22ఏ భూముల పరిష్కారానికి మెగా క్యాంపు
ఏలూరు(మెట్రో): జిల్లాలో 22ఏ భూ సమస్యల పరిష్కారానికి డిసెంబర్ 15వ లోగా ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు మెగా క్యాంపు నిర్వహించాలని, జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశపు హాలులో బుధవారం జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు, 22 ఏ కేసులు, గృహ నిర్మాణం తదితర అంశాలపై సమీక్షించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడూతూ 22 ఏ కింద నమోదైన భూములలో జిరాయితీ భూములు ఉండడంతో సదరు భూ యజమానులు తమ భూములు అమ్ముకునేందుకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వీటికి శాశ్వత పరిష్కారం అందించేలా ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి అన్ని జిల్లాలోనూ 22 ఏ కింద పొరపాటుగా నమోదైన భూములను సదరు జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రులను ఆదేశించారన్నారు.ఈ కార్యక్రమంపై గ్రామ స్థాయిలో ప్రజలందరికీ తెలిసేలా విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.
రాష్ట్రంలో ఇంతవరకు 50.86 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని, గత సంవత్సరం కన్నా 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇంతవరకు అధికంగా సేకరించామన్నారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో ధాన్యం తడిచిపోకుండా ప్రతి రైతు సేవా కేంద్రం వద్ద టార్పాలిన్లు సిద్ధంగా ఉంచామని, వాటిని రైతులకు ఉచితంగా అందిస్తామన్నారు. ఎరువులు కొరతపై వ్యవసాయాధికారులు ప్రతి వారం సంబంధిత శాసనసభ్యులతో చర్చించాలని, ఎక్కడైనా సాగులో రైతులు సమస్యలు ఎదుర్కొంటే తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
రోడ్లు మరమ్మతులు చేయాలి
రోడ్లు గుంతలు లేకుండా చూడాలని, ఏలూరు నుంచి ఆశ్రం ఆసుపత్రికి వెళ్లే రహదారిలో వెంటనే మరమ్మతులు చేసి, స్ట్రీట్ లైట్లు ఏర్పాటుచేయాలన్నారు. వచ్చే మార్చి నాటికి పురోగతిలో ఉన్న 38 వేల గృహాలను పూర్తిచేసి లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్న పేదల ఇళ్ల కాలనీలకు విద్యుత్, నీరు, రహదారి సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో రైతులకు యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. సమావేశంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి, జెడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్, పత్సమట్ల ధర్మరాజు, చిర్రి బాలరాజు, కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ తదితరులు పాల్గొన్నారు. అలాగే కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో బుధవారం భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల


