డొక్కు బస్సులే దిక్కు
7 నెలల్లో 14 ప్రమాదాలు, 6 మరణాలు
ఆర్టీసీ బస్సులకు జరుగుతున్న ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నాం. ఆర్టీసీ డ్రైవర్లకు తరచూ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గ్యారేజ్ సిబ్బందికి కీలక సూచనలిస్తున్నాం. ఆర్టీసీ బస్సుల కాలపరిమితి 15 సంవత్సరాలు ఉంటుంది. 15 సంవత్సరాల కాలపరిమితి దాటిన ఏ ఒక్క బస్సునూ అదనంగా ఒక్క రోజు కూడా తిప్పడం లేదు. ప్రమాదాలు జరగడం విచారకరం. లోపాలను సరి చేసుకుని ప్రయాణికులకు సురక్షిత ప్రయాణం అందించడమే లక్ష్యంగా చర్యలు చేపడతాం.
– షేక్ షబ్నం, ఏలూరు జిల్లా ప్రజా రవాణా అధికారి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆర్టీసీ ప్రయాణం సురక్షితం, సుఖవంతం అనే నినాదంతో ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికులను ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా ఆకర్షించి సత్ఫలితాలు రాబట్టింది. అయితే ఇటీవల ఆర్టీసీ బస్సుల నిర్వహణను గాలికొదిలేయడంతో తరచూ ప్రమాదాల బారిన పడుతున్నాయి. కొన్ని ప్రమాదాల్లో ప్రయాణికులు మరణం అంచుల వరకూ వెళ్లి బతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకున్న సంఘటనలు ఉన్నాయి. నల్లటి పొగను వదులుతూ వాతావరణ కాలుష్యానికి కారణంగా నిలుస్తున్న బస్సులు కొన్ని కాగా.. గేర్లు పని చేయక, బ్రేకులు పడక చెట్లను, విద్యుత్ స్తంభాలను ఢీకొట్టిన బస్సులు ఉంటున్నాయి. ఇటీవల సీ్త్ర శక్తి పథకాన్ని ప్రవేశ పెట్టి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసిన నాటి నుంచి బస్సుల నిర్వహణ మరింతగా దిగజారిందని పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఏలూరు నుంచి చింతలపూడి, ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్ళే మార్గంలో తిప్పుతున్న ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులు తరచూ ఆగిపోయి ప్రయాణికుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. బస్సు దిగి కొంత దూరం తోస్తేగానీ ఇంజన్ స్టార్ట్ అవ్వని సంఘటనలు కోకొల్లలు. ఈ రోడ్లలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడం, వాటిని పూడ్చే చర్యలు కూడా చేపట్టకపోవడమే ఈ ప్రమాదాలకు కారణంగా చెబుతున్నారు. ఈ నెల 6వ తేదీన లింగపాలెం వద్ద ఒక పల్లెవెలుగు బస్సు అదుపు తప్పి రహదారి పక్క తుప్పల్లోకి వెళ్ళిపోయింది. ఈ నెల 22న ద్వారకాతిరుమల మండలం సూర్యచంద్రరావు పేట వద్ద మరో పల్లెవెలుగు బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న తోటలోకి దూసుకుపోయి కొబ్బరి చెట్టును ఢీకొని నిలిచిపోయింది. ఆర్టీసీ బస్సుల నిర్వహణ లోపాలకు ఇలాంటి ఉదాహరణలు కొన్ని మాత్రమే. ఆయా ప్రమాదాల్లో ప్రయాణికుల ప్రాణాలకు త్రుటిలో ముప్పు తప్పినా ఆర్టీసీ బస్సు ఎక్కితే సురక్షితంగా గమ్య స్థానాలకు వెళ్తామా లేదా అనే సందేహాలకు మాత్రం తావిస్తోంది.
15 లక్షల కిలోమీటర్లు తిరిగినా అవే దిక్కు
ఏలూరు జిల్లాలో తిరిగే ఆర్టీసీ బస్సుల్లో ఎక్కువ శాతం అత్యధిక కిలోమీటర్లు తిరిగినవే. పెద్ద సిటీల్లో సిటీ బస్సులుగా తిరిగిన బస్సులను ఇక్కడకు తరలిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటిలో 15 లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగిన సూపర్ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్ తదితర బస్సులను జిల్లాలో తిప్పుతున్నారని అంటున్నారు. ఏలూరు జిల్లాలో ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు డిపోల పరిధిలో మొత్తం 224 ఆర్టీసీ బస్సులు, మరో 83 అద్దె బస్సులను తిప్పుతున్నారు. ఆర్టీసీ తిప్పుతున్న 224 బస్సుల్లో ఎక్కువ శాతం డొక్కు బస్సులే ఉన్నాయి. ఉన్న బస్సుల్లో దాదాపు మూడింట రెండు వంతుల బస్సులు డొక్కువే. ఈ బస్సుల్లో 15 నుంచి 20 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులు 73, 10 లక్షల నుంచి 15 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులు 66 ఉన్నాయి. సాధారణంగా ఏడాదికి లక్ష కిలోమీటర్లు తిరిగే ఆర్టీసీ బస్సుల జీవన ప్రమాణం కేవలం 15 సంవత్సరాలకే పరిమితం.
ఆర్టీసీ బస్సులతో ప్రయాణికులకు తంటాలు
మధ్యలోనే ఆగిపోవడంతో ఇక్కట్లు
15 లక్షల కిలోమీటర్లు తిరిగినా వాటినే తిప్పుతున్న వైనం
7 నెలల్లో 14 ప్రమాదాలు, 6 మరణాలు
2025–26 ఆర్థిక సంవత్సరంలో గత ఏప్రిల్ నుంచి అక్టోబర్ నెలాఖరు వరకూ ఏలూరు జిల్లాకు చెందిన ఆర్టీసీ బస్సులకు మొత్తం 14 ప్రమాదాలు జరిగాయి. వీటిలో 6 ఘోర ప్రమాదాలు కాగా మరో నాలుగు భారీ ప్రమాదాలు, గత ఏడు నెలల్లో జరిగిన ఈ 6 ఘోర ప్రమాదాల్లో ఆరుగురు మృత్యువాత పడ్డారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. బస్సులకు ఎంతగా నిర్వహణ చేపట్టినా సుమారు 15 లక్షలకు పైగా కిలోమీటర్లు తిరిగిన బస్సులు కావడంతోనే ప్రమాదాలకు గురవుతున్నాయని, ఆయా ప్రమాదాలకు ఆర్టీసీ డ్రైవర్లనో, గ్యారేజ్ సిబ్బందినో తప్పుపట్టలేమంటున్నారు. జిల్లాలో 1 నుంచి 5 లక్షల లోపు కిలోమీటర్లు తిరిగిన బస్సులు కేవలం 42, 5 నుంచి 10 లక్షల కిలోమీటర్ల మధ్యన తిరిగిన బస్సులు మరో 43 మాత్రమే ఉన్నాయి. జిల్లాలో తిప్పుతున్న ఆర్టీసీ బస్సుల్లో కొద్దిగా కొత్తవి కేవలం 42 మాత్రమే ఉండడం విచారకరమంటున్నారు.
డొక్కు బస్సులే దిక్కు


