
‘ధాన్యంలో తేమ 17 శాతం ఉండాల్సిందే’
అత్తిలి: రైతులు పంట కోసిన వెంటనే తేమ తనిఖీ చేసి 17 శాతం ఉన్నప్పుడే మిల్లులకు తరలించాలని జిల్లా పౌరసరఫరాల అధికారి డి శివరాంప్రసాద్ చెప్పారు. గురువారం అత్తిలి మండలంలో ఆయన పర్యటించి ధాన్యం రాశులను పరిశీలించి, ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. ధాన్యం ఎక్కువగా ఎండబెడితే నూక శాతం పెరుగుతుందని, 17 శాతం ఉన్నప్పుడే మిల్లులకు పంపే ఏర్పాటు చేసుకోవాలని రైతులకు సూచించారు. ఆయన వెంట మండల వ్యవసాయశాఖ అధికారి టీకే రాజేష్ ఉన్నారు.
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
తాడేపల్లిగూడెం అర్బన్ : విద్యుత్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన పట్టణంలో కలకలం రేపింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం సరవ సూరిబాబు (38) అనే వ్యక్తి పట్టణంలోని స్వీట్స్ దుకాణానికి సంబంధించిన స్వీట్స్ తయారు చేసే యూనిట్‌లో రోజు కూలీగా పనిచేస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం ఆ ప్రాంతంలో గ్రైండర్ స్విచ్ వేస్తుండగా విద్యుత్ షాక్‌తో పడిపోయాడు. ఇది గమనించిన తోటి పనివారు బాధితుడిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి సూరిబాబు మృతి చెందినట్లు నిర్దారించారు. సూరిబాబుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.