రొయ్య పిల్లా.. సిద్ధం చేయండిలా.. | - | Sakshi
Sakshi News home page

రొయ్య పిల్లా.. సిద్ధం చేయండిలా..

Jul 3 2025 11:03 PM | Updated on Jul 3 2025 11:03 PM

రొయ్య

రొయ్య పిల్లా.. సిద్ధం చేయండిలా..

కై కలూరు: రొయ్యల సాగును పసిబిడ్డను అమ్మ జాగ్రత్తగా సాకిన విధానంతో పోల్చుతారు. హేచరీలో రొయ్య విత్తనం కొనుగోలు నుంచి తిరిగి చెరువులో రొయ్య పిల్లలను వదలడం ఎంతో కీలకమైన ప్రక్రియ. పెనాయిస్‌ మోనోడాన్‌ (టైగర్‌ రొయ్యలు), లటోపెనియస్‌ వన్నామీ (వైట్‌ లెగ్‌ పసిఫిక్‌ రొయ్యలు) వంటి జాతుల పెంపకం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యమైన రొయ్యల పరిశ్రమగా ఏపీ గుర్తింపు పొందింది. నాలుగు గోడల మధ్య తయారీ చేసిన రొయ్య విత్తనాలను ఆరుబయట చెరువుల్లో విడుదల చేస్తున్నప్పుడు యాజమాన్య పద్ధతులు పాటించకపోవడంతో రొయ్య పిల్లలు మరణించి, రైతులకు నష్టాన్ని మిగుల్చుతున్నాయి.

రాష్ట్రంలో 5.75 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆక్వా సాగు చేస్తున్నారు. వీరిలో రొయ్యల సాగు రైతులు 1.5 లక్షలు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 2.90 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతుండగా వీటిలో రొయ్యల సాగు 1.10 లక్షల ఎకరాల్లో సాగువుతోంది. ఉమ్మడి జిల్లాలో ఆక్వారంగం నుంచి వార్షిక ఉత్పత్తి 4 లక్షల టన్నులు ఉండగా, వార్షిక టర్నోవర్‌ రూ.18 వేల కోట్లుగా నమోదవుతోంది. రాష్ట్రంలో రెండు నెలల వ్యవధిలో సుమారు రూ.60 కోట్ల విలువైన రొయ్యలు చనిపోయాయి. రొయ్యల సాగులో ప్రధానంగా ఎంటెరోసైటటోజాన్‌ హెపాటోపెనాయ్‌(ఈహెచ్‌పీ), రన్నింగ్‌ మోర్టాలిటీ సిండ్రోమ్‌(ఆర్‌ఎంఎస్‌), వైట్‌ స్పాట్‌ సిండ్రోమ్‌ వైరస్‌(డబ్ల్యూఎస్‌ఎస్‌వీ), లూస్‌ షెల్‌ సిండ్రోమ్‌(ఎల్‌ఎస్‌ఎస్‌) వ్యాధుల వల్ల రూ.కోట్లలో రైతులు నష్టాల బారిన పడుతోన్నారు.

ఎక్లిమైటెజేషన్‌ అంటే..

రొయ్యలు చెరువుల్లో సీడ్‌(రొయ్య విత్తనాలు)ను అలవాటు చేసే ప్రక్రియను ఎక్లిమైటెజేషన్‌ అంటారు. రొయ్యల ఆరోగ్యం చెరువు నీటి నాణ్యత, నిర్వహణ, వదిలే పిల్లల సంఖ్య, మేత నాణ్యత వంటి అంశాలపై ఆధారపడి ఉంటోంది. హేచరీలో రొయ్య విత్తనాలు అక్కడ ఉష్ణోగ్రత, సెలినిటీ(లవణీయత), పీహెచ్‌లకు అలవాటు పడి ఉంటాయి. వీటిని చెరువుల్లో వదిలే ముందు చెరువు నీటిలో ఉష్ణోగ్రత, పీహెచ్‌లకు తగ్గట్టుగా అలవాటు చేయాలి. హేచరీ నుంచి తెచ్చిన విత్తన సంచులను చెరువు నీటిలో అర్ధగంట కర్ర,తాడుతో కట్టివేయాలి. తర్వాత హేచరీ నుంచి తెచ్చిన సంచుల్లో స్థానిక చెరువు నీటిని నింపుతూ రెండు పర్యాయాలు చేయాలి. ఈ పక్రియ అనంతరం విత్తనాలను చెరువులో వదలాలి. ఇలా చేయకుండా అనేక మంది రైతులు నేరుగా రొయ్య విత్తనాలను చెరువులో వదలడం వల్ల ఉష్ణోగ్రతలకు అలవాటు పడక రొయ్య పిల్లలు మరణిస్తున్నాయి.

రొయ్యల రైతులు ఇలా చేయండి

● రొయ్య విత్తనాలను చెరువులో వదిలేటప్పుడు ఉష్టోగ్రత 28– 32 డిగ్రీల సెంటీగ్రేట్‌, పీహెచ్‌ 7.5–8.5, లవణీయత 15–35 పీపీటీ (స్థానిక పరిస్థితులను బట్టి), కరిగిన ఆక్సిజన్‌ 5 పీపీఎం కంటే ఎక్కువ ఉండాలి.

● రవాణా సమయంలో ఒత్తిడి తగ్గించడానికి రొయ్యల సీడ్‌ను శుభ్రమైన, ఆక్సిజన్‌ బ్యాగులు, సింటెక్స్‌ కంటైనర్లలో రవాణా చేయండి.

● ప్రతి 10–20 నిమిషాలకు 10–20 శాతం చొప్పున కంటైనర్‌, బ్యాగ్‌లలో చెరువు నీటిని కలపండి. ఇది రొయ్యలు క్రమంగా పీహెచ్‌, ఉష్టోగ్రత, లవణియతలో తేడాలకు అనుగుణంగా మారడానికి సహకరిస్తుంది.

● ఉష్ణోగ్రతను ట్రాక్‌ చేయడానికి ధర్మామీటర్‌, లవణీయత కోసం రిఫ్రాక్టోమీటర్‌, నీటి విలువల కోసం పీహెచ్‌ మీటర్‌ను ఉపయోగించండి.

● సీడ్‌ను ఒకేసారి డంప్‌ చేసే బదులు చెరువు వాతావరణానికి సమర్థవంతంగా అనుగుణంగా ఉండేలా, వాటిని కొంత వ్యవధిలో చిన్న బ్యాచ్‌లుగా విడుదల చేయటం మంచిది.

● చెరువు నీటి నాణ్యత, ఉష్ణోగ్రత, లవణీయత, ఆక్సిజన్‌ స్థాయిలో మార్పులు ఎప్పటికప్పుడు గమనించాలి. రికార్డు చేయాలి.

● ఒత్తిడిని తగ్గించడానికి తక్కువ సంఖ్యలో రొయ్యలు విడుదల చేయాలి.

● వాతావరణానికి బాగా సర్దుబాటు అవుతున్నాయని నిర్ధారించుకోడానికి కొన్ని రోజుల పాటు రొయ్యల ఆరోగ్యం, ప్రవర్తన నిశితంగా గమనించండి.

రొయ్యల సాగులో ఎక్లిమైటెజేషన్‌ ప్రక్రియ తప్పనిసరి

హేచరీ నుంచి రొయ్య విత్తనం సరఫరా కీలకం

నిర్లక్ష్యంతో నష్టాల బారిన పడుతున్న రైతులు

ఉమ్మడి జిల్లాలో 1.10 లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు

బతుకు రేటు 90 శాతం మంచిది

హేచరీ నుంచి చెరువులో రొయ్య పిల్లలు వేసే సమయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి. హోపా(విత్తనాల నిల్వ తొట్టె) బతుకుదలను 24 గంటలు కంటే 48 గంటల తర్వాత మాత్రమే తనిఖీ చేయాలి. సుమారు 200 విత్తనాలకు హోపాలో 180 విత్తనాలు జీవిస్తే అటువంటి వాటిని విడుదల చేయాలి. రొయ్య విత్తనాలను నేరుగా చెరువులో విడదల చేయకూడదు. పంట విజయానికి చెరువు నీటికి రొయ్య విత్తనాలను అలవాటు చేయడమే ఉత్తమ మార్గంగా రైతులు భావించాలి.

– డాక్టర్‌ పి.రామమోహనరావు,

మాజీ డెప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌, కాకినాడ

రొయ్య పిల్లా.. సిద్ధం చేయండిలా.. 1
1/2

రొయ్య పిల్లా.. సిద్ధం చేయండిలా..

రొయ్య పిల్లా.. సిద్ధం చేయండిలా.. 2
2/2

రొయ్య పిల్లా.. సిద్ధం చేయండిలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement