనత..
ఎలాంటి గుర్తింపు లేకుండా ఏళ్ల తరబడి పాఠశాలలు కొనసాగుతున్నా విద్యాశాఖ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. అధికారులు కఠినంగా వ్యవహరిస్తే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులుండవని పేరెంట్స్ అసోసియేషన్ నాయకులు పేర్కొంటున్నారు. పాఠశాలల అనుమతులు లేని విషయం తెలియని అమాయక తల్లితండ్రులు తమ పిల్లల్ని ఆ పాఠశాలల్లో చేర్పించి వేలకు వేలు ఫీజులు చెల్లిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. గుర్తింపులేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.