చేపల వేటకు వెళ్లి మృత్యు ఒడికి..
జంగారెడ్డిగూడెం: మండలంలోని కేకేఎం ఎర్రకాలువ జలాశయంలో చేపల వేటకు వెళ్లి ఒక మత్య్సకారుడు మృతిచెందాడు. ఎస్సై ఎన్‌వీ ప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాడువాయి గ్రామానికి చెందిన నబిగిరి వెంకటేశ్వరరావు (62) చేపలు పడుతూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం ఉదయం చేపల వేట కోసం కేకేఎం ఎర్రకాలువ జలాశయానికి వెళ్లాడు. చేపలు పడుతుండగా డోనె అదుపు తప్పి ప్రమాదవశాత్తూ జలాశయంలో మునిగి మృతిచెందాడు. కుటుంబసభ్యుల సమాచారంతో తోటి మత్స్యకారులు పడవల సహాయంతో వెళ్లిచూడగా చేపల వలలో చిక్కికున్న వెంకటేశ్వరరావు మృతదేహం కనిపించింది. దీంతో వారు జంగారెడ్డిగూడెం పోలీసులకు సమాచారం అందించగా ఘటనాస్థలికి చేరుకుని వెంకటేశ్వరరావు మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. దీనిపై మృతుడి వెంకటేశ్వరరావు భార్య గంగారత్నం ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


