
6న ఉచితంగా రేబిస్ నిరోధక టీకాలు
భీమవరం: ఈనెల 6వ తేదీన జంతు సంక్రమణ వ్యాధి నిరోధక దినం (జూనోసిస్ డే) సందర్భంగా భీమవరంలోని ప్రాంతీయ పశువైద్యశాఖలో ఉదయం 9 గంటల నుంచి రేబిస్ వ్యాధి నిరోధక టీకాలు ఉచితంగా వేస్తామని పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పి సుధీర్‌బాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు ప్రధానంగా రేబిస్‌వ్యాధి సోకుతుందని, ఈ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని రైతులు, జంతుప్రేమికులు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ సుధీర్‌బాబు కోరారు.
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
పంట కాలువలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు
నరసాపురం రూరల్: ఓ ప్రైవేటు స్కూల్ బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన మొగల్తూరు మండలం రామన్నపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. నరసాపురం పట్టణానికి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు బుధవారం సాయంత్రం స్కూల్ నుంచి విద్యార్థులను ఇంటికి తీసుకెళ్లే సమయంలో మొగల్తూరు మండలం రామన్నపాలెం గ్రామంలో అదుపుతప్పి పక్కనే ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ సమయంలో బస్సులో ఉన్న 33 మంది విద్యార్థులు ఆర్తనాదాలు చేయడంతో అక్కడకు చేరుకున్న స్థానికులు స్పందించి పిల్లలను బస్సు నుంచి దించేశారు. ఈ ఘటనతో విద్యార్థులు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పలువురు స్థానికులు పేర్కొంటున్నారు.