కొల్లేరు ప్రజల సమస్యలు పరిష్కరించాలి
ఏలూరు (టూటౌన్): కొల్లేరు ప్రజల సమస్యల పరిష్కారానికి కొల్లేరును 3వ కాంటూరుకు కుదించాలని, ఎకో సెన్సిటివ్ జోన్, చిత్తడి నేలల పరిరక్షణ పేరుతో 10వ కాంటూరుకు పెంచరాదని, కొల్లేరు ప్రజలు, రైతులు జీవించే హక్కు కాపాడాలని రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వక్తలు డిమాండ్ చేశారు. బుధవారం ఏలూరు కెనాల్ రోడ్డులోని యుటీఎఫ్ జిల్లా కార్యాలయంలో కొల్లేరు ప్రజలు, రైతుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఎ.రవి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బి.బలరాం మాట్లాడుతూ 120 జీవో కొల్లేరు ప్రజల జీవితాలను నాశనం చేసిందని, కొల్లేరును 3వ కాంటూరుకు కుదిస్తామని ఎన్నికల సందర్భంగా ఓట్ల కోసం హామీలు ఇచ్చే రాజకీయ పార్టీలు గట్టు చేరాక బోడి మల్లన్న చందంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కొల్లేరులో 46 బెడ్ గ్రామాలు, 74 బెల్ట్ గ్రామాలలో మూడు లక్షల మంది మత్స్యకారులు, దళితులు ఉన్నారని తెలిపారు. 146 సొసైటీలు ఏర్పాటు చేసి 7,100 ఎకరాలలో చేపల చెరువులు తవ్వకపోతే ఊరుకోమని ఆనాటి వెంగళరావు ప్రభుత్వం ఒత్తిడి చేస్తే ఇప్పటి ప్రభుత్వాలు మీరు చేపల చెరువులే కాదు వ్యవసాయం కూడా చేయకూడని ఆంక్షలు విధిస్తోందన్నారు. కొల్లేరు ప్రజలకు జీవనోపాధి కల్పించాలని, 146 సొసైటీలు పునరుద్ధరణ చేయాలని, 14,800 ఎకరాలు జిరాయితీ భూమి హక్కుదార్లకు అప్పగించాలని కోరారు. ఎకో సెన్సిటివ్ జోన్, చిత్తడి నేలల పరిరక్షణ పేరుతో 10వ కాంటూరుకు విస్తరించరాదని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు ఎం.ఎస్.ఎస్.గంగాధర్, ఎం.కొండలరావు, జి.పార్ధసారథి, జి.ఖ్యాతి పుష్పశ్రీ, ఎ.కాశీరాజు తదితరులు మాట్లాడారు.


