
డ్వారకా మహిళలకు తెలియకుండా రుణాలు
బుట్టాయగూడెం: తమకు తెలియకుండా తమ ఖాతాల్లో డ్వాక్రా రుణాల సొమ్ములు జమచేశారని, ఐదు నెలల తర్వాత తెలిసి ప్రశ్నిస్తే ఆ సొమ్ములకు వడ్డీ కట్టాలని బ్యాంకు అధికారులు అంటున్నారని మండలంలోని గాడిదబోరుకు చెందిన గిరిజన మహిళలు లబోదిబోమంటున్నారు. తమ ఖాతాల్లో సుమారు రూ.75 లక్షల వరకు సొమ్ములు జమయ్యా యని చెబుతున్నారు. డ్వాకా సంఘాల మహిళ టి. గంగాదేవి తెలిపిన వివరాల ప్రకారం.. గాడిదబోరుకు చెందిన ధనలక్ష్మి, మహాలక్ష్మి, ప్రియదర్శిని, ముత్యాలమ్మ, స్నేహలత, ప్రభ అనే ఆరు గ్రూపులకు రెడ్డిగణపవరంలోని ఓ బ్యాంకు 2021లో రూ.19 లక్షల చొప్పున డ్వాక్రా రుణాలు మంజూరు చేసింది. అప్పటినుంచి గ్రూపు సభ్యులు నెలవారీ వాయిదాలు చెల్లిస్తున్నారు. ఇంకా రూ.5 లక్షల వరకు బకాయిలు ఉండగా తాజాగా డ్వాక్రా మహిళలు బ్యాంకుకు వెళ్లి రుణాల లావాదేవీల స్టేట్‌మెంట్ తీయించారు. అయితే ఒక్కో ఖాతాలో రూ.19 లక్షల వరకు బకాయి ఉన్నట్టు తెలిసి మహిళలు కంగుతిన్నారు. దీనిపై బ్యాంకు అధికారులను ఆరా తీయగా ఐదు నెలల క్రితం ఒక్కో ఖాతాలో రూ.12.20 లక్షల రుణం జమైందని, వడ్డీతో కలిపి రూ.19 లక్షల వరకు అయ్యిందని చెప్పారు. కొత్త రుణం కోసం తామేమీ దరఖాస్తు చేయలేదని, దీనిపై తమకు బ్యాంకు నుంచి లేదా వెలుగు అధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేదని మహిళలు అంటున్నారు. ఒక్కో సంఘం రూ.78 వేలు వడ్డీ కింద కట్టాలని బ్యాంకు అధికారులు చెబుతున్నారని మహిళలు ఆవేదన చెందుతున్నారు. డ్వాక్రా మహిళలు శుక్ర వారం ఎంపీడీఓ కె.జ్యోతిని కలిసి సమస్యను తెలి యజేశారు. బ్యాంక్ మేనేజర్‌తో ఎంపీడీఓ జ్యోతి ఫోన్‌లో మాట్లాడగా తాను సెలవులో ఉన్నానని సోమవారం అన్ని విషయాలు చెప్తానని మేనేజర్ సమాధానమిచ్చారు. వడ్డీ రూపంలో బ్యాంక్ అధికారులు తమ కష్టాన్ని దోచుకుంటున్నారని విషయాన్ని సోమవారం కలెక్టర్ దృష్టికి తీసుకువెళతా మని మహిళా సంఘాల సభ్యులు అన్నారు.
ఖాతాల్లోకి రూ.75 లక్షల జమ!
5 నెలల తర్వాత తెలిసి కంగుతిన్న మహిళా సంఘాల సభ్యులు
వడ్డీ కట్టాలంటున్న అధికారులు