శుభకరా.. సుబ్రహ్మణ్యేశ్వరా
● భక్తిశ్రద్ధలతో షష్ఠి తిరునాళ్లు
● అత్తిలి, కై కరంలో పోటెత్తిన భక్తులు
● ఆలయాల్లో ప్రత్యేక పూజలు
అత్తిలి: షష్ఠి తిరునాళ్ల భక్తి శ్రద్ధలతో జరిగాయి. వేకువజామునుంచే భక్తులు సుబ్రహ్మణ్యేశ్వరుని దర్శించుకునేందుకు ఆలయాల వద్ద పోటెత్తారు. పుట్టలో పాలు పోసి స్వామివారిని దర్శించుకున్నారు. అత్తిలి శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి షష్ఠి మహోత్సవం బుధవారం కనులపండువగా జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఉచిత దర్శనంతోపాటు ప్రత్యేక దర్శన కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలోగల శ్రీనాగేంద్రుని సర్పానికి మహిళలు పూజలు చేశారు. స్వామివారి ఆశీస్సులతో సంతానం కలిగిన దంపతులు తమ చిన్నారుల శిరస్సుపై నుంచి బూరెలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. ఎస్వీఎస్‌ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడాప్రాంగణంలో షష్ఠి ఉత్సవాలకు హాజరైన వేలాది మంది భక్తులకు అన్నదానం చేశారు. శ్రీసత్యసాయి సేవా సమితి సభ్యులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు సేవలందించారు. ఆలయ ప్రాంగణంలో శ్రీవేణుగోపాల కోలాట మండలి, శ్రీవీరవినాయక విఠల్ కోలాట భజన మండలి వారిచే నిర్వహించిన కోలాట భజనలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తణుకు రూరల్ సీఐ బి కృష్ణకుమార్ ఆధ్వర్యంలో అత్తిలి ఎస్సై పి ప్రేమరాజు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తిరునాళ్లలో ఏర్పాటు చేసిన జెయింట్‌వీల్స్, కొలంబస్‌ల వద్ద సందడి నెలకొంది. పలు దుకాణాల వద్ద వస్తుసామాగ్రిని కొనుగోలు చేసేందుకు మహిళలు బారులు తీరారు. ఉత్సవాల్లో మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చిన్నారులకు, భక్తులకు పాలు, తాగునీరు అందజేశారు.
వైభవంగా కై కరం షష్ఠి తిరునాళ్లు
ఉంగుటూరు: కై కరం నాగమ్మ తల్లి షష్ఠి తిరునాళ్లు వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం వేకువ జాము కల్యాణం అనంతరం భక్తులు నాగమ్మ తల్లిని దర్శించుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు నాగమ్మకు పాలు పోసి పూజలు చేశారు. భక్తులు నాగమ్మ తల్లి దర్శనం అనంతరం షష్ఠి తిరునాళ్లలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎస్సై సూర్య భగవాన్ పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. తహసీల్దార్ ప్రసాద్ ఏర్పాట్లు పర్యవేక్షించారు.
శ్రీవారి క్షేత్రంలో అట్టహాసంగా వేడుక
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి ఉపాలయమైన చెరువు వీధిలోని శ్రీ వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కల్యాణ మహోత్సవం బుధవారం రాత్రి నేత్రపర్వంగా జరిగింది. ఆలయ ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తి దంపతులు అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయ అర్చకులు, పండితులు శైవాగమం ప్రకారం కల్యాణ తంతును ప్రారంభించారు. సుముహూర్త సమయంలో నూతన వధూవరుల శిరస్సులపై జీలకర్ర, బెల్లం ధరింపజేశారు. ఆ తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, సుబ్రహ్మణ్యేశ్వరుని నామస్మరణల నడుమ మాంగల్యధారణ, తలంబ్రాల వేడుకలు వైభవోపేతంగా జరిగాయి. కల్యాణ మహోత్సవం అనంతరం స్వామి, అమ్మవార్లను పల్లకీ వాహనంలో క్షేత్ర పురవీధుల్లో ఊరేగించారు.
శుభకరా.. సుబ్రహ్మణ్యేశ్వరా
శుభకరా.. సుబ్రహ్మణ్యేశ్వరా
శుభకరా.. సుబ్రహ్మణ్యేశ్వరా
శుభకరా.. సుబ్రహ్మణ్యేశ్వరా


