పోక్సో కేసుల్లో నిందితుడి అరెస్ట్
ఏలూరు టౌన్: రెండు వేర్వేరు పోక్సో కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తిని ఏలూరు పోలీసులు మహారాష్ట్రలో పట్టుకున్నారు. వివరాల ప్రకారం కృష్ణాజిల్లా గూడూరు మండలం పోలవరం గ్రామానికి చెందిన మువ్వల వెంకటేశ్వరరావు(33)పై ఏలూరు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో రెండు వేర్వేరు పోక్సో కేసులు నమోదయ్యాయి. అయితే అతడు గత రెండు, మూడేళ్లుగా పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నాడు. న్యాయస్థానం అతడిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్‌కుమార్ ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేశారు. పోలీస్ సిబ్బంది విజయరాజు, విజయకుమార్, రాజేష్ బృందం నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టింది. నిందితుడు వెంకటేశ్వరరావు మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో చికల్టన్ గ్రామం సమీపంలో ఉజ్జనీ డ్యామ్ పరిసరాల్లో చేపలవేట చేసుకుంటూ జీవిస్తున్నట్లు గుర్తించారు. ఈనెల 25న అతడ్ని అదుపులోకి తీసుకుని ఏలూరు తీసుకువచ్చారు. బుధవారం న్యాయస్థానం ఎదుట హాజరుపరిచినట్లు ఏలూరు త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు తెలిపారు. నిందితుడు వెంకటేశ్వరరావును పట్టుకోవటంలో ప్రతిభ చూపిన పోలీస్ స్పెషల్ టీమ్ సిబ్బందిని ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.
ఏలూరు టౌన్: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఏలూరుకి చెందిన కంపని సత్యనారాయణ (మెగా బాబీ)ని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వలంటీర్స్ విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. తనపై విశ్వాసంతో పదవి ఇచ్చిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాలను పాటిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన అన్నారు.


