రూ.20 కోట్లతో ఐదు సబ్ స్టేషన్ల నిర్మాణం
● బకాయిల వసూళ్లపై దృష్టి సారించండి
● ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి
నూజివీడు: ఏపీసీపీడీసీఎల్ నూజివీడు డివిజన్‌లో రూ.20 కోట్ల వ్యయంతో ఐదు 33/11కేవీ విద్యుత్ ఉపకేంద్రాలను నిర్మిస్తున్నట్లు సీఎండీ పెరుగు పుల్లారెడ్డి తెలిపారు. నూజివీడులోని ఇండోర్ సబ్‌స్టేషన్‌లో డివిజన్‌లోని విద్యుత్ శాఖ పనితీరుపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూజివీడు, తిరువూరుల్లోని టిడ్కో కాలనీల వద్ద, ఆగిరిపల్లి, నెమలి, కొర్లమండలలో విద్యుత్ ఉపకేంద్రాలను నిర్మిస్తున్నామన్నారు. దిగవల్లిలోని 220 కేవీ విద్యుత్ ఉపకేంద్రంకు సంబంధించి స్థల సమస్య ఉందని, దానిని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో విద్యుత్‌శాఖలోని ఖాళీలను భర్తీ చేయడానికి వచ్చే నెలలో నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. 860 జేఎల్‌ఎం, 56 ఏఈ, 70 జేఈ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. సీపీడీసీఎల్ పరిధిలో ఇప్పటివరకు 25వేల మంది పీఎం సూర్యఘర్ పథకంలో సోలార్ విద్యుత్‌ను ఏర్పాటు చేసుకున్నారన్నారు. 200 లోపు యూనిట్లు విద్యుత్‌ను వాడే ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులను 1.90 లక్షల మందిని గుర్తించామని, వారి ఇళ్లకు సోలార్ విద్యుత్‌ను ఏర్పాటు చేసేందుకు డివిజన్ స్థాయిలో టెండర్లు పిలిచామన్నారు. ఈ పనులు వచ్చే నెల నుంచి ప్రారంభమవుతాయన్నారు.
పెండింగ్ లేకుండా చూడండి
డివిజన్‌లోని అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ విద్యుత్ కనెక్షన్‌ల మంజూరు, లైన్ల ఏర్పాటు తదితర వాటికి సంబంధించి పెండింగ్ లేకుండా చూడాలన్నారు. ఒక్క విస్సన్నపేట మండలంలోని వెయ్యి వరకు ట్రాన్స్‌ఫార్మర్‌లు పెండింగ్‌లో ఎందుకున్నాయని ప్రశ్నించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌లకు సంబంధించి డబ్బులు ముందు చెల్లించిన వారికి ముందు పనిచేయాలన్నారు. డివిజన్‌లో విద్యుత్ బిల్లులకు సంబంధించి ప్రభుత్వ కార్యాలయాల నుంచి రావాల్సిన డిమాండ్‌లో 50 శాతం కూడా వసూలు కావడం లేదని, బాకాయిల వసూళ్లపై దృష్టి సారించాలన్నారు. ఏడీలు ఓఎంఅండ్ స్టాఫ్‌తో నిరంతరం సమావేశాలు నిర్వహించి పనితీరుపై సమీక్ష నిర్వహించాలని, డివిజన్‌లో అసలు సమావేశాలు జరుగుతున్న దాఖాలాలు కనిపించడం లేదన్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌లకు దరఖాస్తు చేసుకున్న వారికి ఎస్టిమేషన్లు వేయకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని ఏఈలను ప్రశ్నించారు. ప్రజలను ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టొద్దన్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్ టెక్నికల్ ఆవుల మురళీకృష్ణ యాదవ్, ఎస్‌ఈ యూ హనుమయ్య, నూజివీడు ఈఈ ఏ సత్యన్నారాయణ, ఎంఆర్‌టీ ఈఈ ఏడుకొండలరావు, కనస్ట్రక్షన్ ఈఈ కిషోర్‌కుమార్, సీనియర్ అక్కౌంట్ ఆఫీసర్ నక్కా విజయకుమారి, డీఈలు ఓలేటి దుర్గారావు, ఎం పోతురాజు, రామకృష్ణ, వీరబాబు, ఏఈలు, జేఈలు పాల్గొన్నారు.


