సికిలే స్కూల్ వద్ద ఉద్రిక్తత
● భవానీమాల ధరించిన విద్యార్థినిని అనుమతించడం లేదంటూ ఆరోపణ
● భజరంగదళ్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తల ఆందోళన
నరసాపురం: స్థానిక జేసికిలే స్కూల్ వద్ద బుధవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న ఓ బాలిక భవానీ మాల ధరించి స్కూల్‌కు రావడంతో యాజమాన్యం అడ్డుకుందని ఆరోపిస్తూ విశ్వహిందూ పరిషత్, భరజరగదళ్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పాఠశాల ఆఫీసు రూమ్ వద్దకు చేరుకుని భజనలు చేస్తూ నిరసన తెలిపారు. ప్రిన్సిపాల్ సుచరితను సస్పెండ్ చేయాలని, యాజమాన్యం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో టౌన్ సీఐ యాదగిరి, తహసీల్దార్ అయితం సత్యనారాయణ అక్కడకు చేరుకుని ఆందోళనకారులు, యాజమాన్యంతో మాట్లాడి సమస్యను సర్ధుబాటు చేశారు. పాఠశాల కరస్పాండెంట్ సికిలే పెర్సిపాల్ మాట్లాడుతూ మాల ధరించి వచ్చిన విద్యార్థి తండ్రిని పిలిచి ఎన్నిరోజులు మాలతో వస్తుందో లెటర్‌రాసి ఇమ్మని, అన్ని రోజులకు పర్మిషన్ ఇచ్చామని చెప్పారు. అయినా కూడా గొడవ చేశారన్నారు. మరోవైపు ఈ స్కూల్‌లో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని విశ్వహిందూ పరిషత్ నాయకులు ఆరోపిస్తున్నారు.


