హెల్పింగ్ హ్యాండ్స్‌పై నిరసన
● ట్రిపుల్ ఐటీలో అరకొరగా గుడ్లు, చికెన్ సరఫరా
● విద్యార్థుల్లో నిరసన గళం
నూజివీడు: ట్రిపుల్ ఐటీలో చదువుకుంటున్న పేద విద్యార్థులను ఆదుకునేందుకు విద్యార్థులంతా కలిసి 2009వ సంవత్సరంలో ఏర్పాటు చేసిన ‘హెల్పింగ్ హ్యాండ్స్’ స్వచ్ఛంద సంస్థపై నిరసన గళం వినిపిస్తోంది. విద్యార్థులు తమకు తోచినంత ఇవ్వడం, అలా వచ్చిన సొమ్మును పేద విద్యార్థుల ఆసుపత్రి ఖర్చులకు, ఉన్నత చదువులకు ఖర్చు చేస్తూ ముందుకు సాగిన ఈ సంస్థకు కోడిగుడ్లు, చికెన్ పెట్టే బాధ్యతను ఇస్తూ ఎప్పుడైతే గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుందో దాని ముసుగులో ఇరువురు మెంటార్లు రంగప్రవేశం చేశారో అప్పటి నుంచి సంస్థ ప్రాభవం కోల్పోతోంది.
బిల్లులు చెల్లించే స్థోమతే లేదు
నూజివీడు ట్రిపుల్‌ఐటీకి చెందిన ఆరేళ్లకు కలిపి 6,524 మంది విద్యార్థులు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు చెందిన పీయూసీ ప్రథమ సంవత్సర విద్యార్థులు 2,355 మంది కలిపి మొత్తం 8,879 మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికి భోజనాలు పెట్టే బాధ్యతను ఈ ఏడాది అక్టోబర్ ఆరో తేదీ నుంచి హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్‌కు అప్పగించారు. అయితే ఈ ఫౌండేషన్ తాము శాఖాహారం మాత్రమే పెడతామని కండీషన్ పెట్టడంతో ఒక్కొక్క విద్యార్థికి రోజుకు రూ.110 ఇచ్చేలా ఒప్పందం జరిగింది. అయితే గుడ్లు, చికెన్‌ను ట్రిపుల్ ఐటీలోనే విద్యార్థులు ఏర్పాటు చేసుకుని నడుపుకుంటున్న హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థకు ఇచ్చి దీనికి గాను వారానికి ఒక్కొక్క విద్యార్ధికి రూ. 46.83 పైసలను ఇవ్వాలని ఆర్జీయూకేటీ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయించింది. దీని ప్రకారం ఒక రోజు కోడిగుడ్డు ఇవ్వాలన్నా రూ.50 వేలు అవసరమవుతాయి. ఆదివారం వస్తే చికెన్‌కు కనీసం రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టాలి. ట్రిపుల్ ఐటీ బిల్లులు చెల్లించే వరకు లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టే స్థోమత హెల్పింగ్‌హ్యాండ్స్ సంస్థకు ఉందా అనేది కూడా ఆలోచించనే లేదు.
నాలుగు రోజులే పెడుతున్నారు
ట్రిపుల్ ఐటీ వారానికి హెల్పింగ్ హ్యాండ్స్‌కు రూ.46.83 పైసలను చెల్లిస్తుంది. 8,879 మంది విద్యార్థులు ఉండగా ప్రతిరోజూ కేవలం 6 వేల గుడ్లను మాత్రమే అందజేస్తున్నారు. దీంతో చివరలో భోజనానికి వచ్చే విద్యార్థులకు గుడ్లు అందడం లేదని ధర్నాలో విద్యార్థులే పేర్కొన్నారు. కోడిగుడ్లను విద్యార్థులకు వారానికి ఐదు రోజులు పెట్టాల్సి ఉండగా కేవలం నాలుగు రోజులు మాత్రమే అందిస్తున్నారు. అలాగే ఆదివారం నాడు ఒక్కొక్క విద్యార్థికి 150 గ్రాముల చికెన్‌ను పెట్టాల్సి ఉండగా అది కూడా అరకొరగానే పెడుతున్నారు. అలాగే చికెన్ ఒక్కొక్క విద్యార్థికి 150 గ్రాముల చొప్పున క్యాంపస్‌లో ఉన్న మొత్తం విద్యార్థులకు కలిపి 1,331 కిలోల చికెన్‌ను కొనుగోలు చేసి వండాల్సి ఉంది. అంత మొత్తంలో కొనుగోలు చేస్తున్న దాఖాలాలు లేవు. రెండోసారి గ్రేవీ అడిగినా వేయడం లేదు. దీంతో విద్యార్థులకు ఓపిక నశించి రోడ్డెక్కారు.
విద్యార్థుల ఆవేదన
ట్రిపుల్ ఐటీలోని విద్యార్థులకు గుడ్లు, చికెన్ పెట్టే బాధ్యతను హెల్పింగ్‌హ్యాండ్స్‌కు యూనివర్సిటీ అప్పగించిందనేది ఉత్తర్వుల వరకు మాత్రమేనని, నిర్వహించేదంతా ఇరువురు మెంటార్లేననేది ట్రిపుల్ ఐటీలో ప్రతి ఒక్కరికీ తెలిసిన వాస్తవం. హెల్పింగ్ హ్యాండ్స్‌లో సభ్యులుగా ఉన్న విద్యార్థులు సైతం కోడిగుడ్లు, చికెన్ పెట్టడం రిస్క్‌గా భావించి వారందరూ ఈ వ్యవహారానికి దూరంగా ఉంటూ వారి చదువేదో వారు చదువుకుంటుండగా ఇరువురు మెంటార్లు మాత్రం తనకు మాలిన ధర్మాన్ని నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారుల హడావుడి నిర్ణయాల వల్ల తాము ఏ లక్ష్యంతో అయితే హెల్పింగ్‌హ్యాండ్స్‌ను ఏర్పాటు చేసుకున్నామో దానికి భిన్నంగా ముందుకు సాగడంపై అంతర్మథనం చెందుతున్నారు. హెల్పింగ్‌హ్యాండ్స్ సంస్థ అధ్యక్షుడు సైతం తన పదవికి రాజీనామా చేయగా ఇంత వరకు దానికి తిరిగి కొత్త అధ్యక్షుడిని నియమించుకోలేదని విద్యార్థులు చర్చించుకుంటున్నారు. కోడిగుడ్లు, చికెన్ కొనుగోలు చేయడానికి అవసరమైన ప్రతి రూపాయిని హెల్పింగ్‌హ్యాండ్స్ ఎక్కౌంట్ నుంచి డ్రా చేయాల్సి ఉంటుంది. అయితే అలా డ్రా చేస్తున్నారా, లేదా అనేది అనుమానమే.


