
ఇలాగైతే విద్యారంగంనిర్వీర్యమే
భీమవరం : రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో విద్యా రంగం నిర్వీర్యమయ్యే ప్రమాదముందని విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పాఠశాలల పునర్నిర్మాణ ప్రక్రియ పేరుతో గందరగోళానికి తెర తీశారని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయం కారణంగా ప్రాథమిక విద్యపై తీవ్ర ప్రభావం పడుతుందని, మిగులు ఉపాధ్యాయులు పెరిగి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి భంగం కలుగుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం క్లస్టర్ విధానాన్ని తొలగించి మోడల్ స్కూల్ విధానం అమలు చేసేందుకు సిద్ధమైంది. పాఠశాలల పునర్మిర్మాణం పేరుతో కొత్త విధానానికి తెర తీసింది. తొమ్మిది రకాల పాఠశాలలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం చేపట్టిన తాజా చర్యలతో మిగులు ఉపాధ్యాయ పోస్టులు పెరిగి, ప్రాథమిక విద్యకు విఘాతం ఏర్పడుతుందని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం ప్రాథమికోన్నత(యూపీ) పాఠశాలలను ఎత్తివేయాలని భావించింది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలోను విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో జిల్లా స్థాయి అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో వెనకంజ వేసింది. యూపీ స్కూల్స్ యథావిధిగా కొనసాగించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లా వ్యాప్తంగా 20 మండలాల పరిధిలో ఇప్పటికే సుమారు 1,156 వరకు ఉపాధ్యాయలు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. జిల్లాలో దాదాపు 1,423 స్కూల్స్ ఉండగా వీటిలో దాదాపు 3,800 మంది ఉపాధ్యాయుల్ని బదిలీ చేయాల్సి ఉంటుంది.
ఉపాధ్యాయుల నియామకాలు ఇలా..
● ఫౌండేషన్ స్కూల్స్ (1–2వ తరగతి, 1–30 మంది విద్యార్థులకు 1 ఎస్జీటీ, 31–60 మంది విద్యార్థులకు ఇద్దరు ఎస్జీటీలు)
● ప్రైమరీ స్కూల్ (1 నుంచి 5వ తరగతి వరకు 20 మందికి ఒక ఎస్జీటీ, 60 మందికి ఇద్దరు ఎస్జీటీలు)
● మోడల్ ప్రైమరీ స్కూల్స్(1 నుంచి 5వ తరగతి వరకు 59 మంది విద్యార్థులకు ముగ్గురిని, 150 మంది విద్యార్థులకు 4 ఉపాధ్యాయులను నియమిస్తారు.
● అప్పర్ ప్రైమరీ స్కూల్స్‌లో 1–10 విద్యార్థుల వరకు స్కూల్ అసిస్టెంట్, 11 నుంచి 30 వరకు ఇద్దరు, 31 నుంచి 140 వరకు నలుగురు, 141 నుంచి 175 మంది విద్యార్థులకు ఐదుగురు స్కూల్ అసిస్టెంట్లను నియమిస్తారు.
పాఠశాలల పునర్నిర్మాణ ప్రక్రియపై ఉపాధ్యాయుల ఆగ్రహం
ఉద్యమం తప్పదు
రాష్ట్ర ప్రభుత్వం అనుచరిస్తున్న విధానాల వల్ల ప్రభుత్వ పాఠశాలలు మూతపడే ప్రమాదముంది. ప్రతి గ్రామంలో ఫౌండేషన్ స్కూల్ స్థానంలో 1 నుంచి 5వ తరగతి వరకు స్కూల్ ఉండాలి. ప్రతి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్యలో సంబంధం లేకుండా ఇద్దరు టీచర్స్ ఉండాలి. హైస్కూల్స్‌లో 45 మంది కంటే ఎక్కువ ఉంటే రెండో సెక్షన్ ఏర్పాటు చేయాలి. మా డిమాండ్ల పరిష్కరించకుంటే ఉద్యమం తప్పదు.
– జి.ప్రకాశం, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు, భీమవరం

ఇలాగైతే విద్యారంగంనిర్వీర్యమే