దొంగ నోట్ల డిపాజిట్ కేసులో ఐదుగురి అరెస్ట్
ఏలూరు టౌన్: ఏటీఎంలో దొంగనోట్లు పెట్టి ఒక మహిళ బ్యాంకు ఖాతాలో జమ చేసేందుకు ప్రయత్నించిన ఐదుగురు వ్యక్తులను ఏలూరు రూరల్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. గతంలో ఏలూరు రూరల్ మండలం చాటపర్రులోని కెనరా బ్యాంకు ఆవరణలో ఉన్న ఏటీఎంలో దొంగనోట్లు డిపాజిట్ చేసేందుకు ప్రయత్నించారు. బ్యాంకు అధికారులు నోట్లను గుర్తించి సొమ్ము ఏ సమయంలో జమ చేశారో సీసీ ఫుటేజీతో గుర్తించారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు ఏలూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. గుడివాకలంక గ్రామానికి చెందిన, ప్రస్తుతం ఏలూరు తూర్పువీధిలో నివాసం ఉంటోన్న సైదు సతీష్, చాటపర్రు ప్రాంతానికి చెందిన కొలుసు జయంత్, ఏలూరు తూర్పువీధికి చెందిన వేమాల శివ, వైఎస్సార్ కాలనీకి చెందిన గొరిపర్తి నాగబాబు, తణుకు రూరల్ మండలం గరగపర్రుకు చెందిన చెన్నా వెంకట సూర్యనారాయణను నిందితులుగా గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టుకు హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు.


