వైఎస్సార్ సీపీ నేతపై హత్యాయత్నం
ముసునూరు : వైఎస్సార్ సీపీ నేతపై హత్యాయత్నం బలివేలో కలకలం రేపింది. పొలం తగాదాలో వైఎస్సార్ సీపీ గ్రామ అధ్యక్షుడు బొప్పన రామకృష్ణపై హత్యాయత్నం జరిగింది. బాధితుడు ప్రస్తుతం నూజివీడు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల ప్రకారం మండలంలోని బలివే శివారు వెంకటాపురం గ్రామానికి చెందిన బొప్పన రామకృష్ణ, బాలకృష్ణ అన్నదమ్ములు. వీరి కుటుంబ సభ్యులు 2016లో వడ్లపట్ల వెంకటేశ్వరరావు వద్ద భూమి కొనుగోలు చేశారు. కాగా వెంకటేశ్వరరావు తమ్ముడు వడ్లపట్ల సుబ్బారావు. అతని కుమారుడు ప్రతాప్ అనే వ్యక్తులు భూమి తమదంటూ ప్రతిసారి గొడవలకు దిగుతున్నారు. దీనిపై పలు పర్యాయాలు గొడవలు పడి, పోలీస్ స్టేషన్‌కు, రెవెన్యూ కార్యాలయానికి తిరిగారు. అనంతరం భూమి రామకృష్ణ, బాలకృష్ణ కుటుంబీకులదేనని రెవెన్యూ అధికారుల విచారణలో తేల్చారు. దీంతో గొడవలు కొంతవరకు సద్దుమణిగాయి.
రగిలిన పాత కక్షలు
ఇటీవల రామకృష్ణను వైఎస్సార్ సీపీ బలివే గ్రామ పార్టీ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. దీంతో నివురుగప్పిన నిప్పులా ఉన్న పాత కక్షలు మళ్లీ రగులు కోవడం మొదలయ్యాయి. కొద్ది రోజుల క్రితమే రామకృష్ణ గుండె సంబంధిత చికిత్స చేయించుకున్నాడు. అతనిపై దాడి చేస్తే, బలహీన పడిపోతారనే ఆలోచనతో శుక్రవారం సాయంత్రం పొలంలోకి వెళ్లిన రామకృష్ణపై సుబ్బారావు, ప్రతాప్ ఇరువురు కలసి చాకు, కత్తితో పోడిచారు. తీవ్రగాయాలపాలైన రామకృష్ణను అతని సోదరుడు బాలకృష్ణ హుటాహుటీన నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నారు. నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఏరియా ఆస్పత్రికి వెళ్లి రామకృష్ణను పరామర్శించారు. రాజకీయ కక్షలతో దాడికి పాల్పడం విడ్డూరంగా ఉందని, ఇది సహించరాని విషయమని అన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు మూల్పూరి నాగవల్లేశ్వరరావు, జెడ్పీటీసి డా.వరికూటి ప్రతాప్, మాజీ కౌన్సిలర్ కంచర్ల లవకుమార్ మాజీ ఎమ్మెల్యే వెంట ఉన్నారు.


