నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
పెదవేగి: తుపాను వల్ల ధాన్యం దిగుబడి తగ్గి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, నాణ్యమైన గోనె సంచులు అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ కోరారు. బుధవారం పెదవేగి మండలంలోని ముండూరు, వేగివాడ గ్రామాలలో పర్యటించి కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తుపాను వల్ల ధాన్యం దిగుబడులు తగ్గి రైతులు, కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు పది నుంచి 15 బస్తాలకు పైగా దిగుబడి తగ్గిందని చెప్పారు. ధాన్యం పండించిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, తగ్గిన దిగుబడి మేరకు పంటల బీమా పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నాణ్యమైన గోనె సంచులు అందించాలని కోరారు. తేమ శాతం వంటి నిబంధనలు సడలించి కల్లాలో ఉన్న ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేగుంట రామకృష్ణ, తిప్పాపట్ల పురుషోత్తం, చొదిమెళ్ళ యేసు రాజు, మహాలక్ష్ముడు, చొదిమెళ్ళ సురేష్ తదితరులు పాల్గొన్నారు.


