గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్
జంగారెడ్డిగూడెం: ఒరిస్సా నుంచి గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. జంగారెడ్డిగూడెంలోని జాతీయ ప్రధాన రహదారిపై బుధవారం సీఐ ఎంవీ సుభాష్ ఆధ్వర్యంలో ఎస్సై ఎన్‌వీ ప్రసాద్, సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో జంగారెడ్డిగూడెంకు చెందిన వీపు వెంకటేష్, తూంపాటి జీవరత్నం మోటార్‌సైకిల్‌పై అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో పోలీసులు వారి మోటార్‌సైకిల్‌ను తనిఖీ చేయగా, వారి వద్ద మూడు గంజాయి ప్యాకెట్లు లభించాయి. దీంతో వారిని విచారించగా, ఒరిస్సా నుంచి వీటిని తీసుకువస్తున్నట్లు చెప్పారు. కాగా గంజాయి ప్యాకెట్లలో ఒకటి 1.420 కేజీలు ఉండగా, మరో రెండు ప్యాకెట్లు 105 గ్రాముల చొప్పున ఉన్నాయి. మొత్తం 1.630 కేజీల గంజాయిని పట్టుకుని, వాహనాన్ని సీజ్ చేసి, ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు సీఐ సుభాష్ చెప్పారు.
నూజివీడు: నూజివీడు ట్రిపుల్‌ఐటీకి చెందిన ఇంజినీరింగ్ తృతీయ, ఆఖరి సంవత్సర విద్యార్థులు నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్ లెర్నింగ్ (ఎన్‌పీటీఈఎల్) పరీక్షల్లో 97.5 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ బుధవారం తెలిపారు. వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు 140 ఎన్‌పీటీఈఎల్ కోర్సులను ఎంపిక చేసుకున్నారన్నారు. విద్యార్థులు ఈ కోర్సుల్లో ప్రతిభను కనబరిచి మంచి ఉత్తీర్ణతా శాతాన్ని సాధించినట్లు వివరించారు. నాలుగు ట్రిపుల్‌ఐటీలు కలిపి 10,113 మంది విద్యార్థులు ఎన్‌పీటీఈఎల్ సర్టిఫికెట్లు పొందగా నూజివీడు ట్రిపుల్‌ఐటీకి చెందిన 2,473 మంది విద్యార్థులు సర్టిఫికెట్లు పొందారని పేర్కొన్నారు. ఎన్‌పీటీఈఎల్ కోర్సులను ఐఐటీలు, ఐఐఎస్సీ లాంటి దేశవాళీ ప్రతిష్టాత్మక విద్యా సంస్థల భాగస్వామ్యంతో, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
ఏలూరు (టూటౌన్): రేషన్ షాపుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు వాటికి అవసరమైన నెట్, కలెక్టరేట్‌కు డేటా అనుసంధానం వంటి విషయాల్లో అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాలని రేషన్ డీలర్ల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తలారి రామకృష్ణ కోరారు. జిల్లా కలెక్టరేట్‌లో బుధవారం పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహార్‌కు ఈ మేరకు యూనియన్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. తామే సొంత ఖర్చుతో సీసీ కెమెరాలను కొనుగోలు చేసినా, దానికి అవసరమయ్యే ఇంటర్నెట్, కలెక్టరేట్‌కు అనుసంధానం వ్యవహారం వ్యయప్రయాసలకు సంబంధించిన విషయం అని, కావున ఈ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. కార్యక్రమంలో వివిధ డివిజన్ల నేతలు బి ప్రసాద్ రాజు, సిపాని రాజశేఖర్, కేఎన్‌వీ ప్రసాద్, జయరాజు, పి.శివరామకృష్ణ, రవికుమార్, వేము ఆరోగ్యం, బి నాగు, కే కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
నరసాపురం: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మృతితో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయిందని ఏఐసీసీ రాష్ట్ర కో–ఆర్డినేటర్, పంజాబ్ మాజీ ఎంపీ జస్వీర్‌సింగ్ దింపా అన్నారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం దిశగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా బుధవారం నరసాపురంలో ఆయన పర్యటించారు. స్థానిక సన్‌రైజ్ హోటల్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశంలో మోదీ మోసాలతో కూడిన పాలన సాగుతుందన్నారు. రాష్ట్రంలో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి పాలన కూడా ప్రజల విశ్వాసాన్ని క్రమంగా కోల్పోతుందని చెప్పారు.
గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్


