తణుకు అర్బన్: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు. పట్టణంలోని మెడికల్ వర్తకుల భవన్‌లో జరిగిన ఓబీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. బీసీ ప్రజలు ముందుకు వచ్చి తమ హక్కుల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసి ప్రస్తుత శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం కోసం కృషి చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల రిజర్వేషన్ల అమలు కోసం రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 15, 16 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి ఈపనగండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఓబీసీలకు ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చాటపర్తి పోసి బాబు, రాష్ట్ర నాయకులు ముద్దాడ భవాని యాదవ్ మాట్లాడుతూ జాతీయ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకాన్ని ఓబీసీలోని అన్ని కులాల విద్యార్థులకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఓబీసి మహిళా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మనుబర్తి లలిత మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు సబ్ కోటా రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. ఓబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు ముద్దాడ భవావీ యాదవ్, సంయుక్త కార్యదర్శి సత్యనారాయణ మాట్లీఆడారు. ఓబీసీ మహిళా సంఘం పట్టణ అధ్యక్షురాలిగా కటారి మమత, ఉపాధ్యక్షురాలిగా నెలపురి శివ తేజస్విని, సంయుక్త కార్యదర్శిగా కొనకల్ల జయలక్ష్మీ, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా పుచ్చకాయల శ్యామలక్ష్మి ఎన్నికయ్యారు.


