జాతీయస్థాయి నాటక పోటీలు ప్రారంభం
వీరవాసరం : తోలేరులో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 21వ జాతీయస్థాయి నాటికల పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నాటక రంగం ద్వారా ఎన్నో సామాజిక రుగ్మతలను రూపుమాపడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఇతోధికంగా నాటక రంగానికి సహాయ, సహకారాలు అందించాలని కోరారు. ముందుగా శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం సంఘ సేవకులు భీమవరం హాస్పటల్ ఎండీ గాదిరాజు గోపాలరాజును ఘనంగా సత్కరించారు. కళావేదికపై మొదటి ప్రదర్శనగా చెరుకూరి సాంబశివరావు రచన, దర్శకత్వంలో ఉషోదయ కళానికేతన్ కట్రపాడు వారి ‘మంచి మనసులు’ నాటిక ప్రదర్శనమైంది. రెండవ ప్రదర్శనగా మద్దుకూరి రవీంద్రబాబు రచన, దర్శకత్వంలో మద్దుకూరి ఆర్ట్స్ థియేటర్స్ చిలకలూరిపేట వారి ‘మా ఇంట్లో మహాభారతం’ నాటిక ప్రదర్శనమైంది. పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు విచ్చేసి నాటిక ప్రదర్శనను ఆసాంతం తిలకించారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు చవ్వాకుల సత్యనారాయణ మూర్తి, పోలిశెట్టి సత్యనారాయణ, బుద్దాల వెంకట రామారావు, దాయన సురేష్ చంద్రాజి, రాయప్రోలు భగవాన్, గుండా రామకృష్ణ, జవ్వాది దాశరథి శ్రీనివాస్, కట్రెడ్డి సత్యనారాయణ, మానాపురం సత్యనారాయణ, మురళీకృష్ణశర్మ తదితరులు పాల్గొన్నారు.


