నాటుసారా రహిత జిల్లాగా రూపొందించాలి
ఏలూరు(మెట్రో): నాటు సారా రహిత జిల్లాగా ఏలూరు జిల్లాను రూపొందించేందుకు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని గౌతమీ సమావేశపు హాలులో బుధవారం నాటుసారా తయారీని విడిచిపెట్టిన కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి (మార్పు) కార్యక్రమాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో నాటుసారా పూర్తిగా నిర్మూలించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నాటుసారా తయారీదారులు నాటుసారా జోలికి వెళ్లకుండా గౌరప్రదమైన మార్గాన్ని ఎంపికచేసుకునేలా వారిలో మార్పు తీసుకురావాలన్నారు. నాటుసారా తయారీ జోలికి మళ్లీ వెళ్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. సమావేశంలో ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ బి.శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ ఎ.సి.ప్రభుకుమార్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఎ.ఆవులయ్య, డీఆర్డీఏ పీడీ ఆర్.విజయరాజు, ఎకై ్సజ్ శాఖ ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు భూసేకరణ కోసం సంబంధిత గ్రామాలలో పీసా కమిటీ సమావేశాలు నిర్వహించి ఆమోదం తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి బుధవారం సాయంత్రం పోలవరం ప్రాజెక్టు ఆర్‌అండ్‌ఆర్ పునరావాస కార్యక్రమాలు, జాతీయ రహదారుల నిర్మాణానికి, సెల్ ఫోన్ టవర్ల ఏర్పాటు నిమిత్తం భూ సేకరణ కోసం అధికారులతో జూమ్ కాన్ఫరెనన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ రహదారుల నిర్మాణానికి సంబందించి కోర్టుల్లో ఉన్న కేసులు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ, రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు, పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ అభిషేక్, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఏలూరు, జంగారెడ్డిగూడెం ఆర్డీవోలు యం.అచ్యుత అంబరీష్, రమణ తదితరులు పాల్గొన్నారు.


