కొల్లేరు సమస్యలు కొలిక్కి వచ్చేనా?
● స్పష్టమైన హామీ ఇవ్వని సీఎం చంద్రబాబు
● నిరాశగా వెనుదిరిగిన కొల్లేరు ప్రజలు, నాయకులు
● నల్లమాడులో ప్రజావేదిక కార్యక్రమం
కై కలూరు: కొల్లేరు సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి స్పష్టమైన హామీ వస్తుందని భావించిన కొల్లేరు ప్రజలకు నిరాశ ఎదురైంది. సోమ వారం ఉంగుటూరు మండలం నల్లమాడులో సీఎం ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర సాధికారత కమిటీ (సీఈసీ) సభ్యులు జి.భానుమతి, రమన్‌లాల్‌భట్, సునీల్ లిమాయే, చంద్రప్రకాష్ గోయల్ ఈ ఏడాది జూన్ 17, 18వ తేదీల్లో కొల్లేరులో పర్యటించారు. ప్రభుత్వం నుంచి పూర్తి నివేదిక సీఈసీకి ఇప్పటికీ చేరలేదు. మరోపక్క కొల్లేరులో ‘జీరో’ పాయింట్ సైజు చేపల పెంపకానికి సన్నాహాలు జరుగుతున్నా యి. ఫారెస్టు అధికారులు అడ్డుకోడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో స్పష్టమైన హామీ రాకపోవడంతో కొల్లేరు ప్రజలకు నిరాశే మిగిలింది.
కొల్లేరులో సాగు జరిగేనా..
కొల్లేరు అభయారణ్యం 5వ కాంటూరు వరకు 77,135 ఎకరాలుగా నిర్ణయించారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 31,120 ఎకరాల్లోని అక్రమ చెరువులను కొల్లేరు ఆపరేషన్‌లో ధ్వంసం చేశారు. వీటిలో 14,932 ఎకరాల జిరాయితీ, 5,510 ఎక రాల డీ–ఫాం భూములు ఉన్నాయి. వీటిని మినహాయించాలనే ప్రధాన డిమాండ్ కొల్లేరు ప్రజల్లో వినిపిస్తుంది. ఆటవీశాఖ ఇరు జిల్లాల్లో 18 వేల ఎకరాల్లో అక్రమ చేపల సాగు కొల్లేరు అభయారణ్యంలో ఉందని నివేదిక ఇచ్చింది. వీటిలో 9,500 ఎకరాల చెరువులకు గండ్లు పెట్టామని తెలిపింది. ఇదిలా ఉంటే ఇటీవల ఉంగుటూరు మండల సమీపంలో కొల్లేరులో వరిసాగు చేసే రైతులను ఈ ఏడాది అటవీ అధికారులు అనుమతించలేదు. దీంతో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. సుప్రీంకోర్టు ని బంధనలు అతిక్రమించవద్దని అటవీ సిబ్బంది నచ్చజెప్పి వారిని పంపించి వేశారు.
జీరో పాయింట్ సాగు కోసం..
కొల్లేరులో శీతాకాలంలో ‘జీరో పాయింట్’ చేపల సాగు చేస్తారు. కొల్లేరు ఆపరేషన్‌లో ధ్వంసం చేసిన చెరువుల్లో వీటి సాగు అధికంగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలతో సీఈసీ పర్యటించిన నేపథ్యంలో అక్రమ సాగు చేస్తే కేసు మరింత జఠిలమవుతుందని ఫారెస్టు అధికారులు భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం చంద్రబాబుతో చెప్పించి అయిన సరే జీరో పాయింట్ సాగునకు అనుమతించాలని కొల్లేరు పరీవాహక నియోజకవర్గ ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారు. అక్ర మ సాగు జరిగితే వీటినే సాక్షాలుగా సుప్రీంకోర్టుకు అందించడానికి పర్యవరణవేత్తలు సిద్ధంగా ఉన్నా రు. ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో అటవీశాఖ ఎలా వ్యవహరిస్తుందనే అంశం చర్చగా మారింది.
సమస్యలపై సీఎం ఆరా
ప్రజావేదిక కార్యక్రమానికి విచ్చేసిన సీఎం చంద్రబాబు స్టాల్స్ పరిశీలన సందర్భంగా కొల్లేరు అంశాన్ని కై కలూరు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప్రస్తావనకు తీసుకువచ్చారు. కొల్లేరు సమస్య ఏ మైందని చంద్రబాబు అడిగారు. ఈనెల 4న సీఈసీ సభ్యుడు చంద్రప్రకాష్ గోయల్‌ను కలిసి సుప్రీంకోర్టులో నివేదిక అందిస్తామని కామినేని చెప్పారు. నివేదిక ఇచ్చిన తర్వాత తన దృష్టికి తీసుకురావాలని సీఎం సూచించారు. ఒకేసారి కొల్లేరు సమస్య పరిష్కారమయ్యేలా ప్రణాళికతో వెళ్లాలని సీఎం అన్నారు.


