శ్రీవారి అంతరాలయ దర్శనానికి వేళాయే
ద్వారకాతిరుమల: శ్రీవారి అంతరాలయ దర్శనాన్ని గురువారం నుంచి పునఃప్రారంభిస్తున్నట్టు ఆలయ ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తి తెలిపారు. ఒక్కో టికెట్ ధర రూ. 500గా నిర్ణయించారు. ఒక టికెట్‌పై ఒక భక్తుడిని మాత్రమే అనుమతిస్తామని, టికెట్‌కి రెండు లడ్డూ ప్రసాదాలను అందజేస్తామని చెప్పారు. శని, ఆదివారాలు, ఇతర పర్వదినాల్లో అంతరాలయ దర్శనంతో పాటు, అంతరాలయం ముందు భాగం (అమ్మవార్ల ముందు) నుంచి దర్శనాన్ని నిలుపుదల చేసి, బయట నుంచే దర్శన సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. ఇదిలా ఉంటే ఆలయ సిబ్బంది బుధవారం రాత్రి అంతరాలయం ముందు భాగంలో చెక్కల ర్యాంపును అమర్చారు.
మళ్లీ ఐదేళ్ల తరువాత..
సామాన్య భక్తులకు శ్రీవారి అంతరాలయ దర్శనం లభించి ఐదేళ్లయ్యింది. కరోనా మహమ్మారి కారణంగా స్వామివారిని దగ్గర నుంచి దర్శించుకునే భాగ్యాన్ని భక్తులు కోల్పోయారు. కరోనా నిర్మూలన అనంతరం ఇతర దేవాలయాల్లో అంతరాలయ దర్శనం పునఃప్రారంభం అయినప్పటికీ.. ఈ ఆలయంలో మాత్రం ప్రారంభం కాలేదు. దాంతో భక్తులు ఫోన్ల ద్వారా, అలాగే నేరుగా అధికారులకు విజ్ఞప్తులు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఏలూరుకు చెందిన ఆధ్యాత్మిక వేత్త అయ్యంగార్ ఫిర్యాదు, సాక్షి కథనాలపై అధికారులు స్పందించి, అంతరాలయ దర్శనాన్ని, అమ్మవార్ల ముందు నుంచి శ్రీవారిని దగ్గరగా దర్శనం చేసుకునే సౌకర్యాన్ని పునఃప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. దీనిపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నేటి నుంచి అంతరాలయ దర్శనం పునఃప్రారంభం


